ఈ వ్యాసం ప్రారంభించే సమయానికి చంద్రబాబు, పవన్ దిల్లీలో అమిత్ షా పిలుపుకై ఎదురు చూస్తున్నారు. జాతీయ మీడియాలో యీ రోజు మహారాష్ట్రలో ఎన్నికల పొత్తు గురించి చర్చలు జరుగుతాయని చెప్తున్నారు. ఆంధ్రలో పొత్తు గురించి ఎన్నింటికి మాట్లాడతారో వాళ్లేమీ చెప్పటం లేదు. నెల్లాళ్ల క్రితం బాబును యిలాగే వెయిట్ చేయించిచేయించి చివరకు అర్ధరాత్రి దర్శనం యిచ్చారు. ఆ తర్వాత ఏ ప్రకటనా లేదు. అలా జరిగిందట, యిలా జరిగిందట అనే ఊహాగానాలతో నెల గడిచిపోయింది. ఈసారి పరిస్థితి కాస్త మెరుగు. పురంధరేశ్వరి అక్కడే ఉన్నారు. బాబుతో పాటు పవన్ కూడా వెళ్లారు. పిలుపు వస్తే వెళ్లారా? తమంతట తామే వెళ్లారా? అనేది చర్చకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కితం సారి బిజెపి వాళ్లే మొహమాట పెట్టి రప్పించుకున్నారని అనుకూల మీడియా చేత రాయించుకున్నా, దానివలన మంచి జరగకపోగా చెడు జరిగినట్లుంది.
పొత్తు చర్చలంటే మాటలు కాదు, మౌలికంగా కలవాలని అంగీకారం కుదిరినా, సీట్ల దగ్గర బేరం ఓ పట్టాన తగదు. తెలంగాణలో మొన్న చూడండి, కాంగ్రెసుకు లెఫ్ట్‌తో పొత్తు అన్నారు. చివరి నిమిషం దాకా తెగలేదు. ఆఖరికి సిపిఐకి ఒకటి యిచ్చి సరిపెట్టుకోమన్నారు. సిపిఎంకు అదీ లేదన్నారు. వాళ్లు విడిగా పోటీ చేశారు. బాబుకి జనసేనతో ఉన్న సౌలభ్యం బిజెపితో లేదు. పవన్ అభిమానులకు ఉన్నంత రాజకీయం కాంక్ష పవన్‌కు లేదు. జగన్‌ను ఎలాగైనా ఓడించడం అనే పరిమిత లక్ష్యం అతనిది. అందువలన ఎన్ని సీట్లిచ్చినా అదే మహద్భాగ్యం అనుకుంటాడు. కానీ బిజెపి వరస వేరు. వాళ్ల కుండే ఆశలూ, లెక్కలూ, వ్యూహాలూ వాళ్లకున్నాయి. అందువలన పొత్తు ఫైనలైజ్ కావాలంటే కాస్త సమయం పడుతుంది. అది ఫైనలైజ్ అయ్యాకనే బాబు ఎన్‌డిఏలో చేరే పరిస్థితి ఉత్పన్నమౌతుంది. కానీ యీలోగానే తెలుగు మీడియా అడావుడి చేసేస్తోంది. ఈ అడావుడికి, బిజెపి యాటిట్యూడ్‌కు ఎక్కడా మ్యాచ్ కావటం లేదు.
