తూతూ మంత్రంగా తొలి అడుగు

ఉమ్మడి విశాఖ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఇదే తీరుగా సాగుతున్న తొలి అడుగు పట్ల స్పందన అయితే అంతగా లేదనే అంటున్నారు.

రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి పాలనకు ఏడాది పూర్తి అయింది. సూపర్‌ సిక్స్‌ పేరుతో అనేక హామీలను జనంలో ఉంచి మరీ అధికారం అందుకున్నారు. ఇష్టానుసారం వాగ్దానాలు చేసి పాలన చేపట్టిన కూటమి పెద్దలు దాదాపుగా అన్ని హామీలూ అమలు చేశామని చెబుతున్నారు. ఏడాదిగా సుపరిపాలన సాగుతోంది అని చెబుతూ తెలుగుదేశం పార్టీ జనంలోకి తమ ఎమ్మెల్యేలను పార్టీ నాయకులను పంపుతోంది. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటికీ తిరిగి ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచిని గురించి చెప్పాలని అధినాయకత్వం ఆదేశించింది. అయితే ఆచరణలో ఏ తీరున ఈ కార్యక్రమం సాగుతోంది అంటే తూతూ మంత్రంగానే అని అంటున్నారు.

మొదటి రోజున అయితే కాస్తా ఘనంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రులు ఎమ్మెల్యేలు తరువాత నుంచి నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. ఇంటింటికీ వెళ్ళడం వల్ల కాదనుకున్న వారు పార్టీ కార్యకర్తలకే బాధ్యతలు అప్పగిస్తున్నారు. మరో వైపు చూస్తే పెద్ద స్థాయి నాయకులు వారు ఇంటింటికీ వెళ్ళకుండా ప్రధాన కూడళ్ళలో జనాలను పోగు చేసి ప్రభుత్వం గురించి నాలుగు మంచి మాటలు చెప్పి అయింది అనిపిస్తున్నారు. దాంతో తెలుగుదేశం అధినాయకత్వం ఈ కార్యక్రమం ద్వారా ఆశించింది ఏమిటి జరుగుతున్నది ఏమిటి అన్న చర్చ అయితే సాగుతోంది.

నిజానికి ఈ కార్యక్రమం ద్వారా జనాల్లోకి తెలుగుదేశం పార్టీ చొచ్చుకుని పోవాలన్నది హైకమాండ్‌ ఆలోచన. ఏడాదిలో ఎన్నో మంచి పనులు చేశామని వాటిని జనాల వద్దకు తీసుకెళ్ళి మార్కులు వేయించుకుంటే పార్టీకి క్షేత్ర స్థాయిలో తిరుగు ఉండదని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. అయితే ఆచరణకు వచ్చేసరికి మాత్రం నాయకులకు అడుగులు ముందుకు పడడంలేదు. సూపర్‌ సిక్స్‌ హామీలు అన్నీ నెరవేర్చామని ధైర్యంగా ఎవరూ చెప్పలేని వాతావరణం ఉంది.

సామాజిక పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేల దాకా పెంచారు. దాని వరకూ సరే అనుకున్నా ఆ పెన్షన్లలో కూడా అనర్హత పేరుతో కోత పడుతోందని, గతంలో అందుకున్న వారిలో కొందరిని తప్పిస్తున్నారు అన్న ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే తల్లికి వందనం పధకం ద్వారా తల్లుల ఖాతాలలో నేరుగా నగదు వేస్తున్నామని చెబుతున్నారు. కానీ అనేక ఆంక్షలను పెట్టి తమను అనార్హులుగా చూపించడం పట్ల చాలా మందిలో అసంతృప్తి కనిపిస్తోంది. వివిధ రకాలైన కారణాలతో ప్రతీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ పధకం నుంచి తిరస్కరించిన వారి జాబితా ఉంది.

