మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై జగన్ నజర్!

సభను రక్తి కట్టించడానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు నాటకీయంగా డైలాగులు వల్లెవేశారో ఏమో తెలియదు గానీ.. ఆయన మాటలు ఇప్పుడు పార్టీలో సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. వైసీపీ పార్టీ మొత్తం మూడు రాజధానులకు అనుకూలంగా…

సభను రక్తి కట్టించడానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు నాటకీయంగా డైలాగులు వల్లెవేశారో ఏమో తెలియదు గానీ.. ఆయన మాటలు ఇప్పుడు పార్టీలో సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. వైసీపీ పార్టీ మొత్తం మూడు రాజధానులకు అనుకూలంగా మాత్రమే ఉంటుంది. మాట్లాడుతుంది. మూడు రాజధానుల పట్ల ఎవరూ తమ ప్రేమను ప్రత్యేకంగా ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. ధర్మాన ప్రసాదరావు మాటలు కొంచెం తేడా కొడుతున్నాయి. 

విశాఖలో రాజధాని వద్దనే వాళ్లను మనం శత్రువులుగానే చూడాలని ధర్మాన పిలుపు ఇస్తున్నారు. అంతవరకు ఓకే.. అదంతా తెలుగుదేశాన్ని ఉద్దేశించిన మాటలు అనుకోవచ్చు. వారిని శత్రువులుగా చూడడం కోసం ఓ ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి అనుమతిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేసేసి ఉద్యమంలోకి వెళ్లాలని ఉంది అని అంటూ.. ధర్మాన ప్రసాదరావు.. తనలోని ‘త్యాగమూర్తి ధధీచి’ యాంగిల్ ను బయటపెడుతున్నారు.

ముఖ్యమంత్రి అనుమతిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి విశాఖ రాజధానికోసం, అమరావతి రాజధాని అడిగేవారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తానని అనడం చిత్రంగా ఉంది. ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారు. ఇక ఎవరి మీద ఉద్యమిస్తారు? అనేది ఒక సందిగ్ధం కాగా.. ‘‘ముఖ్యమంత్రి అనుమతిస్తే..’’ అనే పదం ఇంకా చిత్రమైనది.

ఎంతో సీనియర్ అయిన తనకు మంత్రి పదవి తొలివిడతలోనే రాలేదని అలకపూని, వీరంగం వేసి.. ఎలాగోలా రెండోవిడతలో దక్కించుకున్న వ్యక్తి ధర్మాన ప్రసాదరావు. జగన్ ఏమైనా ఆయనను కేబినెట్ లో ఉండి తీరాల్సిందే అని బతిమాలుతున్నారా? లేదు కదా? రాజీనామా చేయాలని ఉంటే, సాధారణ ఎమ్మెల్యేగా అమరావతి వారికి వ్యతిరేకంగా తానొక ఉద్యమం చేస్తానంటే చేసుకోవడానికి అభ్యంతర పెడుతున్నవారెవ్వరు? ప్రజలకు ఏం ఫరక్ పడుతుంది. ఆయన కాకపోతే.. ఆయన తమ్ముడు మళ్లీ కేబినెట్లోకి వస్తారని అనుకుందాం! తమ్ముడికి ఇవ్వకపోయినా  కూడా.. మరో ఉత్తరాంధ్ర నాయకుడితోనే జగన్ ఆ కేబినెట్ స్థానాన్ని భర్తీ చేస్తారు కదా.. మరి ప్రజలు కోల్పోయేదేముంటుంది? అని అంతా చర్చించుకుంటున్నారు.

పైగా, ధర్మాన మరో మాట అన్నారు. ‘పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా నా గొంతెత్తితే లక్షలాది మంది అనుసరిస్తారన్న నమ్మకం ఉంది..’అని ఆయన అన్నారు. అంటే.. తనను తాను ఆయన పార్టీకంటె గొప్పగా ఊహించుకుంటున్నట్టుగా ఉంది. పార్టీలో ఉంటే పరిమితమైన మద్దతే వస్తుందని, తాను పార్టీలో లేకపోతే.. లక్షలాది మంది మద్దతు వస్తుందని అనడం సీరియస్ విషయమే. ఈ వ్యాఖ్యలపై సీఎం జగన్ కూడా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. 

జనం కనిపిస్తే పూనకం వచ్చినట్లుగా మాట్లాడే నాయకులు.. అదుపు తప్పి ఇరకాటంలో పడుతుంటారు. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు పరిస్థితి కూడా అంతే అయ్యేలా ఉంది.