కూటమిలోకి బిజెపి వస్తుందా రాదా అనే సుదీర్ఘ నిరీక్షణ చూస్తూంటే, నాకు ‘‘వెయిటింగ్ ఫర్ గాడో’’ నాటకం గుర్తుకొచ్చింది. మీలో ఎంతమందికి దాని గురించి తెలుసో నాకు తెలియదు కాబట్టి కథ చెప్తాను. వ్యాసం పూర్తయ్యేసరికి పొత్తు ఖరారైంది అనే వార్త వచ్చినా, ఒక ప్రఖ్యాత కళారూపం గురించి తెలుసుకున్నామన్న తృప్తి పాఠకులకు కలుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం 1953లో ఫ్రెంచ్ భాషలో ప్రదర్శించబడి, ‘ట్రాజీకామెడీ’గా, ‘నాన్సెన్స్’ లేదా ‘బ్లాక్ కామెడీ’ వర్గానికి చెందినదిగా అభివర్ణింపబడిన యీ నాటకం చూడడానికి అయోమయంగా అనిపిస్తుంది. కానీ యిది ప్రతీకాత్మక నాటకమని, దీనిలో చాలా తాత్త్వికత, మార్మికత ఉందని, లోతైన భావాలు ఉన్నాయని అంటారు. నాకైతే అవి అందలేదు. ఎవరో చెప్పినపుడు ఓహో అనుకున్నానంతే.
ఇది రాసినది శామ్యూల్ బెకెట్ (1906-89) అనే ఐర్లండ్ కథారచయిత. ఆయన కవి, నవలాకారుడు, నాటకకర్త, నాటక దర్శకుడు కూడా. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ ఆక్రమణకు గురైన ఫ్రాన్సుకి తన మిత్రుడితో సహా వెళ్లి అక్కడ ఉంటూ రెసిస్టెన్స్ ఉద్యమం (ఆక్రమణదారులకు వ్యతిరేకంగా దేశీయులు చేసే తిరుగుబాటు)లో పాల్గొన్నాడు. ఇది తెలుసుకుని జర్మన్ వాళ్లు బంధించే లోపున తప్పించుకుని ఐర్లండ్ వచ్చేశాడు. యుద్ధానంతరం రెడ్‌క్రాసు తరఫున ఫ్రాన్సు మళ్లీ వెళ్లి యుద్ధబీభత్సానికి గురైన ఒక నగరాన్ని పునరుద్ధరించ డానికి సహకరించాడు. యుద్ధసమయంలోనూ, యుద్ధానంతరం జరిగిన రాజకీయ, సామాజిక పరిస్థితులపై వ్యంగ్యాస్త్రంగా దీన్ని రాశాడంటారు. 1949లో రాత పని పూర్తి చేసి 1953లో పారిస్‌లో ప్రదర్శింప చేశాడు. 1955లో ఇంగ్లీషులో దీని పేరు Waiting for Godot. పేరు చివర్లోని టి సైలెంటట.
తెర తొలగగానే అస్తవ్యస్తంగా దుస్తులు ధరించిన ఈస్ట్రాగన్, వ్లదీమీర్ అనే యిద్దరు మోడువారిన చెట్టు కింద నిలబడి మాట్లాడుకుంటూంటారు. ఈస్ట్రాగన్ తనను కితం రాత్రి గుర్తు తెలియని కొందరు దుండగులు చావగొట్టి ఓ గోతిలో పడేశారని చెప్పుకుని వాపోయాడు. వ్లదీమీర్ తన బాధలు చెప్పాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకుంటూ పోయారు. వాటి మధ్య లింకేమిటో, ఆ సంభాషణ ఎటు దారి తీస్తుందో తెలియక ప్రేక్షకుడు అయోమయానికి గురవుతూండగానే అతనికి అర్థమౌతుంది – వాళ్లిద్దరూ గాడో అనే వ్యక్తి గురించి వేచి ఉన్నారని. అతను వస్తాడా రాడా అనే విషయంలో పాత్రధారులిద్దరికీ సందిగ్ధంగానే ఉంది. గతంలో అతన్ని కలిశామా లేదా అన్న విషయం లోనూ వాళ్లకు స్పష్టత లేదు.
