అగ్నిని ఆర్పేసేది వాయువే.. తెలుసా చంద్రబాబూ!

చంద్రబాబునాయుడు తన ఎన్నికల ప్రచారాన్ని కూడా కవితాత్మకంగా సాగించాలని అనుకుంటున్నారు. రకరకాల ఉదాహరణలు పోలికలు వాడుతున్నారు. రోజువారీ ఆయన జగన్ మోహన్ రెడ్డిని తిట్టిపోసే సంగతులను పక్కన పెడితే.. ఇవాళ తాడేపల్లిగూడెం జెండా సభలో…

చంద్రబాబునాయుడు తన ఎన్నికల ప్రచారాన్ని కూడా కవితాత్మకంగా సాగించాలని అనుకుంటున్నారు. రకరకాల ఉదాహరణలు పోలికలు వాడుతున్నారు. రోజువారీ ఆయన జగన్ మోహన్ రెడ్డిని తిట్టిపోసే సంగతులను పక్కన పెడితే.. ఇవాళ తాడేపల్లిగూడెం జెండా సభలో ఆయన కొత్తగా చెప్పిన పోలిక ఒక్కటే. తెలుగుదేశం పార్టీ అనే అగ్నికి, పవన్ కల్యాణ్ వాయువులా తోడయ్యాడట.

ఆ సభకు హాజరైన జనాన్ని చూస్తోంటే.. ఇక తెలుగుదేశం విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని అనిపిస్తోందట. అయితే తాను ప్రస్తావించిన వాయువు పోలికకు రెండు అర్థాలు వస్తాయని, రెండో అర్థం ప్రాణాలమీదికే వస్తుందని ఆయన గ్రహించి ఉండకపోవచ్చు.

తెదేపా అగ్నికి వాయువులాగా పవన్ తోడయ్యారని అంటున్నారు. ఆయన ఊహిస్తున్నట్టుగా.. మంటలకు గాలి జత కలిసిందంటే అవి మరింతగా పెరుగుతాయి. అలాంటి మంటలు మొత్తం అడవినే దహించివేసే సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి మంటలనే దావానలం అంటారు. తమ రెండు పార్టీల పొత్తులను వాటితో పోల్చుకోవడం చంద్రబాబుకు గొప్ప మజా ఇచ్చినట్టుగా ఉంది.

మంచిదేగానీ.. చంద్రబాబు ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు.

గాలి తోడైతే మంటలను పెంచి విధ్వంసం సృష్టించడం అనేది మంటలుగా పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అవే మంటలు చిన్నవిగా ఉన్నప్పుడు.. గాలిపెద్దగా వీస్తే ఆ మంటలను ఆర్పేస్తుంది. అంటే ఏమిటన్నమాట? గాలిది ఎప్పుడూ కూడా అవకాశవాద పాత్ర అన్నమాట. చిన్న మంటను చిదిమేస్తుంది.. పెద్ద మంటను ఎగదోస్తుంది?

ప్రస్తుత పొత్తు బంధాల విషయంలో కూడా పవన్ కల్యాణ్ బుద్ధి అచ్చంగా ఇలాంటి అవకాశవాద బుద్ధితో కూడినదే అని చంద్రబాబునాయుడు ఇండైరక్టుగా తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని అనుకుంటున్నప్పుడు.. ఆ పార్టీకి పొత్తు ఇవ్వడానికి పవన్ డిసైడ్ అయ్యారు. అదే 2019 ఎన్నికల సమయంలో.. తెలుగుదేశం గ్రాఫ్ గొప్పగా లేనప్పుడు.. ఆయన పొత్తుల్లోంచి బయటకు వచ్చేసి ఒంటరిగా పోటీచేశారు. తద్వారా.. తెలుగుదేశం అనే అగ్నిని ఆర్పివేయడంలో తన వంతు పాత్ర పోషించారు.

ఇప్పుడు గ్రాఫ్ బాగుందని అనుకుంటుండగా.. వారితో కలిసి అధికారం పంచుకోవాలని మోజు పడుతున్నారు. ఈ పవన్ కల్యాణ్ ది కూడా అలాంటి అవకాశవాద వైఖరే కదా అని ప్రజలు నిరసిస్తున్నారు.