జనసేనాని పవన్‌కల్యాణ్, టీడీపీ భవిష్యత్ రథసారథి నారా లోకేశ్ రాజకీయంగా ఇద్దరూ ఇద్దరే అని చెప్పక తప్పదు. రాజకీయాల్లో రాణించాలంటే నిత్యం జనంలో వుండాలి. జనానికి ఏ కష్టమొచ్చినా తామున్నామనే భరోసా కల్పించాలి. అలాంటి నేతల వెంట మాత్రమే జనం నడుస్తారు. అదేంటో గానీ, పవన్‌కల్యాణ్, లోకేశ్ తీరు ఎవరికీ అర్థం కాకుండా వుంది.
ఈ ఇద్దరు నేతలు ప్రజల్లో కంటే అజ్ఞాతంగా వుండేందుకే ఇష్టపడుతుంటారు. పవన్‌కల్యాణ్‌కు కనీసం సినిమా అనే వ్యాపకం వుంది. సినిమాలు చేసుకుంటే తప్ప జీవనం వుండదని స్వయంగా పవన్‌కల్యాణే ప్రకటించారు. షూటింగ్‌లు లేని రోజుల్లో మాత్రమే ఆయన ప్రజల్లోకి వస్తుంటారు. కానీ లోకేశ్ పరిస్థితి అది కాదు కదా? మరి ప్రజల్లో వుండడానికి ఆయనకొచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కాకుండా వుంది.
విజయనగరంలో ప్రభుత్వ ఆస్పత్రికి మహారాజా పేరు మార్చడాన్ని ట్విటర్ వేదికగా లోకేశ్ ఖండించారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ముఖ్య నాయకుడిగా తన బాధ్యత తీరిపోయినట్టు ఆయన సంబరపడుతున్నారు. ఇలా ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై ట్వీట్ చేస్తూ రాజకీయంగా ఉనికి చాటుకుంటున్నానని లోకేశ్ భావిస్తున్నారు. రాజకీయంగా ఉనికి చాటుకోవడం అంటే ఇది కాదని ఆయన ఎప్పుడు తెలుసుకుంటారో అనే ప్రశ్న సొంత పార్టీ నేతల నుంచి వస్తోంది.
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ 24 గంటలూ జనం మధ్యే ఉన్నారు. ఏదో ఒక సమస్యపై వైఎస్ జగన్ దీక్షలు, ప్రజాపోరాటాలు, సభలు నిర్వహించారు. ఆ తర్వాత పాదయాత్ర పేరుతో పూర్తిగా జనంతో మమేకం అయ్యారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో జనం ఆయనకు పట్టం కట్టారు. జగన్‌లా పదో వంతైనా జనంలో పవన్, లోకేశ్ ఉన్నారా? అంటే లేదనే సమాధానం వస్తోంది. జనం కోసం ఏమైనా చేస్తే కదా, వారు వెంట నడవడానికి?
కేవలం ట్వీట్లతో, ప్రకటనలతో ప్రజల మనసుల్ని చూరగొంటామని ఎలా అనుకుంటున్నారో వారికే తెలియాలి. ఈ దఫా అధికారంలోకి రాకపోతే టీడీపీ, జనసేన పార్టీలకు భవిష్యత్ వుండదని అందరూ అంటున్న మాట. అదే జరిగితే అందుకు లోకేశ్, పవన్ మాత్రమే బాధ్యత వహించాల్సి వుంటుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారా? లేక ఇప్పటి నుంచే అప్రమత్తమై పార్టీలను కాపాడుకుంటారా? అనేది వాళ్లిద్దరి చేతల్లోనే ఉంది. ఏం చేస్తారో చూద్దాం.