ఏపీ రాజకీయాల్లో వైసీపీ తెలుగుదేశం తరువాత గట్టిగా చెప్పుకోవడానికి మరో పార్టీ కనిపించడంలేదు. ప్రజాస్వామ్యం అంటేనే ఒకటి కంటే ఎక్కువ చాయిస్ ఉండడం. ఏపీలో జనసేన ఆ రెండు పార్టీలకు మేమున్నాం ఆల్టరేషన్ అని పదేళ్ల రాజకీయ జీవితంలో గట్టిగా చెప్పిన దాఖలాలు లేవు.
చెప్పుకుంటే జనాలు ఏమి ఆలోచిస్తారో తెలియదు కానీ తానుగానే అధికారంలోకి వస్తామని ఒంటరిగా మొత్తం 175 సీట్లకు అభ్యర్ధులను నిలబెడతామని జనసేన చెప్పి ఎరగదనే అంటారు. అంతే కాదు రాజకీయ ప్రత్యామ్నాయం అంటే కేవలం పార్టీ పెట్టడం మాత్రమే కాదు రాజకీయ విధానాల్లోనూ ప్రత్యామ్యాయం కావాలి.
ఆ విషయంలో జనసేన ఇంకా బాలరిష్టాలతోనే ఉండగా కొత్తగా జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ ఇస్తూనే మొత్తం 175 సీట్లకు పోటీ చేస్తామని డబాయించి మరీ చెబుతోంది. ఏపీలో వైసీపీ, టీడీపీలకు తాము ఆల్టర్నేషన్ అంటోంది. కేంద్రంలోని మోడీ సర్కార్ విధానాల మీద దండెత్తుతోంది.
ఏపీలో వైసీపీ టీడీపీలకు తాము బహు దూరం అని తమ రాజకీయ విధానాన్ని చెబుతోంది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్ జగన్ సర్కార్ ని విమర్శిస్తూనే చంద్రబాబుని సైతం వదలలేదు. తూటాలు ఆ వైపుగానూ పేల్చారు. టీడీపీ రాజకీయ డొల్లతనాన్ని పూర్తిగా విడమరచి చెప్పారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీద అయితే నిప్పులే చెరిగారు. ఏపీ ప్రజలకు తాము ఒక ధీటైన రాజకీయ పార్టీగా ఉంటామని మాటలకైనా చెప్పుకొచ్చారు. ఆ ధైర్యం కానీ స్పష్టత కానీ రాజకీయ విధానం కానీ ఉంటే జనసేన ఏపీ రాజకీయాల్లో అధికారం కోసం వేస్తున్న అడుగులు ఎంతో కొంత ముందుకే పడేవి అన్నది నిష్టురమైన సత్యం.
పొత్తులు లేవు, ఎత్తులే ముక్కుసూటి వ్యూహాలే అని బీఆర్ఎస్ చెబుతున్న తీరు మాత్రం ఏపీలో జనసేనతో ఎందుకో పోలిక తెస్తోంది. రాజకీయం అంటే అలాగే చేయాలి కదా అనిపించేలా చేస్తోంది. ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు ఉన్న బీజేపీ సైతం మేమే రేపు అధికారంలోకి వస్తామని చెప్పుకుంటోంది. కాంగ్రెస్ అదే మాట అంటోంది. జనసేన మాత్రం పొత్తు చూపులు చూస్తూ తనది కాని అలవి కాని బాధ్యతలను మోస్తూ వైసీపీ వైపే చూస్తూ వ్యతిరేక ఓట్లు చీల్చోబోమని పదే పదే చెబుతోంది.
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు తమ విధానాలు చెబుతూ తమ పని తాము చేస్తే జనాలు బ్రహ్మాండమైన తీర్పులే ఇస్తారు. ఓటర్ల అవగాహన తక్కువ చేసేలా చూస్తూ ఓట్లు కలుపుతాం, విడగోడతాం, ఒకరిని పడగొడతాం మరొకరిని గెలిపిస్తామని గంభీరమైన ప్రకటనలు చేసే పరిస్థితి రాజకీయ పార్టీలకు ఉంటుందా అన్నదే ఆలోచించాల్సిన విషయం.
ప్రజాస్వామ్యంలో ప్రభువులు ప్రజలు. పార్టీలు తాము చేసే సేవ ఏంటో చెప్పుకుంటే చాలు. నేల విడిచి సాము చేయాలనుకునే వారికి మాత్రం రాజకీయాల్లో పరమ పధ సోఫానం ఎపుడూ అందని పండే అన్నది జనాలు సదా నిరూపిస్తున్న విషయం.