గంటా శ్రీనివాసరావు టార్గెట్ ఏంటి..? వైసీపీలో ఎంట్రీ కావాలా, అదను చూసుకుని జనసేనలోకి వెళ్తారా..? లేక టీడీపీ టైమ్ బాగుందనే అంచనా వేసుకుని ఆ పార్టీలోనే కొనసాగుతారా..? ఈ మూడింటిలో ఆయన టార్గెట్ ఏదైనా ప్రస్తుతానికి మాత్రం ఆయన మౌన ముని. ఏం మాట్లాడితే ఏ పార్టీవారికి కోపం వస్తుందో అన్నట్టుగా తయారైంది ఆయన పరిస్థితి. సొంత వియ్యంకుడు నారాయణని పోలీసులు అరెస్ట్ చేసినా కూడా గంటా నోరు తెరవలేదు.
పోనీ బంధుత్వం పక్కనపెడితే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు కదా, కనీసం ఆమాత్రం సానుభూతి గంటాకు లేదా. సానుభూతి ఉన్నా తన రాజకీయ భవిష్యత్తు కంటే అదేమంత ఎక్కువ కాదు కాబట్టి గంటా నోరు తెరవలేదని అంటున్నారు, ఆయన గురించి బాగా తెలిసినవారు. ఉనికి కోసం ఆయన ఏ కండువా కప్పుకోడానికైనా సిద్ధపడతారు, ఎవరిపైనైనా నోరు చేసుకుంటారు, అవసరమనుకుంటే అక్కడితో మౌనం వహించి మెల్లగా జారుకుంటారు.
నారాయణ అరెస్ట్ పై టీడీపీ పెద్ద రాద్ధాంతమే చేసింది. నారాయణ కుమారుడి వర్థంతి రోజున ఆయన్ని అరెస్ట్ చేస్తారా..? అసలు మీకెంత ధైర్యం..? నారాయణ విద్యాసంస్థల్ని నాశనం చేస్తారా..? మమ్మల్ని టార్గెట్ చేస్తారా అంటూ పెద్ద పెద్ద డైలాగులే కొట్టారు. నారాయణ కాస్త సౌండ్ పార్టీ కాబట్టి.. నెల్లూరు జిల్లాలో ఆయన పేరు చెప్పి నాయకులు, కార్యకర్తలంతా రోడ్డెక్కారు.
నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే టీడీపీలో అందరికంటే నారాయణకు ఎక్కువ కావాల్సిన వ్యక్తి గంటా శ్రీనివాసరావు. నారాయణ కూతుర్ని ఆయన తన కోడలిగా తెచ్చుకున్నారు. అలా వారి మధ్య వియ్యంకుల బంధం ఉంది. ఇంత బంధం, అనుబంధం ఉండి కూడా గంటా నోరు తెరవలేదు.
అసలు గంటా ఎమ్మెల్యేనేనా..?
గంటా శ్రీనివాసరావు ఆమధ్య ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాన్ని ఆమోదించుకోడానికి స్పీకర్ ని కూడా ప్రత్యేకంగా కలిశారు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు ఉక్కు పోరాటంలో పాల్గొన్నారు, మళ్లీ ఇప్పుడు సైలెంట్ అయ్యారు.
ఇటీవల చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో కూడా గంటా మిస్సయ్యారు. అయితే కేవలం కాపుల సభలకు మాత్రం ఆయన అటెండ్ అవుతుంటారు. అలా జనసేనపై కర్చీఫ్ వేసి ఉంచారని తెలుస్తోంది.
వైసీపీని ఎప్పుడూ సీరియస్ గా విమర్శించరు. వైసీపీ ఎంట్రీకి విజయసాయిరెడ్డి గట్టిగా అడ్డుపడుతున్నారు కానీ, లేకపోతే ఇప్పటి వరకూ టీడీపీ నుంచి వెళ్లిన వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేల కంటే ముందే గంటా 'జై జగన్' అని ఉండాల్సింది.
సరైన టైమ్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఆలోగా ఎంతమంది బంధువులు అరెస్ట్ అయినా ఆయన మాత్రం నోరు తెరవరు. అనవసరంగా తన ఇమేజ్ ని పణంగా పెట్టరు. అదీ గంటా స్పెషాలిటీ.