తమ్ముళ్ళ తిరక్రాస్…వైసీపీ అజేయం

తమ్ముళ్ళు ఎందుకో సొంత పార్టీని వదిలి ప్రత్యర్ధి పార్టీని తెగ ప్రేమించేస్తున్నారు. ఒక వైపు ఏడు పదుల వయసులో చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని ఏపీలో ఊరూ వాడా తిరుగుతున్నారు. వైసీపీ అంటే ఆయన…

తమ్ముళ్ళు ఎందుకో సొంత పార్టీని వదిలి ప్రత్యర్ధి పార్టీని తెగ ప్రేమించేస్తున్నారు. ఒక వైపు ఏడు పదుల వయసులో చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని ఏపీలో ఊరూ వాడా తిరుగుతున్నారు. వైసీపీ అంటే ఆయన బాగా మండిపోతున్నారు. ఈ ప్రభుత్వం పోవాలని ఆయన తెల్లారిలేస్తే పదే పదే అంటూ ఉంటారు.

అలాంటి ఆగర్భ ప్రత్యర్ధి వైసీపీ మీద పసుపు తమ్ముళ్లు ప్రేమ చూపిస్తే పరవశంతో తమ వశం తప్పిన అభిమానాన్ని చూపిస్తే అది మా చెడ్డ తిరకాసే అవుతుంది. అందుకే జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి క్రాస్ ఓటింగ్ జరిగి వైసీపీ వారిని మంచి మెజారిటీతో గెలిపించసింది.

జీవీఎంసీలో పది స్థానాలకు జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ సభ్యులే చైర్మన్లు అయ్యారు. అంతా కూడా బంపర్ మెజారిటీని సొంతం చేసుకున్నారు. నిజానికి జీవీఎంసీలో వైసీపీ అసలైన బలం 62 సభ్యుల మెజారిటీ. కానీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ల ఎన్నికల్లో కొందరు చైర్మన్ అభ్యర్ధులకు ఏకంగా 67 ఓట్లు కూడా వచ్చాయి. అంటే అయిదు ఓట్లు ఇతర పార్టీల నుంచి అలా క్రాస్ అయ్యాయి అన్న మాట.

మరి ఈ ఓట్లు ఎక్కడివీ అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం నుంచి క్రాస్ అయ్యాయని లెక్క వేస్తున్నారు. టీడీపీ కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే వారికి ఉన్న 29 మంది సభ్యులల్లో అందరూ ఆ పార్టీకి ఓటు చేయలేదని లెక్కలు చెబుతున్నాయి. 

దాంతో పోటీ చేసిన వారిలో కొందరుకి 25 ఓట్లు కూడా వచ్చాయి. అక్కడ తగ్గిన ఓట్లు ఇక్కడ వైసీపీకి జమ అయ్యాయన్న మాట. ఇలా క్రాస్ చేసి పార్టీని తిరకాసులోకి నెట్టిన తమ్ముళ్ల మీద పార్టీ నుంచి యాక్షన్ ఉంటుందా.