కూల్ డ్రిండ్ మిస్సయిందని హోటల్ ముందు ధర్నా

కూరలో ఉప్పు తగ్గితే ధర్నా చేస్తారా.. టిఫిన్ లో ఓ రకం చట్నీ మిస్సయితే రాస్తారోకోకు పిలుపునిస్తారా.. యూకేలో మాత్రం ఓ వ్యక్తి అన్నంత పని చేశాడు. తన ఆర్డర్ అసంపూర్తిగా ఉండడంతో ఏకంగా…

కూరలో ఉప్పు తగ్గితే ధర్నా చేస్తారా.. టిఫిన్ లో ఓ రకం చట్నీ మిస్సయితే రాస్తారోకోకు పిలుపునిస్తారా.. యూకేలో మాత్రం ఓ వ్యక్తి అన్నంత పని చేశాడు. తన ఆర్డర్ అసంపూర్తిగా ఉండడంతో ఏకంగా రెస్టారెంట్ ముందు ధర్నాకు దిగాడు. కెంట్‌లోని వైట్‌స్టేబుల్‌కు సమీపంలో ఉన్న మెక్ డోనాల్డ్స్ కౌంటర్ కు అడ్డంగా తన వాహనం నిలిపాడు.

డేవిడ్ షెపర్డ్ అనే వ్యక్తి మెక్ డొనాల్డ్ లో 80 పౌండ్లు పెట్టి ఓ భారీ ఆర్డర్ ఇచ్చాడు. అయితే అందులో ఫ్రెంచ్ ఫ్రైస్, కొన్ని కూల్ డ్రింక్ మిస్సయ్యాయి. ఇలాంటి టైమ్ లో ఎవరైనా ఏం చేస్తారు? కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి తమ నిరసన తెలుపుతారు, లేదంటే ఆర్డర్ రిటర్న్ చేస్తారు. ఇంకా కోపం వస్తే కంప్లయింట్ ఫైల్ చేస్తారు.

కానీ డేవిడ్ మాత్రం సదరు రెస్టారెంట్ ముందుకెళ్లాడు. తన కారును అడ్డంగా పెట్టాడు. అలా గంట పాటు నిరసన తెలియజేశాడు. ఆ తర్వాత తనే స్వయంగా కారు నుంచి దిగి, రెస్టారెంట్ ముందు రోడ్డుపై బైఠాయించాడు. ఆ తర్వాత ఓ గంటకు డేవిడ్ చేస్తున్న నిరసన కార్యక్రమంలో అతడి నలుగురు పిల్లలు కూడా పాల్గొన్నారు.

అలా 4 గంటల పాటు రెస్టారెంట్ ముందు నిరసన చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విషయం తెలుసుకున్నారు. మెక్ డొనాల్డ్స్ సిబ్బందితో మాట్లాడారు. డేవిడ్ డిమాండ్ చేసిన 80 పౌండ్ల ఆహారాన్ని ఈసారి పూర్తిస్థాయిలో ప్యాక్ చేసి ఇచ్చారు.

ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు కొన్ని డేవిడ్ కు ఎదురయ్యాయి. అయితే ఈసారి అతడు ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఓ కారణం ఉంది. తన పిల్లలకు ట్రీట్ ఇస్తానని మాటిచ్చాడు. అందుకు తగ్గట్టే భారీగా ఫుడ్ ఆర్డర్ చేశాడు. కానీ అందులో ఫ్రైస్, డ్రింక్స్ లేకపోవడంతో పిల్లల ముందు చిన్నబోయాడు. అందుకే నేరుగా వెళ్లి రెస్టారెంట్ ముందు బైఠాయించాడు. అనుకున్నది సాధించాడు.