కాదేదీ రాజకీయాలకు అతీతమనే రీతిలో టీడీపీ వ్యవహార శైలి వుంది. చివరికి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని కూడా టీడీపీ వదిలిపెట్టలేదు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి లోకేశ్ తిరుమల పర్యటనను వాడుకోవడం టీడీపీకే చెల్లింది. కుప్పం నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందడానికి గురువారం వెళ్లారు.
స్వామి వారిని దర్శించుకుని కుప్పానికి బయల్దేరారు. కానీ తిరుమలేశుని సందర్శనను టీడీపీ తమ రాజకీయ పబ్బం గడుపుకోడానికి వాడుకునేందుకు యత్నించింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన లోకేశ్‌ను గంటకు పైగా క్యూకాంప్లెక్స్‌లోనే ఉంచారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శించడం గమనార్హం. తిరుమల ఆలయంలోనూ వైసీపీ ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ దిగజారుడుకు ఇది నిదర్శనమన్నారు.
బీటెక్ రవి విమర్శలను గమనిస్తే… ఎవరివి దిగజారుడు రాజకీయాలో అర్థమవుతుందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. లోకేశ్, చంద్రబాబు దృష్టిలో పడడానికి బీటెక్ రవి లాంటి నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
లోకేశ్ పర్యటన నేపథ్యంలో కడప విమానాశ్రయంలోకి నిబంధనలకు విరుద్ధంగా అనుమతించలేదనే బీటెక్ రవి వీరంగం సృష్టించారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. క్యూకాంప్లెక్స్‌లో కనీసం గంట సమయం కూడా దేవుని కోసం కూచోలేరా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతిదీ రాజకీయం చేయడంలో టీడీపీ ఆరితేరిందని, ఆ పార్టీ ఆటలు చెల్లవని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.