గతంలో తన జీవితంలో జరిగిన వ్యక్తిగత అంశాలపై పరోక్షంగా స్పందించింది సమంత. కొంతమంది పేర్లు ప్రస్తావించకుండా, నర్మగర్భంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తన జీవితం తెరిచిన పుస్తకం అంటోంది సమంత. కొంతమందిలా ఫేక్ గా బతకడం తనకు నచ్చదంటోంది.
“నా జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. నా లైఫ్ తెరిచిన పుస్తకం. నా జీవితంలో ఎత్తుపల్లాల్ని పారదర్శకంగా అందరూ చూడొచ్చు. కొన్ని విషయాన్ని దాచిపెట్టడం, ఫేక్ గా ఉండడం చేస్తారు కొంతమంది. అలా చేయడం వల్ల వాళ్లకే నష్టం. వాళ్లకు తెలియకుండానే చాలా ఒత్తిడి వచ్చేస్తుంది. నాకు ఆ సమస్య లేదు. నా జీవితం తెరిచిన పుస్తకం.”
జీవితంలో సంతోషంగా ఉండడం, ప్రేమను పంచడం మాత్రమే తనకు తెలుసంటోంది సమంత. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలబడ్డానంటోంది. ప్రస్తుతం తన దృష్టిలో ప్రేమకు అర్థం మారిపోయిందని చెబుతోంది.
“నా దృష్టిలో ప్రేమకు అర్థం మారిపోయింది. కాకపోతే అది మంచిగానే. ఇన్నాళ్లూ నేను ప్రేమనిచ్చాను. కానీ జీవితంలో తొలిసారి చాలా ప్రేమను చూస్తున్నాను. గడిచిన 7-8 నెలలుగా నా ఫ్యాన్స్, ఫ్యామిలీ, సన్నిహితులు నాకు ఇస్తున్న ప్రేమ చాలా ఎక్కువ. ఇంత ప్రేమను నేను జీవితంలో చూడలేదు.”
ఇలా నర్మగర్భంగా స్పందించింది సమంత. శాకుంతలం సినిమా ప్రచారంలో భాగంగా రెగ్యులర్ గా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న సమంత.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీడియా నుంచి ఎదురవుతున్న ప్రశ్నల నుంచి తప్పించుకోలేకపోతోంది. అలా అని సూటిగా కూడా సమాధానాలు చెప్పలేకపోతోంది. మరికొన్నాళ్లు సమంతకు ఈ పరిస్థితి తప్పదేమో.