వీళ్లిలా చర్చలతో సమయం వెళ్లబుచ్చుతూండగానే పోజో అనే ఒక పొగరుబోతు యాత్రికుడు, తన బానిస లక్కీ అనే అతనితో కలిసి అటుగా వచ్చి వీళ్లతో మాటలు కలిపాడు. లక్కీకి ఓ తాడు కట్టి దాన్ని అతను తన చేతిలో పెట్టుకున్నాడు. తన మూటలు మోస్తున్న బానిస ఏ పాటి అలసత్వం చూపినా జులుం చూపిస్తూ అతన్ని కొడుతున్నాడు. ‘‘మార్కెట్‌కు వెళుతున్నాను, అక్కడ వీణ్ని అమ్మేస్తాను.’’ అన్నాడు పోజో. ‘‘ఇతనేమీ మాట్లాడటం లేదు. అమ్ముడు పోతాడా?’’ అని వీళ్లు అడిగితే పోజో లక్కీని అదిలించాడు. వెంటనే లక్కీ హఠాత్తుగా ఓ డాన్సు చేయడంతో పాటు దీర్ఘోపన్యాసానికి లంకించుకున్నాడు. ఏవేవో పెద్దపెద్ద అర్థంకాని పదాలు ఉపయోగిస్తూ, వట్టి నాన్సెన్స్ మాట్లాడాడు. కాస్సేపటికి వాళ్లు వెళ్లిపోయారు. వీళ్లు గాడో గురించి తమ నిరీక్షణను కొనసాగించారు.
చాలా సేపటికి ఒక కుర్రాడు వచ్చి ‘నేను గాడో వార్తాహరుణ్ని. ఈ రాత్రి ఆయన రాడు. రేపు తప్పకుండా వస్తాడు.’ అని చెప్పాడు. ‘ఇంతకీ గాడో ఎలా వుంటాడేమిటి?’ అని వ్లదీమీర్ అడిగితే, ఆ కుర్రాడు చాలా అస్పష్టమైన, అసమగ్రమైన వర్ణన చేసి వెళ్లిపోయాడు. ‘ఇక యిక్కడుండి ఏం చేస్తాం? మనమూ వెళ్లిపోదాం.’ అని అంటూనే యిద్దరూ స్టేజి మీదే ఉండిపోయారు. ఇక్కడితో మొదటి అంకం పూర్తయింది. రెండో అంకం ప్రారంభమయ్యేసరికి అదే ప్రదేశం, వెనక్కాల చెట్టు మాత్రం ఆకులతో నిండి ఉంది. గాడో యింకా రాలేదు. ఇద్దరూ మళ్లీ మాట్లాడుకోవడం ప్రారంభించారు. కాస్సేపటికి పోజో, లక్కీ మార్కెట్ నుంచి తిరిగి వస్తూ వీళ్ల దగ్గర ఆగారు. పోజో గుడ్డివాడై పోయాడు, లక్కీ మూగవాడై పోయాడు. అప్పుడే కొత్తగా కలిసినట్లు పోజో ప్రవర్తించాడు. ఇంతకు ముందు వాళ్లని చూశామా లేదా అన్న సందేహం వీళ్లనీ పీడించింది.
ఓ చిన్న తగాదా తర్వాత వాళ్లు వెళ్లిపోయారు. వీళ్లు తమ నిరీక్షణను కొనసాగించారు. కొద్ది సేపటికి నిన్నటి కుర్రాడు వచ్చాడు, గాడో రావటం లేదని చెప్పడానికి! ‘ఇవాళ తప్పకుండా వస్తాడని నిన్న చెప్పావుగా’ అని వీళ్లంటే ‘నేనా? నేనెప్పుడూ మిమ్మల్ని చూడలేదు’ అన్నాడా కుర్రాడు. వ్లదీమీర్‌కు కోపం వచ్చింది. ‘ఇప్పుడైనా మా మొహాలు గుర్తు పెట్టుకో, మళ్లీసారి యిలా అనకుండా ఉండడానికి’ అని కోపగించు కున్నాడు. ఆ కుర్రాడు వెళ్లిపోయాక, వీళ్లిద్దరూ అక్కడున్న చెట్టుకు ఉరేసుకుందామా అనుకున్నారు. కానీ ఉన్న చోటి నుంచి కదలలేదు. వాళ్లు అలా స్థాణువుల్లా ఉండగానే తెర పడింది.
