డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకాని క్రిష్

రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో అనూహ్యంగా దర్శకుడు క్రిష్ పేరు తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, క్రిష్ ను కూడా నిందితుడిగా చేర్చారు. విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. Advertisement తను…

రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో అనూహ్యంగా దర్శకుడు క్రిష్ పేరు తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, క్రిష్ ను కూడా నిందితుడిగా చేర్చారు. విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు.

తను రాడిసన్ కు వెళ్లిన విషయం నిజమేనని అంగీకరించిన క్రిష్, పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ప్రకటించాడు. అలా ప్రకటించి 24 గంటలైనా గడవకముందే, తను హాజరుకాలేకపోతున్నానంటూ పోలీసులకు సమాచారం అందించాడు.

అవును.. ఈరోజు పోలీస్ విచారణకు క్రిష్ హాజరుకాలేదు. అనివార్య కారణాల వల్ల తను ఎంక్వయిరీకి హాజరుకాలేకపోతున్నానని, 2 రోజులు గడువు కావాలని కోరుతూ, శుక్రవారం వ్యక్తిగతంగా హాజరవుతానని పోలీసులకు వెల్లడించాడు.

రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు మంజీరా గ్రూప్ అధినేత వివేకానంద్. ఇతడిచ్చిన వాంగ్మూలం ఆధారంగానే క్రిష్ పేరున ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇతడికి, క్రిష్ కు మధ్య ఏ స్థాయిలో సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలనుకుంటున్నారు. పనిలోపనిగా క్రిష్ నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షలకు పంపించాలనేది కూడా పోలీసుల వ్యూహం. కానీ క్రిష్ మాత్రం తనకు సమయం కావాలని కోరాడు.

సీసీటీవీ ఫూటేజ్ మాయం.. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసులు ఎలా మలుపు తిరుగుతాయో మనందరం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన డ్రగ్స్ వ్యవహారం, ఆ తర్వాత ఎలా చల్లారిందో అందరికీ తెలిసిందే. అప్పటి కేసులో చాలామందికి క్లీన్ చిట్స్ దక్కాయి. ఇప్పుడీ కేసులో కూడా ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి.

తాజాగా రాడిసిన్ బ్లూ హోటల్ లో సీసీటీవీ ఫూటేజ్ మాయం అయిందంట. హోటల్ లో దాదాపు 200 సీసీటీవీ కెమెరాలు ఉంటే, అందులో 81 మాత్రమే పనిచేస్తున్నాయట. మిగతా కెమెరాల్లో ఎలాంటి డేట్ లేదని హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

ఇంతకీ అబ్బాస్ ఏమంటున్నాడు… మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువైన అబ్బాస్ అలీ మాత్రం పోలీసులకు కీలకమైన సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. తను ఎవరి దగ్గర్నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశాననే విషయాన్ని ఇప్పటికే వెల్లడించిన అబ్బాస్, మరిన్ని వివరాల్ని పోలీసులకు తెలిపినట్ట తెలుస్తోంది.

రాడిసన్ బ్లూ హోటల్ లో గతంలో ఉద్యోగిగా పనిచేసిన అబ్బాస్.. వివేకానంద్ కోరిక మేరకు హోటల్ కు 10సార్లు మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్టు పోలీసులకు చెప్పాడంట. అంతేకాదు.. తన ఫోన్ లో ఉన్న కీలకమైన కొన్ని కాంటాక్ట్ నంబర్లను కూడా పోలీసులకు అందించినట్టు తెలుస్తోంది. అందులో పలువురు టాలీవుడ్ నటీనటులు, వాళ్ల మేనేజర్ల ఫోన్ నంబర్లు ఉన్నట్టు తెలుస్తోంది.