రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రతి దానయ్యకీ.. ఎమ్మెల్యే కావాలని, మంత్రి కావాలని, ముఖ్యమంత్రి కావాలని రకరకాల కోరికలుంటాయి, వారి వారి కుల, ఆర్థిక స్థాయులను బట్టి! జ్ఞానస్థాయులతో దానికి సంబంధం లేదు. అలాంటి కోరికలు సాధించుకునే ప్రయత్నంలో ఉంటూనే, ప్రతివాడు కూడా తన ఆత్మగౌరవాన్ని, సొంత అస్తిత్వాన్ని కాపాడుకోవాలని, నేతగా తన ముద్రను పదిలం చేసుకోవాలని భావిస్తాడు.
‘రాజకీయం’ అనే ప్రస్థానం ప్రారంభించిన నాటినుంచీ.. మరొకరికి తొత్తుగా ఉంటూ, మరొకరిని అధికారంలోకి తేవడానికి పాటుపడుతూ, మరొకరి స్క్రిప్టు ప్రకారం, మరొకరి పేమెంట్ ప్రకారం చిరకాలం కొనసాగే వాళ్లు మనకు కనిపించరు.
కానీ జనసేనాని పవన్ కల్యాణ్ రెండో రకానికి నిలువెత్తు రూపం. బిజెపిని బెదిరించేంత సీన్ లేదు గానీ, బతిమాలి అయినా సరే చంద్రబాబు జట్టులోకి బిజెపిని తీసుకురావడానికి, చంద్రదూతగా ఆయన విఫలయత్నం చూస్తే జాలి కలుగుతోంది. ఇంత పరాన్నజీవిగా, షాట్ గ్యాప్- టైంపాస్ నాయకుడిగా బతికే వ్యక్తి.. ఎన్ని దశాబ్దాలు గడిచినా సరే.. సొంతంగా నిలదొక్కుకోగలడా.. రంకెలు వేయడం కాకుండా ప్రజల కోసం ఏమైనా చేయగలడా అని సందేహం కలుగుతుంది.
పవన్ కల్యాణ్ .. సమకాలీన రాజకీయాల్లో నేతనా? దూతనా? అనే సందేహమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ!
ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేనాని పవన్ కల్యాణ్ రెండురోజుల ఢిల్లీ యాత్రకు వెళ్లారు. ఏం సాధించుకొచ్చారు? అనేది జనసైనికులకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. తిరిగిరాగానే.. పవన్ కల్యాణ్ రాజకీయం యథావిధిగా షెల్ లోకి వెళ్లిపోయింది. నాదెండ్ల మనోహర్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ వరంగల్ వెళ్లి విద్యార్థులకు ఇంగ్లీషులో హితోపదేశాలు, సూక్తులు ప్రవచించారు. తన రొటీన్ లో పడిపోయారు. రాజకీయం యథావిధిగా అటకెక్కింది. పార్టీ వ్యవహారాలు ఎప్పటిలాగా మొక్కుబడి ప్రకటనల రూపంలో నడుస్తున్నాయి.
కానీ జనసైనికుల్లో ఒక సస్పెన్స్ ఉంటుంది కదా! జనసేన లో ఉన్నవాళ్లందరూ.. ఆయన వెంబడి రాజకీయాల్లో ఎదగాలని అనుకుంటున్నవాళ్లు.. వారికి కూడా జీవనం కోసం వ్యాపారాలు ఉండవచ్చు.. కానీ పవన్ లాగా కాకుండా సీరియస్ గా ఫుల్ టైం పొలిటీషియన్లలాగా బతుకుతున్న వాళ్లు వాళ్లలో అనేకులు ఉన్నారు. వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇంతకూ తమ నాయకుడు ఢిల్లీ వెళ్లి ఏం తేల్చారో వారికి తెలియడం లేదు. వారిలో చాలా మందికి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే బాగుండుననే కోరిక ఉంది.
తమకున్న బలానికి తెలుగుదేశం బలం కూడా తోడైతే గెలుస్తామనే ఆశ ఉంది. పొత్తే ఉంటే గనుక.. తమకు గ్యారంటీగా వస్తాయని అనిపించే సీట్లలో పొత్తులు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా టీడీపీ సీట్లు అనిపించే చోట పొత్తులు వద్దనుకుంటున్నారు. ఇవన్నీ సహజం. అదంతా పక్కన పెడితే.. పొత్తుల సంగతి తేలడం వల్ల తాము మరింత చురుగ్గా, ‘ఖర్చు పెట్టాలా వద్దా తేల్చుకుని’ పనిచేయడం సాధ్యమవుతుందని చాలా మంది జనసైనికుల్లో ఉంది.
