దేశంలో అన్ని రాష్ట్రాలు సాధారణ స్థితికి వచ్చేశాయి, ఎక్కడా కరోనా హెచ్చరికలు, ముందస్తు జాగ్రత్తలు లేవు. అంతా నార్మల్ అనుకుంటున్న టైమ్ లో మరోసారి కరోనా భూతం విరుచుకుపడుతోంది. ఈసారి ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి, కానీ ప్రజలే లైట్ తీసుకుంటున్నారు. అదే బాధాకరమైన విషయం.
కొన్ని రోజులుగా దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరగడంతో, అనేక రాష్ట్రాలు మళ్లీ మాస్క్‌లను తప్పనిసరి చేశాయి, మరికొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించాయి. కానీ ప్రజల్లో ఈసారి అంత చైతన్యం కనిపించడం లేదు. రద్దీ ప్రదేశాల్లో ఓ 50 మందికి ఒకరు మాస్క్ తో కనిపిస్తున్నారంతే.
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ వారం ప్రారంభంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని మరియు ఆరోగ్య సదుపాయాల సన్నద్ధతను సమీక్షించాలని కోరారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అత్యవసర సంసిద్ధతను అంచనా వేయడానికి రేపు, ఎల్లుండి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ ప్లాన్ చేశారు. ఐసీయు పడకలు, ఆక్సిజన్ సరఫరా, మెడిసన్ లభ్యత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనుంది కేంద్రం.
మూడో వేవ్ లో ఒమిక్రాన్ వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. దాని మ్యూటేషన్ బీఎఫ్7, దీని సబ్-వేరియంట్ ఎక్స్ బీబీ1-16 రకాలు ఇప్పుడు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. కరోనా లక్షణాలైన జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులతో పాటు.. ఈసారి అదనంగా దురదలు, తలనొప్పి, కడుపునొప్పి కూడా లక్షణాలుగా గుర్తించారు. వృద్ధులు, చిన్నారులు ఈసారి మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది.
ఏ రాష్ట్రం.. ఏ చర్యలు..
హర్యానా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. కేరళ రాష్ట్రం కూడా గర్భిణిలు, వృద్ధులు, షుగర్, బీపీ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి మాస్క్‌లను తప్పనిసరి చేసింది. పాండిచ్చేరిలో మాస్క్ వేసుకోవాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగేవాళ్లను వదిలిపెట్టడం లేదు. ఇక ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హాస్పిటాలిటీ, వినోద రంగాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విమానాశ్రయాల్లో మరోసారి ర్యాండమ్ టెస్టులు ప్రవేశపెట్టింది. విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే పని చేస్తోంది. కోవిడ్ పాజిటివ్‌గా తేలిన అన్ని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఇప్పటికే కోరింది. అటు ఢిల్లీ కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉంది.
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 5357 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కు చేరింది.