సోముకు.. ప్రజలపై జాలి పొంగిపోతోందే!

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని, తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్క అంగుళం కూడా ముందుకు తీసుకువెళ్లకుండా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మెయింటైన్ చేస్తున్న…

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని, తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్క అంగుళం కూడా ముందుకు తీసుకువెళ్లకుండా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మెయింటైన్ చేస్తున్న సందర్భాన్ని, ఆ పార్టీ అధ్యక్ష్క్షుడు సోము వీర్రాజు చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. 

రెండేళ్ల పదవీకాలంలో ఆయన పార్టీని ఏం ఉద్ధరించారని అనుకున్నారో గానీ.. వారు అభినందన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీ ప్రజల మీద విపరీతమైన జాలి, అభిమానం కురిపించారు. ఏపీలోని ప్రజలను తాకట్టు పెట్టి జగన్ అప్పులు తెస్తున్నారట! మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టి.. రాజధానిని మార్చేస్తున్నారట.. ఈ తరహాలో. సోము వీర్రాజు గారి విలాపాలు ఇంకా ఏమేమో ఉన్నాయి. 

సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత.. ఇప్పటిదాకా ఆయన ప్రతిభతో ఏం చేశారో అర్థం కావడం లేదు. ఇతర పార్టీలనుంచి ఒక్కరంటే ఒక్కరైనా విలువైన, పార్టీకి ఉపయోగపడగల నాయకుడు.. సోము వ్యూహచాతుర్యం వల్ల వచ్చి వారితో జత కట్టారా? కమలతీర్థం పుచ్చుకున్నారా? అంటే లేదు. 

ప్రజాప్రతినిధులు హఠాన్మరణానికి గురైనప్పుడు.. ఉప ఎన్నికలో పోటీ పెట్టకూడదనే సాంప్రదాయాన్ని పక్కన పెట్టి.. రెండుచోట్ల ఎమ్మెల్యే ఎన్నికల్లో బిజెపిని, తెలుగుదేశం పార్టీ కూడా లేని బరిలోకి దింపి.. ఏవో కాసిని ఓట్లు సంపాదించడం మినహా సోము సాధించిందేమీ లేదు. 

జనసేన వంటి బలమైన ప్రజాదరణ కలిగిన నాయకుడిని తమ పొత్తుల్లో ఉంచుకుని.. ఉమ్మడిగా ఒక్క రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని, పోరాటాన్ని నిర్వహించడం కూడా ఆయనకు చేతకాలేదు. అలాంటి సోము వీర్రాజు.. జగన్ ప్రజల్ని తాకట్టు పెడుతున్నారంటూ.. ఉబుసుపోని మాటలు మాట్లాడుతున్నారు.

ప్రత్యేకహోదాను బూచిగా చూపిస్తూ.. బిజెపిపై నిందలు వేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఊరూ పేరూ లేని వారితో తిట్టించడం కాకుండా.. జగన్, ప్రధాని మోడీని నేరుగా విమర్శించాలని రెచ్చగొడుతున్నారు. అయినా, ‘ప్రత్యేకహోదాను బూచిగా చూపించి’ అనే మాటను సోము ఎలా అనగలుగుతున్నారో అర్థం కావడం లేదు. 

ఎవరో చూపిస్తే, చెబితే తప్ప.. హోదా అంటే ఏంటో ప్రజలెవ్వరికీ తెలియదా? ప్రజల్ని తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి అప్పులు తెస్తున్నారని మొసలి కన్నీరు కార్చే బదులుగా.. అసలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనేది వస్తే.. అప్పులు చేయవలసిన అవసరమే ఉండదని, ప్రజలకు కొల్లలుగా ఉద్యోగావకాశాలు ఏర్పడతాయనే సంగతి సోముకు తెలియదా? 

ఆయనకు ప్రజల మీద అంత ప్రేమే ఉంటే గనుక.. తమ పార్టీతో మంతనాలు జరిపి ప్రత్యేకహోదాను సాధింవచ్చు కదా.. అని ప్రజలు విమర్శిస్తున్నారు.