Advertisement

Advertisement


Home > Movies - Reviews

Bheema Review: మూవీ రివ్యూ: భీమ

Bheema Review: మూవీ రివ్యూ: భీమ

చిత్రం: భీమ
రేటింగ్: 2/5
తారాగణం:
గోపిచంద్, ప్రియభవాని శంకర్, మాళవిక శర్మ, నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ముకేష్ తివారి, శ్రీనివాస్ రావు, చమ్మక్ చంద్ర, సరయు తదితరులు
సంగీతం: రవి బస్రూర్
ఎడితర్: తమ్మిరాజు
కెమెరా: స్వామి జె గౌడ
నిర్మాత: కెకె రాధామోహన్
దర్శకత్వం: హర్ష
విడుదల: మార్చ్ 8, 2024

ఇప్పటికీ కొత్త పోకడలకి, ప్రయోగాలకి పోకుండా కేవలం పాత తరహా మాస్ మసాలా చిత్రాలనే చేసుకుపోతున్న హీరో గోపీచంద్. తాజాగా ఈ "భీమా"తో ముందుకొచ్చాడు. ట్రైలర్ చూస్తే సగటు మాస్ సినిమాలా అనిపిస్తూ ఇంకేదో ఉందనే ఫీల్ కలిగింది. ఇంతకీ ఏముందో చూదాం. 

కథలోకి వెళ్లితే రామ, భీమ సోదరులు. వీరిలో పేరుకి తగ్గట్టు, పాత "రాముడు-భీముడు" సినిమా మాదిరిగా రామ భయస్తుడు, మెతక. భీమ మాత్రం దుందుడుకు, వయోలెంట్. ఒక సంఘటనవల్ల వీళ్లిద్దరూ చిన్ననాడే విడిపోతారు. 

భీమా ఒక ఎస్సై దగ్గర పెరిగి పెద్దయ్యి తానూ ఎస్సై అవుతాడు. విద్య అనే టీచర్ ప్రేమలో పడతాడు. ఆమె రవీంద్ర వర్మ (నాజర్) అనే ఆయుర్వేద వైద్యుడికి ఫాలోవర్. 

అదే ఊళ్లో భవాని అనే ఒక కౄరిడికి సంబంధించిన ఒక ట్యాంకర్లో చిన్నపిల్లల్ని రవాణా చేసే క్రైం జరుగుతుంది. దానిని ఎదుర్కుంటాడు భీమ. ఆ తర్వాత ఏమౌతుందనేది కథ. 

ఈ కథని ఇంతటితో నడిపేయకుండా దేవుడు, ప్రేతాత్మ, ఆవాహన, తాంత్రిక పూజ...లాంటి అంశాలన్నీ పెట్టాల్సిన చోట పెట్టుకుంటూ నడిపాడు. ఎన్ని పెట్టినా, ఎలా రాసుకున్నా తీసిన విధానం మాత్రం పాతచింతకాయి అయిపోయింది. 

ఉదాహరణకి "నన్ను ఒక్కసారి అన్నయ్యా అని పిలవరా", అంటూ అన్నయ్య గోపిచంద్ తమ్ముడు గోపిచంద్ ని పదే పదే అడుగుతుండడం ఓవర్ సెంటిమెంటయ్యి ప్రేక్షకులకి చిరాకొస్తుందని తెలియనంత ఓల్డ్ స్కూల్లో సినిమాని తీసుకుంటూ వెళ్లిపోయాడు దర్శకుడు. 

అలాగే పోలీసులకి పని చేస్తేనే జీతం, లేకపోతే పోలీసులే జనానికి డబ్బివ్వాలి లాంటి విచిత్రమైన కాన్సెప్ట్స్ సెంటిమెంట్ ఇష్టపడే ప్రేక్షకులకి కూడా ఆయింట్మెంట్ అవసరమయ్యేలా ఉన్నాయి. 

గోపీచంద్ డబుల్ యాక్షన్లో పోలీస్ క్యారక్టర్ కి చేసినంత న్యాయం రామ పాత్రకి చేయలేదు. భీమగా యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం చాలా బాగున్నాడు. 

మొదటి హీరోయిన్ మాళవిక శర్మ గ్లామర్ కి సరిపోయింది. సెకండాఫులో వచ్చే సెకండ్ హీరోయిన్ ప్రియ భవాని శంకర్ ఎప్పుడో "బంగారుబుల్లోడు"లో రమ్యకృష్ణ నాటి గెటప్పులో లంగావోణీ వేసుకుని వాలుజడని వయ్యారంగా ఊపుతూ కనిపిస్తుంటుంది. ఉన్నంతలో ఆమె యాక్టివ్ గా బాగానే నటించింది. 

