ఏపీ అసెంబ్లీ కోటాలో జరుగుతున్న మూడు రాజ్యసభ సీట్ల ఎన్నిక విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూడు సీట్లకూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేస్తుందని, ఎవరైనా దళితుడిని నిలబెట్టి తమకు దక్కని ఈ సీటు విషయంలో చంద్రబాబు నాయుడు రాజకీయ కుతంత్రం చేయబోతున్నాడనే ప్రచారం జరిగింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదనే క్లారిటీ వచ్చిన అసంతృప్త ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఈ మంత్రాంగం నడపనున్నాడని వార్తలు వచ్చాయి. రాజ్యసభ స్థానం దక్కాలంటే 43 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున అధికారికంగా ఉన్నది 18 మంది ఎమ్మెల్యేలే! మరో పాతిక మంది సభ్యుల మద్దతు లభిస్తే కానీ తెలుగుదేశం అభ్యర్థి ఊసులో ఉండడు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ నిరాకరింపబడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య గట్టిగానే ఉంది. యాభైకి పైగా స్థానాల్లో సిట్టింగులను మారుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయానికి మంచి పని తగిలిందనుకున్నారంతా!
అయితే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్స్ నుంచి మద్దతు పొందాలంటే భారీగా సంచులు మారడంతో పాటు, ఎన్నికల్లో టికెట్ హామీని కూడా వారు కోరతారు! అలా కోరడంలో పెద్ద ఆశ్చర్యం లేదు కూడా! ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దనుకున్న చాలా మందికి తెలుగుదేశం పార్టీ పెద్ద పీట వేస్తోంది. మరి ఇప్పుడు ఒక రాజ్యసభ సీటు కోసం ఏకంగా అన్ని అసెంబ్లీ స్థానాల విషయంలో చంద్రబాబు నాయుడు రచ్చ రాజేసుకోవడానికి సిద్ధంగా లేనట్టున్నారు. అందుకే రాజ్యసభ ఎన్నికల విషయాన్ని పట్టించుకోవద్దని తమ పార్టీ నేతలకు స్పష్టం చేశారట. దీంతో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ ఎన్నికలో నామినేషన్ కూడా ఉండబోదని తెలుస్తోంది.