రోజా అడ్డాలో లోకేశ్

కుప్పం కేంద్రంగా మొద‌లైన లోకేశ్ పాద‌యాత్ర 17 రోజులు పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ఆయ‌న మంత్రి ఆర్కే రోజా అడ్డా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి చేరుకున్నారు. చంద్ర‌బాబు, నారా లోకేశ్‌ల‌పై రోజా ఒంటి కాలిపై లేచే…

కుప్పం కేంద్రంగా మొద‌లైన లోకేశ్ పాద‌యాత్ర 17 రోజులు పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ఆయ‌న మంత్రి ఆర్కే రోజా అడ్డా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి చేరుకున్నారు. చంద్ర‌బాబు, నారా లోకేశ్‌ల‌పై రోజా ఒంటి కాలిపై లేచే సంగ‌తి తెలిసిందే. పాద‌యాత్ర ప్రారంభం రోజు నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో లోకేశ్ మాట్లాడుతూ… రోజాపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. రోజాను డైమండ్ రాణి అని దెప్పి పొడిచారు.

ఈ నేప‌థ్యంలో 18వ రోజు లోకేశ్ పాద‌యాత్ర న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని పుత్తూరు మండ‌లం మీదుగా సాగుతుంది. న‌గ‌రి ఎమ్మెల్యే అయిన రోజాపై లోకేశ్ ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తారో అనే ఆస‌క్తి నెల‌కుంది. లోకేశ్‌ను రోజా అస‌లు రాజ‌కీయ నాయ‌కుడిగా గుర్తించ‌రు. లోకేశ్ పాద‌యాత్ర‌ను జోకేశ్ యాత్ర‌గా అభివ‌ర్ణించారు. లోకేశ్ పాద‌యాత్ర‌ను జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో ఆమె పోల్చిన సంగ‌తి తెలిసిందే. న‌గ‌రి నుంచి రెండుసార్లు గెలుపొందిన రోజాను ఈ ద‌ఫా ఎలాగైనా ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో టీడీపీ వుంది.

టీడీపీ అభ్య‌ర్థిగా దివంగ‌త మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు త‌న‌యుడు భానుప్ర‌కాశ్ రెండోసారి బ‌రిలో నిల‌వ‌నున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా తిరుగుతూ ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌తో పాటు వైసీపీ గ్రూపు రాజ‌కీయాలు త‌న‌కు క‌లిసి వ‌స్తాయ‌ని ఆయ‌న న‌మ్ముతున్నారు.

న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా ఈ సారి రోజాకు వ్య‌తిరేకంగా సొంత పార్టీలోనే వ్య‌తిరేకులు త‌యార‌య్యారు. వీరికి పార్టీలోని పెద్ద‌ల అండ‌దండ‌లున్నాయ‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. రోజాకు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌తో పాటు సొంత‌మ‌పార్టీలో వ్య‌తిరేకులతో త‌ల‌నొప్పిగా మారింది. ఈ నేప‌థ్యంలో రోజా వ్య‌వ‌హార‌శైలిపై లోకేశ్ ఎలాంటి విమ‌ర్శ‌లు చేస్తారో చూడాలి.