నాటకం అయిపోయింది. దీనిపై చాలా రకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. ఈస్ట్రాగన్, వ్లదీమీర్‌లు యుద్ధకాలంలో అత్యాచారాలకు గురైన యూదులని, తమను ఉద్ధరించడానికి వస్తాడని వారు ఎదురు చూసిన మెస్సయ్యయే గాడో అని కొందరన్నారు. పోజో జర్మనీ అని, అతను కుక్కనాడించినట్లు ఆడించిన లక్కీ ఆక్రమణకు గురైన ఫ్రాన్సులోని ప్రజ అని కూడా అన్నారు.
‘ఆ యుద్ధ సమయానికే కాదు, యిది ఏ సమయానికైనా వర్తిస్తుంది. భగవంతుడి కోసం ఎదురు చూసే భక్తుల గోడు యిది. ఆ దేవుడు ఎప్పటికీ రాడు, వస్తాడు వస్తాడు అని మత ప్రచారకులు ఊరిస్తూ ఉంటారు. భక్తులు విసిగి వేసారి నిరాశకు గురవుతారు.’ అన్నారు కొందరు. ఎన్నటికీ రాని ఆ వ్యక్తికి గాడో అని పేరు పెట్టడంలోనే శామ్యూల్ బెకెట్ గాడ్ అని సూచించాడు అని వాదించారు. బెకెట్‌ను అడిగితే ‘అబ్బే, అదేమీ కాదు, నేను మూలరచనను ఫ్రెంచ్ భాషలో రాశానని గుర్తుపెట్టుకోండి. ఫ్రెంచ్‌లో దేవుణ్ని గాడ్ అనరు, దానికి వేరే పదం ఉంది.’ అన్నాడు. ఏది ఏమైనా యీ నాటకం విశ్వవిఖ్యాతి చెందింది. తెలుగు రచయిత త్రిపుర యీ నాటకం ఆధారంగా ‘‘భగవంతం కోసం’’ అనే కథ రాశారు. ‘భగవంతం వస్తానన్నాడు, యింకా రాలేదు, అతనెలా ఉంటాడో, ఎటువైపు నుంచి వస్తాడో..’ అంటూ చైతన్యస్రవంతి మోడల్లో కథ సాగుతుంది. దీనికీ చాలా పేరు వచ్చింది.
కూటమిలో రావలసిన బిజెపి ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో తెలియక నిరీక్షిస్తున్న బాబు, పవన్‌లను చూస్తే ఈస్ట్రాగన్, వ్లదీమీర్‌లు గుర్తుకు వచ్చారు నాకు. సరే, నిరీక్షణ ఫలించి, ఫైనల్‌గా బిజెపి వచ్చిందే అనుకుందాం. ఈ వ్యాసం పూర్తయ్యేలోగా దాని తాలూకు ప్రకటన వస్తుందే అనుకుందాం. కూటమిలోకి వచ్చాక బిజెపి ఏం చేస్తుంది? అనేది కూడా ఆసక్తిదాయకమైన ప్రశ్నే కదా. ఆ సందర్భంగా ‘‘ద చెయిర్స్’’ అనే 1952 నాటి నాటిక గుర్తుకు వచ్చింది. యూజినీ లోనెస్కో అనే ఆయన రాసిన యీ ‘అబ్సర్డిస్ట్ ట్రాజిక్ ఫార్స్’ ఏకాంకిక కూడా వింతగానే ఉంటుంది.