వింత ఏమిటి అంటే ప్రభుత్వ కార్యాలయాలలో అతి తక్కువ జీతంగా కేవలం పది వేల రూపాయలు మాత్రమే అందుకుంటున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు వంటి వారిని ప్రభుత్వ పధకాలకు అనర్హులను చేశారు. విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటితే అటువంటి కుటుంబాలకూ పధకాలు అందవని తేల్చేశారు. అదే విధంగా చూస్తే అది పంట భూమా కాదా అన్నది చూడకుండా అయిదు ఎకరాలు పల్లం, పదెకరాలు మెట్టు భూమి ఉన్నా వారినీ పధకాలకు అనర్హులని ముద్ర వేశారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన పధకాలలోనూ కోతలే ఎక్కువగా ఉన్నాయని జనాలలో అసంతృప్తి ఉంది ప్రభుత్వం చెబుతున్న పధకం ఏదీ తమకు దక్కలేదు అన్న ఆవేదన అయితే చాలా మందిలో పేరుకునిపోయింది. దాంతో వారంతా తమ వద్దకు వచ్చే నేతలను ఇదే విషయం మీద ప్రశ్నిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైన నేపధ్యంలో రైతులు తమ ఖాతాలలో అన్న దాత సుఖీభవ నిధులు ఎపుడు వేస్తారు అని అడుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లక్షలలో ఖాళీగా ఉంటే గడచిన ఏడాది కాలంలో ప్రభుత్వం వాటిని భర్తీ చేయలేదన్న ఆగ్రహం నిరుద్యోగ యువతలో ఉంది. నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఏమైంది అన్నది కూడా వారి నుంచి ప్రశ్నగా వస్తోంది.

ఇక ఉత్తరాంధ్రా జిల్లాలలో అభివృద్ధి కూడా ఏమీ పెద్దగా లేదని అంటున్నారు. గతంలో ఎలా ఉందో ఇపుడూ అదే పరిస్థితి కనిపిస్తోంది. పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని చెబుతున్నా అత్యంత వెనకబడిన శ్రీకాకుళం లాంటి జిల్లాకు ఏమి ఒరిగింది అన్నది అక్కడ జనంలో ఆవేదనగా ఉంది. జిల్లాలో అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడంలేదని అంటున్నారు. అదే సమయంలో శ్రీకాకుళంలో కార్గో ఎయిర్‌ పోర్టు నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టడం కూడా ప్రజలలో అసంతృప్తికి కారణం అవుతోంది.

మరో వైపు చూస్తే ఏడాదిగా టీడీపీలో కార్యకర్తలకు నాయకులకు మధ్య ఒక అంతరాయం ఏర్పడిరది. అధికారంలోకి వచ్చాక తమని పట్టించుకోలేదన్న బాధ అయితే కార్యకర్తలలో పేరుకుపోతోంది. దాంతో ఇపుడు వారు కలసిరావడంలేదని అంటున్నారు. అలాగే ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఆశలు పెట్టుకున్న నామినేటెడ్‌ పదవులు కొందరికే దక్కాయి, చాలా మంది వెయింటింగ్‌ లిస్ట్‌ లో ఉన్నారు.

ఇపుడు అంతా కలసి జనం వద్దకు వెళ్ళాలంటే భారంగా భావిస్తున్న వారూ పసుపు శిబిరంలో ఉన్నారు. ఈ నేపధ్యంలో కొందరు నాయకులు అయితే తాము ముఖ్యమైన చోట్లకే వెళ్తూ మిగిలిన వాటిని నచ్చచెబుతూ కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. అలా ఇంటింటికీ కార్యకర్తలు వెళ్ళి పార్టీ తరఫున కరపత్రాలను ప్రజలకు అందిస్తున్నారు. అంతా బాగుందని చెబుతూ జనాల అభిప్రాయం తీసుకుంటున్నారు. అసంతృప్తి లోపల ఉన్నా ఎందుకొచ్చిన తంటా అని జనాలు బాగానే అంతా ఉందని రాసుకోమంటున్నారు.

అలా వారితో కలసి ఒక సెల్ఫీ తీసుకుంటూ కార్యర్తలు పని అయింది అనిపిస్తున్నారు. అయితే అంతా బాగుందని ప్రతీ ఇంటి నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నా అది నిజమైనది కాదని అందరికీ తెలుసు అంటున్నారు. తమకు పధకాలు అందడం లేదని నాయకులను కార్యకర్తలను ప్రజలు నేరుగా ప్రశ్నించడమే దానికి ఉదాహరణ అని గుర్తు చేస్తున్నారు. ఈ విధంగా తమ్ముళ్ళెమో అన్యమనస్కంగా జనాలు అసంతృప్తిగా ఉంటూండగానే మెల్లగా తొలి అడుగు పడుతోంది.

ఉమ్మడి విశాఖ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఇదే తీరుగా సాగుతున్న తొలి అడుగు పట్ల స్పందన అయితే అంతగా లేదనే అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే ఇది ఒక్క రోజు కార్యక్రమంగా మాత్రమే అంతా చేసి మమ అనిపించేశారనే విమర్శలు ఉన్నాయి.

7 Replies to “తూతూ మంత్రంగా తొలి అడుగు”

Comments are closed.