ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి ప్ర‌తిపాద‌న ఇదీ!

వైసీపీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై దృష్టి సారించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి ఓటు వేశార‌న్న కార‌ణంతో ఆమెపై వైసీపీ వేటు వేసింది.…

వైసీపీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై దృష్టి సారించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి ఓటు వేశార‌న్న కార‌ణంతో ఆమెపై వైసీపీ వేటు వేసింది. రాజ‌ధాని ప్రాంత ఎమ్మెల్యే అయిన శ్రీ‌దేవి ఇటీవ‌ల లోకేశ్ స‌మక్షంలో యాంక‌రింగ్ కూడా చేశారు. రాజ‌ధాని రైతుల‌కు అన్యాయం చేశాన‌ని క్ష‌మాప‌ణ కూడా కోరారు. దీంతో ఆమె మ‌రోసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నార‌ని అంద‌రికీ అర్థ‌మైంది.

త‌న వెనుక చంద్ర‌బాబునాయుడు, లోకేశ్ ఉన్నార‌ని, కావున భ‌య‌ప‌డేది లేద‌ని శ్రీ‌దేవి స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లో ఆమె టీడీపీ కండువా క‌ప్పుకోనున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబునాయుడితో శ్రీ‌దేవి దంప‌తులు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఎదుట శ్రీ‌దేవి ప్ర‌తిపాద‌న వెలుగు చూసింది.

బాపట్ల లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేయాల‌నే త‌న ఆస‌క్తిని చంద్ర‌బాబు ఎదుట బ‌య‌ట పెట్టినట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం. ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ స్థానం. ప్ర‌స్తుతం అక్క‌డి నుంచి వైసీపీ త‌ర‌పున నందిగం సురేష్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో బాపట్ల నుంచి పోటీ చేస్తే అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌లో అడుగు పెట్టొచ్చ‌నే ధీమాలో ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి ఉన్నారు.

ఆర్థికంగా కూడా శ్రీ‌దేవి బాగా ఉండ‌డంతో ఆమెకు టికెట్ ఇవ్వ‌డ‌మే స‌రైంద‌ని టీడీపీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంద‌ని తెలిసింది. తాడికొండ నుంచి టీడీపీ త‌ర‌పున ఆశావ‌హుల సంఖ్య బాగానే వుంది. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావ‌ణ్‌కుమార్‌తో పాటు సొంత పార్టీ పెట్టుకుని టీడీపీ ప‌ల్ల‌కీ మోస్తున్న రిటైర్డ్ న్యాయ‌మూర్తి, అలాగే అమ‌రావ‌తి ఉద్య‌మం పేరుతో వైసీపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ, చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడికి భ‌జ‌న చేస్తున్న కొలక‌పూడి శ్రీ‌నివాస్‌రావు త‌దిత‌రులు తాడికొండ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి బాప‌ట్ల లోక్‌స‌భ సీటుపై క‌న్నేశార‌ని స‌మాచారం. ఈ మేర‌కు త‌న ప్ర‌య‌త్నాల్ని ఆమె వేగ‌వంతం చేశారు.