చుట్టూ నీళ్లు ఉన్న ఒక ఎత్తైన గోపురంలో ముసలి దంపతులు ఉంటారు. భర్తకు 95, భార్యకు 94 ఏళ్లు. భర్త ‘నేను జీవితాన్ని ఎంతో మథించి, ఒక గొప్ప సత్యాన్ని కనుగొన్నాను. ఇవాళ పెద్ద పార్టీ ఏర్పాటు చేసి, అతిథులందరినీ పిలిచాం కదా. వారి ద్వారా యీ ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందచేస్తాను. నా తరఫున దాన్ని వినిపించడానికి ఒక వక్తను రమ్మన్నాను.’ అన్నాడు. స్టేజి మీద వీళ్లిద్దరూ, ఖాళీ కుర్చీలూ ఉంటాయి. ఎవరెవరో అతిథులు వస్తున్నట్లు, వాళ్లను వీళ్లు కుర్చీల్లో కూర్చోమని ఆహ్వానిస్తున్నట్లు, వాళ్లతో ముచ్చట్లాడుతున్నట్లు అభినయం సాగుతూంటుంది. వచ్చిన అతిథులు ప్రేక్షకులకు అదృశ్యంగానే ఉంటారు. వీళ్లు వాళ్లతో చేస్తున్న సంభాషణల బట్టి, వచ్చిన వారిలో ముసలాయన ప్రియురాలు, ముసలావిడ ప్రియుడు ఉన్నట్లు తెలుస్తుంది. తమ గత జీవితాల గురించి యీ దంపతులిద్దరూ పరస్పర విరుద్ధంగా చెప్తారు. (సత్యం అనేది మనిషిని బట్టి మారిపోతుందని మనకు అర్థమవుతుంది)
వీళ్లు కుర్చీలు అటూయిటూ జరుపుతూండడం చేత జనం యింకా యింకా వచ్చేస్తూన్నట్లు మనకు అర్థమవుతుంది. చివరకు చక్రవర్తి కూడా వచ్చాడు. ఇక ముసలాయన అడావుడి అంతాయింతా కాదు. వేదిక నెక్కి ‘నేను కనిపెట్టిన సత్యాన్ని, యిప్పుడు రాబోతున్న వక్త మీ అందరికీ తెలియపరుస్తాడు. ఆ సందేశంతో ప్రపంచమే మారిపోతుంది, మానవాళి రక్షించబడుతుంది.’ అంటూ ఆర్బాటంగా ప్రకటించాడు. అంతలో వక్త వచ్చాడు (అతను కనబడతాడు). అతను రాగానే మా కర్తవ్యం తీరిపోయింది అంటూ ముసలాయన, ముసలావిడ చెరో కిటికీలోంచి బయటకు కందకం లోకి దూకేశారు. ఇక వక్త ముసలాయన సందేశాన్ని వినిపించడానికి ఉద్యమిస్తాడు కానీ నోరు పెగలదు. గొంతులోంచి వింతవింత శబ్దాలు వస్తాయి. అతిథులకు ఏమీ అర్థం కావటం లేదని గమనించి, మరింత కంగారు పడతాడు. వాళ్లంతా గోల చేస్తారు. దాంతో అతను భయపడి, బయటకు వెళ్లిపోతాడు. దీనితో నాటిక ముగిసింది.
దీన్ని అనుసరిస్తూ యండమూరి వీరేంద్రనాథ్ ‘‘నిశ్శబ్దం నీకూనాకూ మధ్య’’గా తెలుగులో రాశారు. దానిలో ముసలావిడ పాత్రను నౌకరుగా మార్చారు. చివర్లో వక్త పై అతిథులు దాడి చేసి కొడతారు, అతను కింద పడిపోతాడు. కలకత్తా ఆంధ్ర సంఘం ఏటేటా జాతీయ స్థాయి నాటకాల పోటీలు నిర్వహించేది. 1985లో నేను అక్కడుండేటప్పుడు యీ నాటికలో ‘వక్త’ పాత్ర ధరించి స్పెషల్ ప్రైజు గెలుచుకున్నాను. డైలాగ్స్ ఏమీ లేవు, ఒట్టి హావభావాలే! ఈ నాటికకు ఫిలసాఫికల్ బేస్ ఉందని, నిగూఢమైన అర్థాలు చాలా ఉన్నాయని అంటారు. లేకపోతే వీరేంద్రనాథ్ రాసి ఉండరు కదా. నాటిక వేసే సందర్భంగా డైలాగులు చాలాసార్లు వినడం జరిగింది కానీ వాటి అంతరార్థమేమిటో నాకు మాత్రం బోధపడలేదు. అదీ సంగతి!
