టీడీపీ మెడ‌పై ఎన్ఆర్ఐ క‌త్తి

టీడీపీ మెడ‌పై ఎన్ఆర్ఐ క‌త్తి వేలాడుతోంది. టీడీపీ టికెట్ ఆశిస్తున్న నేత‌ల్ని బ్లాక్ మెయిల్ చేయ‌డానికి కూడా చంద్ర‌బాబు వెనుకాడ‌డం లేదు. ముఖ్యంగా టీడీపీ నేత‌లు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో చురుగ్గా పాల్గొన‌క‌పోవ‌డంతో, టికెట్ ఇవ్వ‌న‌ని…

టీడీపీ మెడ‌పై ఎన్ఆర్ఐ క‌త్తి వేలాడుతోంది. టీడీపీ టికెట్ ఆశిస్తున్న నేత‌ల్ని బ్లాక్ మెయిల్ చేయ‌డానికి కూడా చంద్ర‌బాబు వెనుకాడ‌డం లేదు. ముఖ్యంగా టీడీపీ నేత‌లు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో చురుగ్గా పాల్గొన‌క‌పోవ‌డంతో, టికెట్ ఇవ్వ‌న‌ని హెచ్చ‌రించే క్ర‌మంలో ఎన్ఆర్ఐ సాకుతో బాబు బెదిరిస్తున్నార‌నే చ‌ర్చ ఆ పార్టీలో విస్తృతంగా సాగుతోంది. వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీని ఎదుర్కోవాలంటే ఆర్థికంగా బ‌లంగా వుండాల‌నే నిర్ణ‌యానికి చంద్ర‌బాబు వ‌చ్చారు.

దీంతో బాగా డ‌బ్బున్న నేత‌ల కోసం చంద్ర‌బాబు వెతుకుతున్నారు. ఈ క్ర‌మంలో గుడివాడ‌లో కొడాలి నానీని ఢీకొట్ట‌డానికి వెనిగండ్ల రాము అనే ఎన్ఆర్ఐ దొరికాడు. రామును చూపుతూ, మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా అలాంటి వాళ్లనే తీసుకొస్తానంటూ సొంత పార్టీ నేత‌ల్ని బెదిరిస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. గుడివాడ టికెట్‌ను రావి వెంక‌టేశ్వ‌ర‌రావు ఆశిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని విడిచి పెట్ట‌కుండా ఆయ‌న ప‌ని చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో అక‌స్మాత్తుగా అమెరికా నుంచి రాము దిగిప‌డ్డారు. కేవ‌లం ఆర్థక వ‌న‌రుల్ని చూసి రాముకు తాజాగా గుడివాడ టికెట్‌ను ఖాయం చేశార‌ని స‌మాచారం. రామును అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డానికి ముందు నాట‌కీయ ప‌రిణామం చోటు చేసుకుంది. గుడివాడ టికెట్‌ను ఆశిస్తున్న రావి వెంక‌టేశ్వ‌ర‌రావును పిలిచి… “కొడాలిపై గెల‌వాలంటే క‌నీసం రూ.100 కోట్లు ఖ‌ర్చు పెట్టాలి. నువ్వు అంత ఖ‌ర్చు భ‌రిస్తానంటే టికెట్ ఇస్తాను. లేదంటే ప్ర‌త్యామ్నాయం చూసుకుంటా” అని తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం.

వంద‌కోట్లు ఖ‌ర్చు పెట్టుకోలేన‌ని, మ‌రొక‌రికి చూసుకోవాల‌ని రావి వెంక‌టేశ్వ‌ర‌రావుతోనే చెప్పించిన‌ చంద్ర‌బాబు తెలివితేట‌ల‌ను ప్ర‌శంసించాల్సిందే. ఒక్క గుడివాడే కాదు… ఇలా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ రూ.50 కోట్ల‌కు పైబ‌డి ఖ‌ర్చు పెట్టుకోవాల్సిందే అని, లేదంటే ఎన్ఆర్ఐల‌ను తీసుకొస్తాన‌ని చంద్ర‌బాబు ప‌రోక్షంగా బెదిరిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీ అధికారంలోకి త‌ప్ప‌క వ‌స్తుంద‌నే క‌ల‌రింగ్ ఇస్తుండ‌డంతో కొన్ని చోట్ల ఎన్ఆర్ఐలు భారీ మొత్తంలో పెట్టుబ‌డి పెట్ట‌డానికి కూడా వెనుకాడ‌డం లేదు.

విదేశాలకు వెళ్లి పెద్ద మొత్తంలో డ‌బ్బు సంపాదించుకున్న వాళ్ల‌కు రూ.50 కోట్లు, రూ.100 కోట్లు లెక్కే కాదు. దీన్ని రాజ‌కీయంగా అనుకూలంగా మ‌లుచుకోవ‌డానికి చంద్ర‌బాబు ఎత్తుగ‌డ వేశారు. ఇదంతా సొంత పార్టీ నేత‌ల్ని అప్ర‌మ‌త్తం చేయ‌డానికే అని, బాబును న‌మ్మి ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డానికి ఎన్ఆర్ఐలు అమాయ‌కులేమీ కాద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. మొత్తానికి టికెట్లు ఆశిస్తున్న నేత‌లు, చంద్ర‌బాబు మ‌ధ్య మైండ్ గేమ్ న‌డుస్తోంది.