టీడీపీకి చెందిన ముగ్గురు మాజీ మంత్రులు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈసారి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ముగ్గురికీ ఆయా సీట్లలో టఫ్ ఫైట్ నడిచింది అని పోలింగ్ సరళి అనంతరం వార్తలు చెబుతున్నాయి. వివిధ సర్వేల అంచనాలు చూస్తే ఈ ముగ్గురిలో ఒకరు ఖాయంగా ఓటమి పాలు అవుతారని కూడా అంటున్నారు.
ఉమ్మడి విశాఖ భీమునిపట్నం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి ఈసారి అనుకున్నంత ఈజీగా లేదని అంటున్నారు. ఇక్కడ ఢీ అంటే ఢీ అన్నట్లుగా వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుతో పోరు సాగింది అని అంటున్నారు. దీనిని టఫ్ ఫైట్ గానే పోస్ట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి.
మరో సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నర్శీపట్నంలో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు అని అంటున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేశారు. ఇద్దరూ తనదైన శైలిలో వ్యూహాలకు పదును పెట్టారు. దాంతో ఎవరు విజేత అన్నది చెప్పలేని పరిస్థితి అంటున్నారు.
మాడుగులకు చివరి నిముషంలో షిఫ్ట్ అయిన మరో సీనియర్ టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి ఓటమి పలకరించవచ్చు అని పోలింగ్ అనంతర సరళి తెలియచేస్తోంది అంటున్నారు. అక్కడ పోటీకి దిగిన ఉప ముఖ్యమంత్రి కుమార్తె ఈర్లె అనూరాధ తొలి ప్రయత్నంలోనే వైసీపీ తరఫున విజయం సాధిస్తుందని అంటున్నారు. ఇలా ముగ్గురు మాజీ మంత్రుల రాజకీయ జాతకం ఎలా ఉండబోతోంది అన్నది జూన్ 4 ఫలితాలు స్పష్టంగా చెబుతాయని అంటున్నారు.