చెప్పవచ్చేదేమిటంటే, బిజెపి కూటమిలోకి వస్తుందా, ఏ టెర్మ్‌స్‌పై వస్తుంది, వచ్చాక యీ నాటికలో వక్తలా బ్బెబ్బెబ్బే అంటుందా, చురుకైన పాత్ర వహించి, కూటమిని విజయపథాన నడిపిస్తుందా అనేవన్నీ ప్రశ్నలే. ఎందుకంటే బిజెపిలో సీరియస్‌నెస్ కనిపించటం లేదు. పొత్తు ఉంటే ఉంది, లేకపోతే లేదు అనే బేపర్వా కనబరుస్తోంది. తన రాష్ట్ర యూనిట్ ద్వారా 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో విడిగా పోటీ చేయడానికి నియోజకవర్గానికి ముగ్గురేసి అభ్యర్థులను ఐడెంటిఫై చేయించిందని వార్తలు వచ్చాయి. పొత్తు ఉండాలని వాదిస్తున్న పురంధరేశ్వరిని దిల్లీకి పిలిపించేది, విడిగా పోటీ చేయమని కన్విన్స్ చేయడానికే అనే కథనాలూ వచ్చాయి. ‘బిజెపికి నాలుగు అసెంబ్లీ స్థానాలూ, 4 పార్లమెంటు స్థానాలూ యిస్తే చాలు’ అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశారు. అలా రాయించింది బాబేనని కోపం తెచ్చుకున్న బిజెపి అధిష్టానం తమ తడాఖా చూపించడానికే దిల్లీకి రప్పిస్తోందని కూడా కొందరు చెప్తున్నారు. టిడిపి పొత్తు యినీషియేటివ్ అమిత్‌దే ననీ, ఆరెస్సెస్ వద్దంటోందని, మోదీకీ యిష్టం లేదని, పొత్తు పెట్టుకుంటే తను బాబుతో వేదిక పంచుకోనని సైతం చెప్పారని కూడా మరి కొందరు చెప్తున్నారు.
వచ్చిన చిక్కేమిటంటే, యూట్యూబు వ్యాఖ్యాతలందరికీ రోజూ ఏదో ఒకటి మాట్లాడవలసిన అగత్యం ఉంటుంది. అనేక విషయాలు డైనమిక్‌గా ఉండవు. గొంగళీలా ఎక్కడ వేసినవి అక్కడే ఉంటాయి. వ్యాఖ్యాతలకు, శ్రోతలకు ఉన్నంత ఆతృత రాజకీయ నాయకుల కుండదు. వాళ్ల టైమింగ్ వాళ్లది. సినిమా చూసే చిన్నపిల్లలు ‘తర్వాతేమౌతుంది? వీడు మంచివాడా? చెడ్డవాడా?’ అని నిరంతరం అడుగుతూ పక్క నున్న తలిదండ్రులను విసిగించినట్లుగా యూట్యూబు వీక్షకులు, పత్రికా పాఠకులు నెక్స్ట్ ఏంటి? అని ఊరికే కుతూహలం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ కుతూహలం తీర్చడానికి యీ వ్యాఖ్యాతలు యివాళ ఒకలా, రేపు మరోలా, ఎల్లుండి యింకోలా ఏదో ఒకటి తిప్పితిప్పి చెప్పాల్సి వస్తోంది. డిమాండుకు తగ్గట్టు అసలు న్యూస్ జనరేట్ కావటం లేదు కాబట్టి, వీళ్లే ఏదో ఒకటి జనరేట్ చేసి, అలాగట, యిలాగట అని చెప్తున్నారు. వీళ్లకు సమాచారాన్నిచ్చిన ‘వర్గాలు’ ఏ మేరకు ‘ఇన్‌ఫామ్‌డ్’యో తెలియదు. దానాదీనా ఏ కథనాన్ని ఏ మేరకు నమ్మాలో తెలిసి చావటం లేదు.
