ఎన్నిక ఏదైనా ఒక యుద్ధమే. అందులోనూ ఈ దఫా సార్వత్రిక ఎన్నికలను టీడీపీ, వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోను న్నాయి. టీడీపీది బతుకు సమస్య, వైసీపీది అధికార సమస్య. మరొక్కసారి అధికారాన్ని నిలుపుకోగలిగితే టీడీపీకి శాశ్వతంగా సమాధి కట్టొచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావన. ఈ దఫా అధికారంలోకి రాకపోతే, ఇక శాశ్వతంగా పార్టీని మూసేసుకోవాల్సిందే అని చంద్రబాబు భయం.
దీంతో అధికారం కోసం టీడీపీ, వైసీపీ గట్టిగా తలపడనున్నాయి. ఒకప్పుడు పోల్ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు ఆరితేరారనే పేరుండేది. ప్రజల్లో వ్యతిరేకత వున్నా, ఏదో ఒక జిమ్మిక్కు చేసైనా చంద్రబాబు అధికారంలోకి రావడమో, నిలబెట్టుకోవడమో చేసేవారనే ప్రచారం వుండేది. అయితే వైఎస్ జగన్ ముందు చంద్రబాబు ఆటలేవీ సాగడం లేదు. చంద్రబాబుతో పోల్చితే జగన్ బాగా ముదిరిపోయారనే పేరు వచ్చింది.
ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో జగన్ ఎలాంటి వ్యూహ రచన చేస్తారో అనే భయం చంద్రబాబు, ఎల్లో మీడియాలో వుంది. మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నాయకుల కంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే వాలంటీర్ల పేరు వింటే చాలు టీడీపీ వణికిపోతోంది. అన్నీ తామై వాలంటీర్లు వ్యవహరిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వీరు మరోసారి వైసీపీని అధికారంలోకి తెస్తారని టీడీపీ నిలువెల్లా వణికిపోతోంది.
అందుకే ఎన్నికలో ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకుండా ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలను ఇప్పించుకోగలిగారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కార్యకలాపాల్లో వాలంటీర్లు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారని, ఏదో కుట్రలు చేస్తున్నారంటూ పచ్చదళం గగ్గోలు పెడుతోంది. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో నేరుగా పాల్గొంటే టీడీపీకి కొంత వరకే నష్టం. అలా కాకుండా వారిని ఎన్నికల విధులు నిర్వహించకుండా అడ్డుకుంటే, అంతకంటే ఎక్కవ నష్టాన్ని చేస్తారు.
వాలంటీర్లు వైసీపీకి ప్రత్యక్షంగా పని చేస్తే టీడీపీకి భారీ నష్టం కలగడం ఖాయం. ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ల చేతుల మీదుగానే జరుగుతున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారనే అక్కసుతో, వైసీపీ తరపున నేరుగా వారు రంగంలోకి దిగుతారు. అప్పుడు వారిని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన మంచి పని ఏదైనా వుందంటే సచివాలయ వ్యవస్థ తీసుకురావడమే.
ఈ వ్యవస్థ వల్ల స్వామి కార్యం, స్వకార్యం రెండూ నెరవేరుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ అంటే వైసీపీకి ఎన్నికల సైన్యమే. అదే టీడీపీ భయం. దీన్ని వైఎస్ జగన్ చట్టబద్ధంగా చేయడం ఆయన పోల్ మేనేజ్‌మెంట్ వ్యూహానికి నిదర్శనం. ఎన్నికల నాటికి జగన్ ఎత్తుగడలు ప్రత్యర్థులకు అందవు. జగన్ ఎన్నికల వ్యూహాన్ని ఎదుర్కోవడం టీడీపీకి అంత ఈజీ కాదు. రానున్న రోజుల్లో వాలంటీర్ల వ్యవస్థ చాలా కీలకం కానుంది. అదే టీడీపీని భయపెడుతోంది. ఈ వ్యవస్థను ఎదుర్కోడంలోనే టీడీపీ విజయం దాగి వుంది. అది ఎంత వరకు సఫలం అవుతుందో చూడాలి.