ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు ఉత్తరాంధ్రాకు చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పక్కా నాన్ లోకల్ అని అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు చెబుతున్నారు. ఇది నగ్నసత్యం అంటున్నారు. ఎక్కడ నుంచో వలస వచ్చి ఉత్తరాంధ్రా మీద పెత్తనం చేస్తారా అని అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూంటారని కానీ అయ్యన్న అసలు ఉత్తరాంధ్రా వారే కాదు, ఆయనే అతి పెద్ద వలసదారు అని లోగుట్టు విప్పి లోకానికి టీడీపీ రెబెల్ ఎమ్మెల్సీ ఈర్లె శ్రీరామమూర్తి చెబుతున్నారు.
అయ్యన్నపాత్రుడిది కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని అల్లిపూడి గ్రామం అని పుట్టు పూర్వత్తరాలతో సహా అంతా ఆయన బయటపెట్టారు. పక్క జిల్లాకు చెందిన అయ్యన్న తానే అసలైన ఉత్తరాంధ్రా బిడ్డ అని చెప్పడం కంటే మోసం లేదని ఈర్లె అంటున్నారు. అయ్యన్నను పట్టుకుని వెలమ కుల ద్రోహి అని కూడా ఆయన విమర్శించారు. ఆయన కులం కోసం బతికే నేత కాదని కులం మీద బతికే నేత అంటూ వైసీపీ వారు సైతం అనలేని మాటలనే అనేశారు.
సొంత పార్టీలో తన కులానికి చెందిన నాయకులను ఎదగనీయకుండా అయ్యన్న కుట్ర రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. తాను 2018లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరానని, తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని వెనక అయ్యన్న కుట్ర ఉందని అన్నారు. తాను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సన్నిహితంగా ఉంటాను అన కోపంతోనే అయ్యన్న తన మీద ఇలా కక్ష తీర్చుకుంటున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు.
తాను ఆషామాషీగా నామినేషన్ వేయలేదని తాను తప్పకుండా ఉత్తరాంధ్రా పట్టభద్రుల సీటుని గెలుచుకుని తీరుతాను అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు ఉత్తరాంధ్రాలోని ఉపాధ్యాయ సంఘాల నేతలతో పట్టభద్రులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తన గెలుపు ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేస్తున్నారు. గంటాకు సన్నిహితుడుని అని ఈర్లె చెప్పుకుంటున్నారు. విశాఖ జిల్లా రాజకీయలో చూస్తే గంటా అయ్యన్నల మధ్యన ఏ మాత్రం పొసగదు అన్నది తెలిసిందే.
టీడీపీ రెబెల్ గా పోటీ చేస్తున్న ఈర్లెకు గంటా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారా అన్న డౌట్లు వ్యక్తం అవుతున్నాయి. గంటా కనుక రంగంలోకి దిగితే టీడీపీ అధికార ఎమెల్సీ అవకాశాలు పూర్తిగా అడుగంటడం ఖాయమని అంటున్నారు. అయ్యన్న మాటకే చంద్రబాబు విలువ ఇచ్చి పార్టీ కోసం పనిచేసే వారిని పక్కన పెట్టారు అన్నది ఈర్లె ఆరోపణ. దీన్ని పార్టీ తమ్ముళ్ళు నమ్మితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈర్లె గెలుపు పక్కన పెడితే పార్టీ నిలబెట్టిన అభ్యర్ధికి ఇబ్బందులు తప్పవనే అంటున్నారు.