పాదయాత్రలు ఎందుకు అంటే తెలుగుదేశం వారి కోసమే అన్నట్లుగా అనిపిస్తోంది. అమరావతి రాజధాని కోసం రైతులు పాదయాత్ర రెండు విడతలుగా చేశారు. దాని వెనక సమర్పణ సహకారం మొత్తం టీడీపీనే అని అంతా ప్రచారం సాగింది. తగినట్లుగానే ఎక్కడ చూసినా టీడీపీ నేతలే కనిపించారు.
ఇపుడు పోలవరానికి పాదయాత్ర అంటున్నారు తమ్ముళ్లు విశాఖ నుంచి పోలవరం దాకా పాదయాత్ర చేస్తామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు డెబ్బై ఒక్క శాతం పూర్తి చేశారుట. జగన్ నాలుగేళ్లలో ఏమీ చేయలేదుట.
అంతలా పోలవరం పూర్తి చేస్తే ఈ రోజున కచ్చితంగా ఏదో ఒక రూపు రేఖా రావాలి కదా అన్నదే వైసీపీ నేతల పాయింట్. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో డయాఫ్రం వాల్ ఎందుకు దెబ్బతింది ఎందుకు తొందరగా పద్ధతి లేకుండా కట్టారు అని వైసీపీ మంత్రి అంబటి రాంబాబు అడిగిన దానికి ఈ రోజుకీ సమాధానం ఉందా అని అడుగుతున్నారు.
పోనీ వైసీపీ నేతలు టీడీపీకి శత్రువులు అనుకుంటే నాడు నాలుగేళ్ల పాటు మిత్రుడిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీయే పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అని ఏపీకే వచ్చి ఘాటు విమర్శ చేయలేదా. పోలవరం కాంట్రాక్టుల కోసం ప్రత్యేక హోదాను పడుకోబెట్టేశారు అని వచ్చిన విమర్శలకు టీడీపీ నేతల వద్ద జవాబు లేదు కదా అని వైసీపీ నేతలు అంటున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ డెబ్బై ఒక్క శాతం అని టీడీపీ చెప్పడంలోనూ డొల్లతనం ఉంది అంటున్నారు. ఒక ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ముందు నిర్వాసితుల సమస్య తేల్చాలి. పోలవరం వంటి బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ విషయంలో నిర్వాసితుల నష్టపరిహారమే ఎక్కువగా ఉంది. అదే వేల కోట్లలో ఉంది. దాని ఊసు ఎత్తకుండా పోలవరం కట్టేశామని చెప్పుకోవడమేంటి అని ప్రశ్న వస్తుంది.
ఇవన్నీ ఇపుడు అవసరం లేదు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి పోలవరం విషయంలో గుండెలు బాదుకుంటూ ఒక పాదయాత్ర చేస్తే చాలు నింద అంతా అటు వైపు పోయి జనాలు తమ వైపు ఉంటారన్న తపనతో చేయబోతున్న రాజకీయ యాత్ర అంటున్నారు. పోలవరం విషయంలో తప్పు జరిగింది. దానికి టీడీపీ హయాంలోనే బీజం పడింది. కేంద్రం నుంచి తీసుకుని తామే కడతామని చెప్పినపుడే అది జాతీయ ప్రాజెక్ట్ కాదు ప్రాంతీయ ప్రాజెక్ట్ అని తేలిపోయింది.
సవరించిన అంచనాలు ఆమోదించని కేంద్రాన్ని నిలదీయడానికి ధైర్యం రాదు, మనసు అంతకంటే రాదు, వారిని వీరు వీరిని వారు అన్నట్లుగా విమర్శలు చేసుకుంటూ కూర్చుంటే పోలవరం మరో దశాబ్దం అయినా పూర్తి కాదు అన్నది అందరికీ తెలుసు. కానీ రాజకీయమే పరమావధిగా ఉన్న పార్టీలకు మాత్రం పట్టడం లేదు. అందుకే చలో పోలవరం అంటూ పాదయాత్ర చేపడతామని అంటున్నారు.
జయహో చంద్రన్న అంటూ నాడు పోలవరం వద్దకు జనాలను తీసికెళ్ళినపుడు ఏముందో ఇపుడు ఎంతవరకూ వర్క్ జరిగిందో స్వయంగా తమ్ముళ్ళు తెలుసుకుని వస్తామంటే పాదయాత్ర చేసుకోవచ్చు అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.