టీడీపీలో మేధావులు లేరా…జ‌గ‌న్‌ను కాపీ కొట్ట‌డ‌మా?

చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టించిన మేనిఫెస్టోపై విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్  న‌వ‌ర‌త్నాల పేరుతో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌నే టీడీపీ కాపీ కొట్ట‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నమ‌వుతున్నాయి. జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న అమ్మ ఒడి…

చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టించిన మేనిఫెస్టోపై విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్  న‌వ‌ర‌త్నాల పేరుతో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌నే టీడీపీ కాపీ కొట్ట‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నమ‌వుతున్నాయి. జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న అమ్మ ఒడి ప‌థ‌కానికి చంద్ర‌బాబు త‌ల్లికి వంద‌నం పేరుతో ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ ఇస్తున్నంత సొమ్మునే చంద్ర‌బాబు కూడా ఇస్తాన‌న్నారు. కాక‌పోతే కుటుంబంలో ఎంత మంది ఉన్నా ఒక‌రికే జ‌గ‌న్ ఇస్తున్నారు. చంద్ర‌బాబు మాత్రం ఎంత మంది వుంటే, అంద‌రికీ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌చేస్తాన‌ని న‌మ్మ‌బ‌లికారు.

అలాగే  45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల‌లోపు వ‌య‌సు గ‌ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మ‌హిళ‌ల‌కు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు వైఎస్సార్ చేయూత పథకాన్ని జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నారు. ఈ ప‌థ‌కాన్ని టీడీపీ కాపీ కొట్టింది. ఆడ‌బిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల లోపు మ‌హిళ‌లకు నెల‌కు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే వైఎస్సార్ చేయూత ప‌థ‌కం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున అంద‌జేస్తోంది. నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందించ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ ఆర్థిక సాయం అందిస్తున్నారు.  

అలాగే రైతుల‌కు వైఎస్సార్ భ‌రోసా ప‌థ‌కం కింద ఏడాదికి రూ.13,500 చొప్పున జ‌గ‌న్ ప్ర‌భుత్వం అందిస్తోంది. ఇప్పుడు చంద్ర‌బాబు అదే ప‌థ‌కాన్ని కొంత మెరుగులు దిద్ది రూ.20 వేలు అందిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల్ని నిబ‌ద్ధ‌త‌తో అమ‌లు చేస్తున్నార‌ని, ఇక చంద్ర‌బాబు చేసేదేముంటుంద‌నే ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. కాస్త విభిన్నంగా, అంద‌రికీ ఆమోద‌యోగ్యంగా సంక్షేమంతో కూడిన అభివృద్ధి ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించ‌డంలో చంద్ర‌బాబు ఫెయిల్ అయ్యారనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

టీడీపీలో మేధావుల కొర‌త స్ప‌ష్టంగా ఈ మేనిఫెస్టో ద్వారా క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతు న్నాయి. ఇంత కాలం జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న‌ సంక్షేమ ప‌థ‌కాల‌నే విమ‌ర్శిస్తూ, ఇప్పుడు అవే త‌మ‌కు దిక్కు అన్న‌ట్టు ఆశ్ర‌యించ‌డం ఏంట‌నే నిల‌దీత‌ల‌కు స‌మాధానం క‌రువైంది. ఇది ముమ్మాటికీ జ‌గ‌న్ విజ‌య‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. సీనియ‌ర్ రాజ‌కీయ విశ్లేష‌కుడు మాకిరెడ్డి పురుషోత్త‌మ్‌రెడ్డి చేసిన ట్వీట్ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

” వైసీపీకి టీడీపీ మ‌హానాడు కానుక‌! ప‌థ‌కాల‌తో రాష్ట్రం దివాళా తీస్తుంద‌నే విమ‌ర్శ‌ల‌కు, ప‌థ‌కాల‌తో ఓట్లు ప‌డ‌తాయా? అనే వైసీపీ శ్రేణుల అనుమానాల‌ను మేనిఫెస్టోతో నివృత్తి చేశారు. అధికార పార్టీ విధానాల‌ను స‌మూలంగా మారుస్తామ‌ని అనాల్సిందిపోయి మెరుగులు దిద్దుతామ‌ని అన‌డం కంటే అధికార పార్టీకి టీడీపీ ఇచ్చే బ‌హుమానం ఏముంటుంది?” అని మాకిరెడ్డి ట్వీట్ చేశారు. జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలు అద్భుత‌మ‌ని టీడీపీ స్టాంప్ వేసింద‌నేది పురుషోత్తం ట్వీట్ సారాంశం.

ఔను, మేనిఫెస్టో కోసం టీడీపీ ప్ర‌త్యేకంగా క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్టు స‌మాచారం. క‌మిటీలో ఎంతోకొంత మేధావులు వుంటారు. మ‌రి జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల‌ను కాస్త అటుఇటుగా మార్చేందుకు ఒక క‌మిటీ, క‌స‌ర‌త్తు, దానికి టైమ్ తీసుకోవ‌డం లాంటివి అవ‌స‌ర‌మా? మొత్తానికి ఇంత కాలం జ‌గ‌న్‌ను తిడుతూ వ‌చ్చిన టీడీపీ నేత‌లంతా మేనిఫెస్టో ప్ర‌క‌ట‌న‌తో అభాసుపాల‌య్యార‌నే చ‌ర్చ న‌డుస్తోంది.