కానీ పవన్ కల్యాణ్ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాలు, వ్యతిరేక ఓటు చీలరాదు, సంస్థాగతంగా మేం ఎదగాలి, బిజెపి కూడా సంస్థాగతంగా ఎదగాలి.. లాంటి నరమానవులకు అర్థంకాని పొడిపొడి వాక్యాలతో యాత్రను ముగించారు. ఈ నేపథ్యంలో అసలు నాయకుడు ఢిల్లీకి తమ పార్టీ నేతగా వెళ్లాడా? చంద్రబాబు దూతగా వెళ్లాడా? అనే సందేహం వారికి కలుగుతోంది.
నేత గా గౌరవం పొందలేని పవన్!
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడితో పవన్ నాదెండ్ల ద్వయం సుదీర్ఘంగానే సమావేశం అయ్యారు. కానీ.. ఆయనతో కలిసి ఉమ్మడి ప్రకటన ఏదీ రాలేదు. వీరిని ఆయన ఖాతరు చేయడం లేదనడానికి అది సంకేతం. భాగస్వామ పార్టీగా వీరికి ఆయన దృష్టిలో విలువ ఉంటే, ఎన్నికలు రాబోతున్న ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి.. ‘వీరితో కలిసి’ ఒక్క నిమిషమైనా మీడియా ముందుకు వచ్చి ఉండాలి.
అయితే.. పవన్ ఢిల్లీ వెళ్లిన ఎజెండా.. చంద్రబాబునాయుడు పల్లకీ మోయడానికి బిజెపిని ఒప్పించడం. ఈ ప్రతిపాదనను ఆ పార్టీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. పవన్ కల్యాణ్ లాగా ప్రతి ఎన్నికలకు ఒక్కోతీరుగా మాట మార్చాలంటే.. వారికి సిగ్గుగా అనిపించి ఉండవచ్చు.
చంద్ర స్కెచ్ : వెళ్లింది దూత గానే!
జగన్మోహన్ రెడ్డితో 2024 ఎన్నికల్లో తలపడాలంటే.. తాను దొరికిన అందరి భుజాల మీద సవారీ చేయాల్సిందేననే భయం చంద్రబాబులో ఉంది. తన పల్లకీ మోయడానికి ఆయన ఏ ఆఫర్ తో ఒప్పించాడో గానీ.. పవన్ కల్యాణ్ మహా ఉబలాటపడుతున్నాడు. తెలుగుదేశం నాయకుల కంటె జాస్తిగా.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరాన్ని ప్రచారం చేయడానికి పవన్ ఎగబడుతున్నాడు. అయితే పవన్ ఒక్కడితో తనకు లాభమెంత? నష్టమెంత? అని చంద్రబాబునాయుడు రకరకాలుగా బేరీజు వేసుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ రాగానే.. కాపు ఓటుబ్యాంకు మొత్తం గంపగుత్తగా తెలుగుదేశానికి అనుకూలంగా మారిపోతుందని అనుకోవడం భ్రమ అనే సంగతి చంద్రబాబుకు బాగా తెలుసు. ఎందుకంటే.. కాపులు సంఖ్యాపరంగా నెంబర్ వన్ గా ఉన్న రెండు నియోజకవర్గాలను ఎంచుకుని ఒక్కచోట కూడా గెలవలేకపోయిన పవన్ కల్యాణ్ అసమర్థత గురించి ఆయనకు బాగా క్లారిటీ ఉంది. అలాగే అటు అధికార వైఎస్సార్సీపీలోనూ కాపు నాయకులు బాగానే ఉన్నారు. తన తెలుగుదేశంలో కూడా ఉన్నారు. మరి కాపుకులమంతా.. పవన్ వెన్నంటి ఉంటుందని అనుకోవడం భ్రమే. పవన్ రంకెలు వేసే ప్రసంగాలకు విజిల్సొ కట్టే బ్యాచ్ ఓట్లు వేసే రకం కాదని కూడా చంద్రబాబుకు తెలుసు.
మరి, ఇంతసుదీర్ఘ అనుభవంతో అన్నిటినీ బేరీజువేయగలిగిన చంద్రబాబు పవన్ కల్యాణ్ తో స్నేహానికి ఆరాటపడడానికి ఏకైక కారణం ఆయన తన వెంట భారతీయ జనతా పార్టీని కూడా తీసుకువస్తాడని మాత్రమే. మరో కోణంలో ఆలోచించినప్పుడు.. 2019 ఎన్నికల తర్వాత.. పవన్ కల్యాణ్ ను ఈ ముందు చూపుతోనే బిజెపి జట్టులోకి పంపించారని కూడా కొందరు అంటుంటారు. ఈ విశ్లేషణ ఓకే గానీ.. బిజెపితో మైత్రి మాత్రం చంద్రబాబుకు ఎందుకు? అనే సందేహం పలువురికి కలుగుతుంది.
