కుప్పంలో జరిగిన రభసను, రాద్ధాంతాన్ని వాడుకొని మరింత మైలేజీ సంపాదించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసుల అండతో వైయస్సార్ కాంగ్రెస్ వాళ్లు చితక్కొట్టారని ప్రచారం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సానుభూతిని, జాలిని పొందాలని పథకరచనలో ఉంది. ప్రజల నుంచి ముందుగా జాలి సంపాదిస్తే, ఆ జాలిని నెమ్మదిగా ఓట్లుగా మార్చుకోవచ్చుననేది ప్రస్తుతానికి వారి వ్యూహం!
దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరికీ మార్గదర్శకాలు వెళ్ళాయి. రాష్ట్రమంతా నిరసన ప్రదర్శనలు ఆందోళనలు చేయడం ద్వారా కుప్పం ఘర్షణలను దాడులుగా చిత్రీకరిస్తూ, వాటిని మరింతగా భూతద్దంలో చూపిస్తూ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు! పోలీసులు తమ ఆందోళనలకు అనుమతులు ఇవ్వకపోతే మరింత ఘాటుగా ఆందోళనలు చేపట్టాలని.. లాఠీచార్జీలు గట్రా జరిగితే మైలేజ్ ఇంకా పెరుగుతుందని కూడా నాయకులకు సూచించారు. మొత్తానికి కుప్పంలో జరిగిన రెండు పార్టీల ఘర్షణలనుంచి వీలైనంత ఎక్కువ మైలేజ్ సొంతం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది!
ఇలా వక్ర పూరిత ఆలోచనలతో ప్రజల జాలి సానుభూతి సంపాదించే కుయత్నాలు చంద్రబాబు నాయుడుకి చాలా సహజం. తన భార్య గురించి ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకులు నిందలు వేసినప్పుడు.. ఆ నిందల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎంత మైలేజీ కావాలని ఆయన తపన పడిపోయారో మనమందరమూ చూశాం!
కొన్ని నెలల పాటు ఏ ఊరు వెళ్లినా, ఎక్కడి సభలో మాట్లాడినా మైకు కనిపిస్తే చాలు ‘‘నా భార్య మీద నిందలు వేశారు, నా భార్య మీద నిందలు వేశారు’’ అంటూ పదే పదే చెప్పుకుంటూ లేకి రాజకీయం ప్రదర్శించిన ఘనత చంద్రబాబు నాయుడు ది!!
ప్రత్యర్థులు అన్న మాటల కంటే.. ఎక్కువగా తన భార్యను ఆయనే బజారుకీడ్చారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కుప్పంలో జరిగిన ఘర్షణలను రాజకీయ మైలేజీకి వాడుకోకుండా ఉంటారా అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. దానికి తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ వ్యూహరచన కూడా ఉంది!!
ఘర్షణలు జరిగిన రోజునే రాష్ట్ర డిజిపి కి వినతిపత్రం ఇవ్వడానికి తెలుగుదేశం నాయకులు వెళ్లారు. వారిని అడ్డుకోవడం కూడా జరిగింది. నిజానికి వినతిపత్రం ఇవ్వడాన్ని కూడా పోలీసులు అడ్డుకోవడం సరికాదు.
అయితే డిజిపి కి ఇచ్చే లేఖ కూడా మైలేజీ కోసం చేసే ప్రయత్నమే అయితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అలాంటి కుయత్నాలతో రాష్ట్రవ్యాప్తంగా రెచ్చిపోవాలని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోంది! వారి కుట్రలు, కూహకాలు ఏమేరకు సఫలం అవుతాయో.. రాష్ట్రంలో శాంతి భద్రతలను మరెంత ఘోరంగా వారు దిగజార్చదలచుకుంటున్నారో వేచి చూడాలి!!