తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులకు సిద్ధపడుతోంది. జనసేనతో పొత్తుల వల్ల ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్ల దాకా సమర్పించుకోవాల్సి వస్తోంది. ఒక ఎంపీ సీటు కూడా ఆ పార్టీకి కేటాయించారు. ఇపుడు బీజేపీని పొత్తులకు పిలుస్తున్నారు. బీజేపీకి అరకు ఎంపీ సీటు ఇస్తామని ప్రతిపాదన పెట్టారు.
అయితే బీజేపీ పెద్దలు విశాఖ ఎంపీ సీటు మీద ఉడుము పట్టు పడుతున్నారు. తాము అసలు వైజాగ్ సీటు వదులుకునేది లేదు అని అంటున్నారు. దాంతోనే టీడీపీ డైలమాలో పడుతోంది అని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పొత్తులతో మూడు పార్టీలకు మూడు ఎంపీ సీట్లు అని తెలుగుదేశం పార్టీ భావించి నిర్ణయించింది.
కానీ బీజేపీ పెద్దలు మాత్రం విశాఖ అరకు ఎంపీ సీట్లు కోరుతున్నారు. దాంతో టీడీపీ ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నట్లు అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీకి పోటీ చేయడానికి ఎంపీ సీటు కూడా ఒక్కటీ ఉండదు. పార్టీ పుట్టాక ఎపుడూ ఎదురుకాని పరిస్థితి ఇది అవుతుంది.
ఇప్పటికే విశాఖ ఎంపీ సీటుని పాతికేళ్లుగా టీడీపీ గెలుచుకోలేకపోయింది. గత నాలుగు ఎన్నికల్లో వరసగా కాంగ్రెస్ బీజేపీ వైసీపీ అభ్యర్ధులే ఎంపీలు అయ్యారు. దాంతో పట్టుదలగా విశాఖ ఎంపీ సీటుని తమకే ఉంచుకోవాలని చూస్తోంది. బీజేపీ నుంచి వత్తిడి మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది. ఆ పార్టీ విస్తరణకు రాజకీయానికీ విశాఖ గేట్ వేగా కనిపిస్తోంది.
దాంతో బీజేపీ నుంచి విశాఖ పోటీకి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. టీడీపీ నుంచి అదే పరిస్థితి. విశాఖ ఎంపీ సీటు పొత్తులకే కాదు టీడీపీకి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉనికికే ఇబ్బందిగా మారుతుందా అన్నది తమ్ముళ్లలో సాగుతున్న అంతర్మధనంగా ఉంది. పోటీ చేసి ఓడిపోవడం వేరు, అసలు పోటీకే కాకుండా నిలిచిపోవడం వేరు. పొత్తుల పుణ్యమా అని టీడీపీ కొత్త అనుభవాన్ని ఎదుర్కోబోతోంది అని అంటున్నారు. అసెంబ్లీ సీట్లు ఉమ్మడి జిల్లాలో 15 దాకా ఉంటే పది లోపే టీడీపీకి పొత్తులో దక్కుతాయన్న వార్తలూ తమ్ముళ్లను కలవరపెడుతున్నాయి.