విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండవ విడత సీట్ల ప్రకటన తరువాత చాలా మందికి తమ సీటూ ఫేటూ రెండూ తెలిసిపోయాయి. దాంతో తమ్ముళ్ళు చాలా చోట్ల మండిపడుతున్నారు. విశాఖ సౌత్ టికెట్ దక్కనందుకు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పార్టీకి రాజీనామా చేశారు. మోసపూరిత విధానాలతో ఉన్న టీడీపీలో ఉండలేను అని ఆయన తప్పుకున్నారు.
ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తాను అని ఆయన చెబుతూ ఏ పార్టీ అన్నది సస్పెన్స్ అని చెప్పారు. ఎలమంచిలి సీటు జనసేనకు ఇస్తున్నారని తెలిసి టీడీపీ ఇంచార్జి ప్రగడ నాగేశ్వరరావు అనుచరులు మండిపడుతున్నారు. అయిదేళ్ల పాటు పార్టీని నిలబెట్టామని ఇపుడు అన్యాయం చేస్తే ఏలా అని వారు ప్రశ్నిస్తున్నారు. నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతున్నారు.
పెందుర్తిలో సీటు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి ఇవ్వనందుకు నిరసన తెలిపారు ఆయన అనుచరులు అభిమానులు. జై బండారు అని ఆయన నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. బండారుకే టికెట్ ఇవ్వాలని ఈ విషయంలో న్యాయం జరిగేంతవరకూ తమ పోరాటం ఆగదని తమ్ముళ్ళు అంటున్నారు.
మాడుగుల టికెట్ ని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆశించారు. నియోజకవర్గం టీడీపీ ఇంచార్జిగా ఉన్న పీవీజీఆర్ కుమార్ తనకే దక్కుతుందని వేచి చూసారు. పైలా ప్రసాద్ కి ఆ సీటుని కట్టబెట్టడంతో ఈ ఇద్దరు నేతల అనుచరులు రగిలిపోతున్నారు. గరిరెడ్డి రామానాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అంతా చూస్తున్నారు.
ఇప్పటికే అనకాపల్లిలో తమ్ముళ్లు రచ్చ చేస్తున్నారు. దానికి అదనంగా ఇపుడు ఈ కొత్త నియోజకవర్గాలు ఉన్నాయని అంటున్నారు. జనసేనలో కూడా సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తునారు. పార్టీ కోసం పదేళ్ళుగా కష్టపడ్డాను అని కనీసం పిలిచి మాట్లాడలేదని సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ ట్విట్టర్ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
జనసేనలో ఉత్తరం సీటుని ఆశిస్తున్న మహిళా నేత ఒకరు ఇలాగే అసంతృప్తిలో ఉన్నారు. పెందుర్తి టికెట్ ఆశిస్తున్న మరో సీనియర్ నేతతో పాటు గాజువాకలో ఈసారి తనకు తప్పకుండా సీటు దక్కుతుందని తలచిన మరో నేత కూడా తీవ్ర నిరాశలో ఉన్నారని అంటున్నారు.