కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత వరదరాజులరెడ్డి రాజకీయంగా మళ్లీ యాక్టీవ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన మీడియా సమావేశం పెట్టి… మరీ ప్రకటించడం గమనార్హం. 25 ఏళ్ల సుదీర్ఘకాలం ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఆయన పని చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఆయనకంటూ ప్రత్యేక వర్గం వుంది. 2009లో చివరి సారిగా ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి.
టీడీపీలో వరదరాజులరెడ్డి చేరారు. 2014లో చివరిసారిగా ఆయన ప్రొద్దుటూరు నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి, తన శిష్యుడైన రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019లో ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆ ఎన్నికల్లో ఆయన మౌనం పాటించారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన ఆదివారం మీడియా ముందుకొచ్చారు.
ప్రొద్దుటూరులో వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. వాటికి చరమగీతం పాడేందుకు రాజకీయాల్లోకి మళ్లీ రావాలని మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రజలు తనను ఆహ్వానిస్తున్నట్టు వరద చెప్పుకొచ్చారు. దీంతో ఇకపై రాజకీయంగా యాక్టీవ్‌గా వుండాలని నిర్ణయించుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు. టీడీపీలో కొనసాగుతానన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. వీలు చూసుకుని త్వరలో చంద్రబాబునాయుడిని కలుస్తానని ఆయన అన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే విషయమై బాబు సూచనల మేరకు నడుచుకుంటానన్నారు.
ప్రస్తుతం ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జ్గా ప్రవీణ్ ఉన్నారన్నారు. ప్రవీణ్‌తో కలిసి పని చేస్తానన్నారు. చంద్రబాబునాయుడు ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామన్నారు. చాలా కాలంగా ప్రవీణ్ కష్టపడి పని చేస్తున్నారన్నారు. ప్రవీణ్, తాము పరస్పరం సహకరించుకుని టీడీపీని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ప్రవీణ్‌కు టికెట్ ఇచ్చినా మద్దతుగా పని చేస్తానన్నారు. ప్రవీణ్‌కు చేయడానికి కూడా వెనుకాడనన్నారు.
టికెట్ రేస్‌లో ఉన్నానని మాత్రం స్పష్టం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. తనను నిలబడాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల కొంత కాలంగా స్తబ్ధతగా ఉన్నట్టు వరదరాజులరెడ్డి తెలిపారు. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఎన్నికల బరిలో నిలిచి పూర్వ శాంతియుత పరిస్థితులను నెలకొల్పుతామన్నారు. మరో నెలలో నియోజకవర్గంలోని తన వర్గాన్ని కలిసి టీడీపీని బలోపేతం చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.