Advertisement

Advertisement


Home > Politics - Analysis

లోకేశ్, జ‌గ‌న్ పాద‌యాత్ర‌ల‌కు ఇదే తేడా...!

లోకేశ్, జ‌గ‌న్ పాద‌యాత్ర‌ల‌కు ఇదే తేడా...!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, యువ‌నేత నారా లోకేశ్ కొత్త రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మొద‌లు పెట్ట‌నున్నారు. ఇందుకు యువ‌గ‌ళం పేరుతో చేప‌ట్ట‌నున్న పాద‌యాత్ర శ్రీ‌కారం చుట్ట‌నుంది. జ‌నం కోసం వ‌స్తున్న త‌న‌ను ఆశీర్వ‌దించాలని, ఆద‌రించాల‌ని కోరుతూ ఆయ‌న ఓ బ‌హిరంగ లేఖ రాశారు. స‌క‌ల జ‌నుల స‌మ‌స్య‌ల‌ను వినిపించే గొంతుక‌వుతాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. 4 వేల కీలోమీట‌ర్ల పాద‌యాత్ర‌ను 400 రోజుల్లో పూర్తి చేయ‌డానికి ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు.

ఈ ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు త‌న తండ్రి చంద్ర‌బాబునాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నుంచి మొద‌టి అడుగు వేయ‌నున్నారు. 4 వేల కిలోమీట‌ర్లు న‌డ‌వ‌గానే టీడీపీకి అధికారం ద‌క్కుతుంద‌నే భ‌రోసా లేదు. గ‌తంలో దివంగ‌త వైఎస్సార్‌, చంద్ర‌బాబునాయుడు, ఆ త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ల ద్వారానే అధికారాన్ని ద‌క్కించుకోవ‌డంతో, ఆ సెంటిమెంట్ మేర‌కు ఈ ద‌ఫా మ‌ళ్లీ టీడీపీ విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం మాత్ర‌మే.  

పిల్ల‌లు డాన్స్, పాట‌లు, పాఠాలు నేర్చుకుంటే ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇస్తామ‌ని పెద్ద‌లు ఆశ పెడుతుంటారు. తాజాగా 4 వేల కిలో మీట‌ర్లు న‌డిస్తే సీఎం సీటు ఇస్తామ‌ని చెప్ప‌డానికి అదేమీ బ‌హుమ‌తి కాదు. ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను గెల‌వ‌డంతో ముడిప‌డిన అంశం. గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర ద్వారా స‌క్సెస్ కావ‌డానికి, ఇప్పుడు లోకేశ్ కూడా అదే రీతిలో విజ‌యం సాధిస్తార‌నే వాదించే వాళ్లు ఒక విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాలి.

జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా మొద‌టిసారి జ‌నంతో మ‌మేకం అయ్యారు. త‌నను గెలిపిస్తే... తండ్రి వైఎస్సార్ పాల‌న‌ను తెస్తాన‌నే భ‌రోసా క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నించారు. వైఎస్సార్ పాల‌న‌కు ప్ర‌జ‌ల్లో సానుకూల‌త వుండింది. ఇదే జ‌గ‌న్‌కు క‌లిసొచ్చింది. కానీ లోకేశ్ విష‌యంలో అలా కాదు. చంద్ర‌బాబు పాల‌న అంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి. అందుకే కాబోలు బాబు పాల‌న‌ను మ‌ళ్లీ తీసుకొస్తాన‌ని లోకేశ్ ఎక్క‌డా చెప్ప‌డం లేదు. తండ్రి పాల‌న లోకేశ్‌కు ప్ర‌తికూల అంశం. బాబు పాల‌న ఎంత గొప్ప‌దంటే.... చివ‌రికి త‌న‌ను గెలిపించ‌లేనంత అని లోకేశ్‌కు బాగా తెలుసు. ఇదే జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే వైఎస్సార్ పాల‌న అనుకూల అంశం. జ‌గ‌న్‌, లోకేశ్ పాద‌యాత్ర‌ల‌కు ఇదే తేడా.

మరీ ముఖ్యంగా లోకేశ్ ఓ విష‌యాన్ని గుర్తించుకోవాలి. వైఎస్ జ‌గ‌న్‌పై ఓ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుడిగా అక్క‌సు పెంచుకున్నారు. కానీ జ‌నంలోకి వెళ్లిన‌ప్పుడు వారిపై త‌న అభిప్రాయాల్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రుద్ద‌కూడ‌దు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను గుర్తించి అందుకు త‌గ్గ‌ట్టు మాట్లాడితే ఆమోదం ల‌భిస్తుంది. అలా కాకుండా సైకో పాల‌న పోవాలి, సైకిల్ పాల‌న రావాల‌నే త‌న నినాదాన్ని రుద్దే ప్ర‌యత్నం చేస్తే మాత్రం.... పాద‌యాత్ర అట్ట‌ర్ ప్లాప్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

జ‌గ‌న్ పాల‌న‌పై జ‌నాగ్ర‌హం ఎక్క‌డుందో లోకేశ్ తెలుసుకోవాలి. అందుకు తగ్గ‌ట్టు వారికి భ‌రోసా, ఊర‌డింపు క‌లిగేలా ప్ర‌వ‌ర్తించాలి. రామేశ్వ‌రం పోయినా శ‌నేశ్వ‌రం త‌ప్ప‌లేద‌న్న చందంగా... పాద‌యాత్రికుడై జ‌నంలోకి వెళ్లినా, జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లే గుప్పిస్తే ఆశించిన ల‌క్ష్యం నెర‌వేర‌దు. ఇదేదో టీడీపీ, లోకేశ్ గొడ‌వ‌గా జ‌నం చూస్తారు. జ‌నం స‌మ‌స్య‌ల్ని విన‌డానికి, తెలుసుకోడానికి ప్రాధాన్యం ఇస్తేనే, వారికి చేరువ అవుతారు. లోకేశ్ ఎంత వ‌ర‌కు జ‌నంతో మ‌మేకం అవుతారో చూడాలి. దాన్ని బ‌ట్టే టీడీపీ భ‌విష్య‌త్ వుంటుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?