బిజెపి తనతో స్నేహబంధానికి ఒప్పుకోదు అనే సంగతి చంద్రబాబుకు తెలుసు. మోడీ ప్రభుత్వం పట్ల గతంలో తాను పాల్పడిన వంచన, నీచమైన ఎత్తుగడలు, వారికి వ్యతిరేకంగా చేసిన గోబెల్స్ ప్రచారం, రాజధాని కావొచ్చు- పోలవరం కావొచ్చు.. తన చేతగానితనాన్ని పూర్తిగా బిజెపి మీద నెట్టేసి మోడీని తెలుగు ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి ఆయన చేసిన సాహసం వీటన్నింటినీ బిజెపి అంత త్వరగా మర్చిపోదని చంద్రబాబుకు తెలుసు. అందుకే తాను నేరుగా వెళ్లి పొత్తులకోసం వారిని బతిమాలి, భంగపడకుండా చంద్రబాబును తన దూతగా ఆయన పంపారు. అద్భుతమైన నటుల్లో ఒకడైన పవన్ కల్యాణ్.. దూత పాత్రను నిర్వర్తించారు. పాత్రకు తగ్గట్టుగా చంద్రబాబునాయుడు సిద్ధంచేసిన స్క్రిప్టును ఢిల్లీలో పెద్దల ఎదుట చదివి వినిపించారు. పాచిక పారలేదు.
బిజెపి కి ఓటు బ్యాంకు లేకపోవచ్చు గాక.. కానీ వారి అండ లేకపోతే వచ్చే ఎన్నికల్లో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించలేను అనేది చంద్రబాబునాయుడు భయం. రకరకాల కారణాలున్నాయి.
చంద్రబాబునాయుడు కోటరీ కుబేరులంతా రాబోయే ఎన్నికలను చావోరేవో అన్నట్టుగా పరిగణిస్తున్నారు. అందరూ తమ బ్లాక్ మనీ కొండలను కరిగించి డబ్బు కట్టలు బయటకు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలకోట్లు ఖర్చు పెట్టి అయినా సరే.. రాబోయే ఎన్నికల్లో వైసీపీని పతనం చేయాల్సిందేఅనేది వారి పట్టుదల. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే.. తమ దోపిడీలకు శాశ్వతంగా చెక్ పడిపోతుందనేది వారి భయం.
అయితే.. ఎన్నికలను ఎదుర్కోవడంలో కోట్లకు కోట్ల డబ్బు సరఫరా, ఓటర్లను కొనడానికి డబ్బు పంచడం ఇత్యాది కార్యకలాపాలన్నీ నిర్వఘ్నంగా సాగాలంటే.. తమకు పెద్దల అండ ఉండాలనేది చంద్రబాబు ఆలోచన. అందుకే ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని భారతీయ జనతా పార్టీని తమ జట్టులో కలుపుకుని.. వారికి కూడా వారి బలానికి, అర్హతలకు మించిన సంఖ్యలో సీట్లు పంచి, అవసరమైతే వారి ఖర్చులు కూడా తానే భరిస్తూ ఎన్నికలను ఎదుర్కోవాలని ఆయన తలపోస్తున్నారు.
బిజెపి లేకుండా పవన్ వస్తే ఏంటి?
భారతీయ జనతా పార్టీ తాను చెప్పినట్టుగా వినకపోతే, పవన్ కల్యాణ్ తన జనసేనతో మాత్రమే తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకుంటారని, ఆ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తాయని, బిజెపి ఒంటరి అవుతుందని చాలా మంది ఊహిస్తున్నారు. కానీ.. ఇలా జరిగే అవకాశం లేదు. అందరి అంచనాలకు అందనిది చంద్రబాబు స్కెచ్.
బిజెపి లేకుండా పవన్ కల్యాణ్ వచ్చి తన పార్టీతో జతకడతానంటే.. చంద్రబాబునాయుడు దగ్గరకు కూడా రానివ్వరు. పవన్ కు పదిసీట్లు అయినా సరే.. పంచడం వల్ల తనకు ఒరిగేదేమీ లేదని ఆయనకు తెలుసు. అందుకని ఆయనే పవన్ ను దూరం పెట్టే వాతావరణం ఉంది. పైగా, బిజెపి లేకుండా పవన్ తో జతకడితే గనుక.. తమ భాగస్వామ్య పార్టీని లాక్కువెళ్లాడని కమలదళం తనపై కక్ష కడుతుందని ఆయనకు భయం కూడా.
