కుట్ర చేయడం చాలా ఈజీ. ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసమే.. కోట్ల రూపాయల బేరం పెట్టి.. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటుకు కొన్ని కోట్లు అయినా కుమ్మరించగలరు. ఓటుకోసం ఇతరత్రా తాయిలాలు కూడా వెల్లువలా కురిపించగలరు. వైఎస్సార్ కాంగ్రెస్ మీద అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లు వేయించుకోవడానికి చంద్రబాబు వద్ద అనేక కుట్ర పథకాలు ఉన్నాయి. అయినా సరే.. బరిలోకి దిగడానికి ఆయన భయపడుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిని మోహరించకుండా సైలెంట్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వారు పైకి చెప్పుకుంటున్న కారణాలు ఏమైనప్పటికీ.. రాజ్యసభ ఎన్నికల్లో బరిలోకి దిగి.. ఒకవేళ ఓటమి పాలైతే.. ఆ ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికల మీద ఉంటుందనే భయమే చంద్రబాబు వెనుకంజకు అసలు కారణం అని తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న బలాబలాలను బట్టి.. ఏపీలో ఎన్నికలు జరిగే మూడు రాజ్యసభ స్థానాలను గంపగుత్తగా వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. ఒక్కో ఎంపీకి కావాల్సింది 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు మాత్రమే. జగన్ చేస్తున్న మార్పుల వల్ల కొందరు అసంతృప్తికి గురవుతున్నారని భావిస్తున్నప్పటికీ, అలాంటి అసంతృప్తి తిరుగుబాటు ఆలోచన ఉన్న వారు పట్టుమని పదిమంది కూడా లేరు. ఇప్పటికే తెలుగుదేశం పంచన చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై స్పీకరు వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం రాజ్యసభ నెగ్గడం అంత ఈజీ కాదు.
ఆ పార్టీకి ఉన్నది కేవలం 18 మంది బలమే. నెగ్గాలంటే ఇంకా 26 ఓట్లు కావాలి. వైసీపీలో అంతమంది అసంతృప్తులు ఉంటారని, వారందరి ఓట్లను కొనుగోలు చేయవచ్చునని చంద్రబాబు అంచనా వేశారు గానీ.. వర్కవుట్ కాలేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అప్పట్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకున్నారు. బలం లేకపోయినా సరే.. వైసీపీ ఒక ఎమ్మెల్సీ సీటు నెగ్గింది. కుట్రపూరితమైన ఆ గెలుపును ఏదో ప్రజాబలం లాగా చాటుకుంటూ.. విపరీతంగా డప్పు కొట్టుకున్నారు. ఇప్పుడు రాజ్యసభకు వాతావరణం అంత సాఫీగా ఏమీ లేదు. వైసీపీ మోహరించే ముగ్గురు అభ్యర్థులకు ఖచ్చితంగా 44 కంటె ఎక్కువ ఓట్ల వంతున పడతాయి.
తేదేపా బరిలోకి దిగితే.. తిరుక్షవరం తప్పదు. ఇప్పుడు ఓడిపోతే గనుక.. పరువు గంగలో కలుస్తుంది. ఆ ప్రభావం- రాబోయే ఎన్నికల మీద కూడా పడుతుంది. చంద్రబాబు అత్యాశకు పోయి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రజలు చీదరించుకునే ప్రమాదమూ ఉంది. అందువల్ల చంద్రబాబు ముందుజాగ్రత్తగా తమ పార్టీ పోటీచేయరాదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.