అతిధి పాత్రల్లో ఈటీవీ ప్రభాకర్, ఆయన సతీమణి మలయజ ఇద్దరూ కనిపించేసారు. పనిలో పనిగా వాళ్లబ్బాయి చంద్రహాస్ ని కూడా దింపుంటే ఇంకాస్త వినోదం కలిసొచ్చేది. 

సినిమా ప్రారంభంలో పరుశారముడి కథ, పరశురామక్షేత్రం అంటూ పెద్ద యాంబియెన్స్ ని సెట్ చేసి ఆసక్తి గొలిపేలా మొదలుపెట్టి తర్వాత కాసేపటికి పోలీసుగా డ్యూటీకొచ్చిన గోపిచంద్ చేత అక్కర్లేని కామెడీలు అవీ చేయించి అంచనాలని కింద పారేసాడు దర్శకుడు. ఎక్కడా ఆసక్తి గొలపని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వినడానికి విషయం లేని పాటలు, అనవసరానికి మించిన సెంటిమెంట్, పట్టు లేని రొట్టకొట్టుడు కామెడీ ట్రాక్..వెరసి 2024లో 1990ల నాటి సినిమా చూస్తున్న ఫీలింగొస్తుంది. 

"అదుర్స్", "డీజే"  సినిమాల్లో బ్రహ్మణ పాత్రల కామెడీ చూసాక ఇందులోని కామెడీ చాలా పేలవంగా ఉంది. ఉన్నంతలో ఏదో నరేష్ పాత్ర కాస్త కామెడీ ప్రయత్నించినా గోపిచంద్ మాత్రం బిగుసుకుపోయి ఆ పాత్రకి పూర్తిగా అన్యాయం చేయడమే కాకుండా వైవిధ్యం చూపడానికి దొరికిన అవకాశాన్ని వాడుకోలేదు. 

"మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ..మాకు బడ్జెట్ తక్కువ" అని ఒక పాత్ర హీరోతో అంటుంది. అది నేరుగా గోపిచంద్ నే అంటున్నట్టనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇలాంటివి కూడా వినోదానికి పనికొస్తాయి. 

అలాగే వెన్నెల కిషోర్ ట్రాక్ ఆసక్తికరంగా ఉంది. కానీ దానిని వాడాల్సినంత వాడలేదు. కెమెరా వర్క్ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదు. 

కమర్షియల్ మసాలా సరకులన్నీ పెట్టుకుని సరైన పాటలు, డ్యాన్సులు లేకుండా ఎందుకు వదిలేసారో అర్ధం కాదు. క్లైమాక్సులో వచ్చే ఫైటులో సూపర్ నేచురల్ ఎలిమెంట్, కణతల్లో మేకు దింపడం లాంటి హింసాత్మక చర్యలు వెరైటీగా ఉన్నాయనుకునేవాళ్ళకి నచ్చుతాయేమో. 

ఇది కన్నడ దర్శకుడు హర్ష కి తొలి తెలుగు సినిమా. మేకింగ్ స్టైల్లో కొన్ని కొత్తపద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. మరొక సినిమా ఈ పద్ధతిలో తీస్తే వచ్చినంత త్వరగా ఔట్ డేటెడ్ ముద్ర వేయించుకునే ప్రమాదముంది. 

ఈ చిత్రంలోని క్లైమాక్సులో "భీమా..!!" అంటూ రామా గట్టిగా పిలుస్తాడు. కానీ సినిమాలో అతి పోకడలు, అతికీ అతకని ఎమోషన్ చూసినప్పుడల్లా ప్రేక్షకులు "రామా..!" అంటూ చాలాసార్లు నిట్టూర్చారు. 

కొంత యాక్షన్, కొంత కామెడీ, కాస్తంత బ్రదర్ సెంటిమెంట్, ఒక్కరవ్వ రొమాన్స్, కొంచెం సూపర్ నేచురల్ ఎలిమెంట్ కలిపి దంచిన మసాలాతో వండివార్చిన చిత్రమిది. ఈ సినిమా ఏ సంక్రాంతికో వచ్చుంటే సరిపోయేది. నాలుగు సినిమాలతో పాటూ నారాయణ అన్నట్టుగా కొట్టుకెళ్లిపోయేది. ఇలాంటి రొటీన్ మసాలా సినిమాలకి అది మంచి సీజన్. ఇప్పుడు రావడం రాంగ్ టైమే. 

బాటం లైన్: రొటీన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?