పవన్ ప్రస్తుతం పాటిస్తున్న మౌనానికి కారణం కూడా అదే. తనేమో ఢిల్లీ వెళ్లి చంద్రబాబుతో కలవడానికి నడ్డాతో సంప్రదింపులు జరపడం ద్వారా.. చంద్రబాబునాయుడు దూతగా బయటపడిపోయారు. ఆ రకంగా.. బిజెపి వద్ద ఒక పార్టీ నేతగా తనకు దక్కగల గౌరవాన్ని ఆల్రెడీ కోల్పోయారు. దూతగా కార్యం నెరవేరలేదు. ఇటు చూస్తే , చంద్రబాబునాయుడు కూడా మొహం చాటేసే పరిస్థితి. వస్తే గిస్తే కమలంతో కలిసి మాత్రమే రావాలని ఆయన అంటారు.
బిజెపిని పూర్తిగా వదిలేయాలంటే పవన్ కు భయం!
చంద్రబాబుతో జట్టు కట్టినా సరే.. మోడీని, అమిత్ షాను నిత్యం స్తుతిస్తూ వారితో సత్సంబంధాలు మాత్రమే కలిగి ఉండాలనేది పవన్ కోరిక, వ్యూహం. పూర్తిగా ఆ పార్టీని వదిలేయాలంటే ఆయనకు భయం. అందుకే కర్నాటక ఎన్నికలలో ఆ పార్టీకి ప్రచారం కూడా నిర్వహించి.. మీకోసం నేను కష్టపడతాను అనే ఇంప్రెషన్ ఇచ్చి తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తీసుకున్నా పరవాలేదని ఆయన ఆలోచన.
బిజెపిని పూర్తిగా కాలదన్నుకుంటే గనుక.. వారు తనమీద కక్ష కడితే.. తన బతుకు తెరువు కోసం చేస్తున్న వ్యాపారం కుప్పకూలిపోతుందనేది ప్రధాన ఆందోళన. రోజుకు నాలుగు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ (బ్లాక్ అండ్ వైట్ కలిపి) తీసుకునే పవన్ కల్యాణ్, వాటికి పద్ధతిగా టాక్సులు కట్టాలంటే సాధ్యం కాదు. పైగా కేంద్రం కక్ష కడితే గనుక, తనకు దినానికి నాలుగేసి కోట్లు ఇచ్చే ఒక్క నిర్మాత మీద ఐటీ దాడి జరిగినా చాలు. ఒక్కరి లొసుగులను వారు గట్టిగా పట్టుకున్నా చాలు. అక్కడితే.. తనతో సినిమా అంటేనే నిర్మాతలు భయపడతారని, ఇచ్చిన పదుల కోట్ల ఎడ్వాన్సులు కూడా వదులుకుని పారిపోతారని పవన్ కు క్లారిటీ ఉంది. ఆ రకంగా తన నట వ్యాపార ప్రస్థానికి ఎండ్ కార్డు పడుతుందని ఆయన భయం. అందుకే బిజెపికి పూర్తిగా దూరం కాలేదు.
ఏతావతా పవన్ కల్యాణ్ ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలాగా తయారయ్యారు. ఆయన బిజెపిని వదలి రాలేరు. బిజెపిని వదలి వచ్చినా చంద్రబాబు రానివ్వరు. చంద్రబాబు పల్లకీ మోయడానికి సిద్ధపడడం కంటె.. తాము అవసరమైతే ఒంటరిగా మిగిలిపోయి అయినా సరే.. ఉన్న ఒక్కశాతం ఓటు బ్యాంకును రెండు శాతానికి పెంచుకుంటే చాలు అనేది కమలదళం వ్యూహం. ఇన్ని సందిగ్ధతల మధ్య రాష్ట్ర రాజకీయం మొత్తం అయోమయావస్థలోకి వెళుతోంది.
ప్రధానంగా జనసైనికుల పరిస్థితి జాలిగొలుపుతోంది. పవన్ ను నమ్ముకుని, కులరాజకీయం చేసి అయినా సరే.. ఈసారి చట్టసభలో అడుగుపెడతాం అని ఆ పార్టీలోని చాలా మంది కలగన్నారు. తెలుగుదేశం దన్ను తీసుకుంటే కొన్ని సీట్లు దక్కుతాయనే ఆశ వారిని నడిపించింది. ఇప్పుడు తాను చంద్రబాబు దూతగా బయటపడిపోవడం వలన.. జనసేనకు పెనునష్టం వాటిల్లనుంది.
జనసేన–బిజెపి రెండు పార్టీలు మాత్రమే ఒక జట్టుగా, 2024 ఎన్నికల్లో త్రిముఖ పోటీలో తలపడాలని డిసైడ్ చేస్తే .. పవన్ అనుచరులు చాలా మంది పార్టీని వీడిపోయే ప్రమాదం ఉంది. ఆ నష్టాన్ని పవన్ కల్యాణ్ ఎలా భర్తీ చేసుకుంటారో చూడాలి.
.. ఎల్ విజయలక్ష్మి