వైసీపీ సర్కార్ ఎట్టకేలకు తప్పు సరిదిద్దుకుంది. రియల్టర్లు, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తలొగ్గింది. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం గమనార్హం. పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులు వేసే లేఔట్లలో మొత్తం విస్తీర్ణంలో 5 శాతం స్థలాన్ని పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలంటూ 2021, డిసెంబర్ 6న రాష్ట్ర ప్రభుత్వం జీవో 145 తీసుకొచ్చింది.
ఈ జీవో జారీతో లౌఔట్లు వేయడం బాగా తగ్గిపోయింది. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల నుంచి ఆదాయం బాగా పడిపోయింది. వ్యాపారం కోసం తాము లేఔట్లు వేస్తుంటే, ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం 5 శాతం స్థలం తీసుకోవడం ఏంటనే నిలదీతలు రియల్టర్ల నుంచి ఎదురయ్యాయి. మరోవైపు లేఔట్లు వేస్తున్న వారు వినియోగదారులపై ఆ భారాన్ని వేయడంతో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ నిర్ణయంతో వ్యాపారులకు పోయేదేమీ లేదని, తాము నష్టపోవాల్సి వస్తోందని సామాన్య, మధ్యతరగతి, ఉన్నత వర్గాల ప్రజలు వాపోతున్నారు. కనీస అధ్యయనం చేయకుండా అర్థంపర్థం లేని నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన జీవో 145పై కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చింది. జీవోను వెనక్కి తీసుకుంటున్నట్టు మున్సిపల్ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఓ సమస్యకు సానుకూల పరిష్కారం లభించినట్టైంది.