బిజెపి ఎన్ని సీట్లడుగుతుంది? అనే దానిపై గత వ్యాసంలోనే రాశాను – 4:2:1 అని ప్రతిపాదించారని చెప్పారని. తాజాగా 10 ఎంపీ సీట్లు, 15 అసెంబ్లీ సీట్లు అడిగారని అనసాగారు. మార్చి 7 నాటి ఆంధ్రజ్యోతిలో 5 లోకసభ, 13 అసెంబ్లీ అడుగుతున్నట్లు రాశారు. ఈ వ్యాసం ముగిసే సమయానికి (రాత్రి 10.00) ఎబిఎన్ టీవీ పొత్తు కుదిరిపోయిందని, త్రిశూలం తయారై పోయిందని, బాబు 3 ఎంపీ సీట్లు యిస్తానంటే బిజెపి 6 అడుగుతోందని స్క్రోలింగ్ యిస్తోంది. జాతీయ ఛానెళ్లలో ఎన్‌డిటివి ఒక్కటి మాత్రమే పొత్తు కుదురుతోందని, బిజెపి 6-8 ఎంపీ సీట్లు అడుగుతోందని చెప్తోంది. తక్కినవేవీ కిమ్మనటం లేదు.
అసలు పవన్ వెళతారా లేదా అన్నది కూడా నిన్నటి దాకా సందిగ్ధంలో ఉండింది. తనకు రావలసిన సీట్లు వచ్చేసేయని, సీట్ల సర్దుబాటు చర్చలు టిడిపి, బిజెపి మధ్యలోనే కాబట్టి తను వెళ్లవలసిన అవసరం కనబడటం లేదని పవన్ అనుకుంటున్నారని ఆంధ్రజ్యోతి రాసింది. జనసేనకు యిచ్చే సీట్ల సంఖ్య తేలింది కానీ ఎక్కడో యింకా ప్రకటించలేదు కదా. ఆ స్థానాల్లో కొన్నిటిని బిజెపి అడుగుదా మనుకుని పవన్‌ను పిలిచిందేమో తెలియదు. వాళ్లు అడిగితే కాదనే పరిస్థితిలో లేరు వీళ్లు. ఒక శాతం ఓటింగు కూడా లేని బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకోవడానికి ఏకైక కారణం, ఎన్నికలలో వైసిపి అక్రమాల నుంచి రక్షణ ఏర్పరచుకోవడానికే అని టిడిపి అనుకూల మీడియా ఎలుగెత్తి చాటుతోంది. దీన్ని ప్రొఫెసరు నాగేశ్వర్ ‘ప్రొటెక్షన్ మనీ’ (రౌడీ మామాలు) అని చమత్కరించారు. ప్రొటెక్షన్ కోసం యిచ్చే ఎమౌంటు గురించి వ్యాపారస్తుడికి ఛాయిస్ ఉండదు కదా! ఈ వ్యాసం ముగిసే సమయానికి కూడా చంద్రబాబు, పవన్ దిల్లీలో అమిత్ షా పిలుపుకై ఎదురు చూస్తున్నారు నెల్లాళ్ల క్రితం లాగానే యివాళా అర్ధరాత్రి పిలుపు రావచ్చు. వివరాలు రేపు మాట్లాడుకుని ఏ ఆదివారానికో తుది అంకెలు బయటకు రావచ్చు. అప్పటిదాకా నిరీక్షించక తప్పదు – ‘వెయిటింగ్ ఫర్ గాడో’ కథలో పాత్రల్లా! (ఫోటోలు – ‘వెయిటింగ్ ఫర్ గాడో’ ‘ద ఛెయిర్స్’ ప్రదర్శనలు, నిరీక్షింప చేస్తున్న అమిత్ షా)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2024)