నారా లోకేశ్ పాదయాత్ర టీడీపీకి పట్టున్న ప్రాంతంలో సాగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ పాదయాత్ర సాగుతోంది. లోకేశ్‌ను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారని, అర్ధరాత్రి వరకూ రోడ్లపై ఎదురు చూస్తున్నారని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే లోకేశ్ పాదయాత్ర వైపు ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడం ఇటు టీడీపీలో, అటూ రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
లోకేశ్ పాదయాత్రలో గుంటూరు, విజయవాడ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని పాల్గొనకపోవడం టీడీపీని షాక్‌కు గురి చేస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలుపొందారు. ఆ ఇద్దరిలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన గల్లా జయదేవ్, కేశినేని నాని పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌ను లైట్ తీసుకోవడం గమనార్హం. టీడీపీ అధిష్టానం వైఖరిపై గల్లా జయదేవ్, కేశినేని తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
ఇటీవల కేశినేని నాని సొంత పార్టీపై తన ఆగ్రహాన్ని బహిరంగంగానే ప్రకటించారు. చెత్త నాయకుల్ని టీడీపీ అధిష్టానం ప్రోత్సహి స్తోందని ఆయన దుయ్యబట్టారు. బుద్దా వెంకన్న, బొండా ఉమా, దేవినేని ఉమామహేశ్వరరావు తదితర నేతల్ని దృష్టిలో పెట్టుకుని కేశినేని ఘాటు విమర్శలు చేశారనే చర్చ జరుగుతోంది. విజయవాడలో తన తమ్ముడు కేశినేని చిన్నాను ప్రోత్సహించడాన్ని నాని జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రధానంగా లోకేశ్ అండదండలతోనే కేశినేని చిన్ని విజయవాడ నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారనేది నాని ఆరోపణ. అందుకే లోకేశ్ పాదయాత్రలో ఎందుకు పాల్గొనాలని సన్నిహితులతో నాని అన్నట్టు తెలిసింది. ఏది ఏమైనా టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లోకేశ్ పాదయాత్రలో ఇద్దరు ఎంపీలు పాల్గొనకపోవడం ఆ పార్టీకి ఇబ్బందికరమే. ఈ ఎపిసోడ్‌తో టీడీపీలో అంతర్గత విభేదాలున్నాయని బయటపడినట్టు ప్రచారమవుతోంది.