జనసేనాని పవన్‌కల్యాణ్ ఇటీవల ఢిల్లీలో పర్యటించడం రాజకీయంగా కాక రేపుతోంది. బీజేపీ అగ్రనేతలు పిలిపించారో, లేక తనే వెళ్లారో తెలియదు. కానీ బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ కోసం పవన్‌కల్యాణ్ రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాలను కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతుచూస్తారంటూ ఎల్లో మీడియా ఊదరగొట్టింది.
తీరా చూస్తే… పవన్ పర్యటన తుస్సుమంది. చివరికి నడ్డా దర్శనంతో పరువు కాపాడుకోవాల్సి వచ్చింది. పవన్‌కు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలెవరూ పట్టించుకోలేదనే చేదు నిజాన్ని జనసేన జీర్ణించుకోలేకపోతోంది. ఢిల్లీ పర్యటనతో పవన్‌కు అంత సీన్ లేదనే ప్రచారాన్ని ప్రత్యర్థులు పెద్ద ఎత్తున చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ పవన్‌కు సీరియస్ కామెంట్స్ చేశారు. ఢిల్లీకి పవన్ వెళ్లినప్పటికీ ఎవరూ రానివ్వలేదన్నారు. నడ్డాతో భేటీ అయ్యే అవకాశం దొరికినప్పటికీ, ఆయన కూడా ఏమీ చెప్పలేదన్నారు. చంద్రబాబు బాటలో నడిస్తే… ఇక జన్మలో రాజకీయంగా ముందుకు పోలేవని పవన్‌కు మంత్రి హితవు చెప్పడం గమనార్హం. మొట్టమొదటగా పవన్‌కల్యాణ్ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి సూచించారు.
ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షం అనేది చచ్చిపోయిందన్నారు. ఆ ఖాళీని పవన్ భర్తీ చేయాలని కోరారు. పవన్ అనుకుంటున్నట్టు ప్రస్తుతం జగన్‌ను గద్దె దించే పరిస్థితి లేదని మంత్రి కొట్టు తేల్చి చెప్పారు. ప్రజలంతా జగన్ వెంట ఉన్నారన్నారు. మరోసారి జగనే సీఎం అవుతారనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేయడం విశేషం.