కోవిడ్ మహమ్మారి మళ్లీ ముంచుకొస్తోంది. దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. గత చేదు అనుభవాల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. కోవిడ్‌బారిన పడిన తర్వాత ఆందోళన చెందడం కంటే, రక్షణ చర్యలే మంచిదనే అభిప్రాయాన్ని ప్రభుత్వాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు కోవిడ్ నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వాలు తగిన సూచనలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మళ్లీ మాస్క్‌ల ఆంక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరుద్ధరించడం గమనార్హం. ముఖ్యంగా హర్యానా, కేరళ, పుదుచ్చేరి ప్రభుత్వాలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పని సరి చేశాయి. దేశ వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితులకు తగ్గట్టు సన్నద్ధం కావడంపై అంచనా వేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే మూడు కరోనా వేవ్‌లు ముగిశాయి. మొదటి దశలో జనం ఇబ్బంది పడ్డారు. మందులే లేకపోవడంతో జనం బెంబేలెత్తారు. అదృష్టం కొద్దీ మొదటి విడతలో ప్రాణ నష్టం తక్కువగా వుంది. రెండో దశలో మాత్రం కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోయారు. ఆక్సిజన్ దొరక్కపోవడం, ఆస్పత్రుల్లో వసతి కంటే రెట్టింపు సంఖ్యలో కరోనా రోగులు ఉండడంతో ప్రభుత్వాలు సైతం వైద్యం అందించడంలో చేతులెత్తేశాయి. చివరికి మృతదేహాలను సైతం కుటుంబ సభ్యులు తీసుకెళ్లడానికి భయపడిన అమానవీయ స్థితిని చూశాం.
మొదటి, రెండో వేవ్‌లతో పోల్చితే, మూడో వేవ్ కొంత నయమనిపించింది. ఇప్పుడు నాలుగో వేవ్ మళ్లీ వస్తోంది. ఇది ఎలా వుంటుందో చెప్పలేని పరిస్థితి. గతంలో కరోనాకు వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు ఇటీవల పెద్ద సంఖ్యలో గుండెపోటుకు గురవుతున్నారన్న వార్తలొస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్ కూడా ప్రమాదమే అనే ప్రచారం జరుగుతోంది.
ఏది ఏమైనా కరోనా మహమ్మారికి దూరంగా ఉండడమే శ్రేయస్కరం. దాని బారిన పడకుండా వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవడమే మనముందున్న ఏకైక ప్రత్యామ్నాయం. ఆ దిశగా ప్రతి ఒక్కరూ తమని తాము కాపాడుకోవడం బాధ్యతగా భావించాల్సిన అవసరం వుంది.