ఎన్నికలొస్తే అధికార పార్టీని ఓడిచడానికి ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకోవడం సహజం. అది తప్పు కాదు, పాపమూ కాదు. అధికార పార్టీ బలహీనంగా ఉంటే అది కూడా వేరే పార్టీలతో కలవడం సహజం. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షాల పొత్తుల గురించి వాటి కన్నా అధికార పార్టీ వైసీపీ ఎక్కువగా మాట్లాడుతోంది. టీడీపీ–జనసేన పొత్తు గురించి మంత్రులు మాట్లాడని రోజు లేదు. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, సింహం సింగిల్ గానే వస్తుందని. కానీ టీడీపీ, జనసేన తమ పొత్తుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
తారక మంత్రం చదివినట్లు అధికార పార్టీ నాయకులు రోజూ పొత్తుల స్మరణ చేస్తున్నారు. టీడీపీ–జనసేన కలిసి పోటీ చేస్తాయా ? లేదా బీజేపీ–జనసేన కలిసి పోటీ చేస్తాయా తేల్చి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రతిపక్షాల పొత్తుల గురించి వైసీపీ ఎందుకు ఆరాట పడుతున్నదో అర్ధం కావడంలేదు. ఏపీలో ప్రస్తుతం బీజేపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న పొత్తుల వ్యాఖ్యలు, వాటికి పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరు కాషాయ నేతల్ని చికాకు పెడుతోంది.
ఇవాళ కాకపోతే రేపు పవన్ కళ్యాణ్ తమకు గుడ్ బై చెప్పడం ఖాయమనే అంచనాకు వచ్చేసిన బీజేపీ నేతలు.. అందుకు ప్రిపేర్ అయిపోయినట్లే కనిపిస్తోంది. ఏపీలో టీడీపీ-జనసేన మధ్య 2014 తర్వాత మరోసారి పొత్తుకు రంగం సిద్ధమవుతోంది. కలిసొచ్చే ప్రతిపక్షాల్ని కలుపుకుని ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు ఆఫర్లు ఇస్తుంటే.. అద్భుతం జరగొచ్చంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సంచలనం రేపుతోంది.
ఎన్నికలకు ముందే టీడీపీ-జనసేన పొత్తు కుదుర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి.
ముఖ్యంగా ఇప్పటికే పవన్ తో పొత్తులో ఉన్న బీజేపీలో అసహనం పెంచుతున్నాయి. ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందంటూ దాదాపుగా ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చేస్తున్న సంకేతాలు ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీలో అసహనం పెంచుతున్నాయి. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో బహిర్గతమైంది. వచ్చే ఎన్నికలకు చేసుకునే పొత్తులపై సోము వీర్రాజు ఇవాళ క్లారిటీ ఇచ్చేశారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందా లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారికి సోము స్పష్టత ఇచ్చినట్లయింది.
మా పొత్తు ప్రజలతోనే ఉంటుందని, ఇంకో పార్టీతో పొత్తు అవసరంలేదంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తాజా పరిస్ధితికి అద్దం పడుతున్నాయి. 2024లో బీజేపీదే అధికారమని ఆయన గొప్పగా చెప్పారు. టీడీపీతో కలుస్తాడా లేదా అన్నది పవనే చెప్పాలంటూ ఆయన మరో డిమాండ్ కూడా చేశారు. దీంతో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్న తమ ప్రస్తుత మిత్రుడు పవన్ కళ్యాణ్ నుంచి సోము కోరిన క్లారిటీ రాగానే ఈ పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ముందుకు వెళతాడా? లేక టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడా అన్నది స్పష్టం చేయాలని విజయసాయి రెడ్డి ప్రశ్నించాడు.
చంద్రబాబు పరపతి పొత్తు లేకుంటే గెలేవలేము అన్న వ్యాఖ్యలతో పలుచనబడిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నా పొత్తుల కోసం అప్పుడే ఆరాటాలు మొదలయ్యాయి అని పేర్కొన్నారు. గుంపు కట్టకపోతే 151 సీట్లు గెలిచిన పర్వతాన్ని ఢీ కొట్టలేమని బాబు గ్యాంగ్ కు అర్థమైంది అంటూ సెటైర్లు వేశారు. అందుకే వెంట్రుకతో కొండను లాగే ప్రయత్నాలు మొదలెట్టారు చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. అంతేకాదు ఎవరు ఎలా వచ్చినా, ఎన్ని పొత్తులతో వచ్చినా ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.
తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేస్తున్నవి అసమర్ధుడి అంతిమ యాత్రలు అని పేర్కొన్న తమ్మినేని సీతారాం ఒంటరిగా పోరాడే దమ్ము లేక పొత్తు పెట్టుకోవడం కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు.
సింహం సింగిల్ గానే వస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతారని, ప్రజల మద్దతు ఆయనకు ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హైదరాబాద్ ని వదిలి ఏపీకి రారంటూ పేర్కొన్నారు. గత ఎన్నికలలో ఏపీ ప్రజలు ఇచ్చిన షాక్ నుండి చంద్రబాబు ఇంకా కోలుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా సమాధి కాబోతుందని తమ్మినేని సీతారాం అభిప్రాయం వ్యక్తం చేశారు.
వైసిపి కేడర్లో ఎక్కడా అసంతృప్తి లేదని, తమలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటామంటూ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల కోసం పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు.
జగన్ సుపరిపాలన చూసి ఓర్వలేక చంద్రబాబు అండ్ కో విషం కక్కుతోందని ఆమె ఆరోపించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్న చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నాడంటూ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని, ఆయన అభిమానుల్ని చూస్తుంటే జాలేస్తోందని రోజా వ్యాఖ్యానించారు.
కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని పడగొడతాడంట అంటూ రోజా ఎద్దేవా చేశారు. ముందు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత జగన్ కు సవాల్ విసిరితే బాగుంటుందని పవన్ కు రోజా సూచించారు. చంద్రబాబు & కోకు పవర్ తప్ప ప్రజల అవసరం లేదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని రోజా పేర్కొన్నారు. జనసేన, టీడీపీ పొత్తు అంశంపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై చేస్తున్న కామెంట్లపై అధికార వైసీపీ మంత్రులు, నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని పవన్ కళ్యాణ్, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. ఏపీలో 2024లో అధికారంలోకి వస్తామని చంద్రబాబు కలలు కంటున్నారన్నారు. టీడీపీ ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. అధికారంలోకి రాలేదని అన్నారు. 2014లో సీఎం వైఎస్ జగన్ ను అధికారంలోకి రానివ్వకుండా పార్టీ పెట్టి అభ్యర్థిని కూడా పెట్టకుండా చంద్రబాబును గెలిపించానని పవన్ పిచ్చి భ్రమలో ఉన్నారన్నారు.
2019లో నాలుగు పార్టీలను కలుపుకుని వ్యతిరేక ఓటు చీలకుండా చూశానని అనుకుంటున్నారన్నారు. ఇలా అధికార పార్టీ నాయకులు, మంత్రులు పొత్తులపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు చాలానే ఉన్నాయి. ఇదో రకమైన మైండ్ గేం అని చెప్పుకోవచ్చు.