Advertisement

Advertisement


Home > Politics - Opinion

చుట్టూ మోహరిస్తున్న దురాత్ములు, సైంధవులు ఏపీ అభివృద్ధిపై కుట్ర!

చుట్టూ మోహరిస్తున్న దురాత్ములు, సైంధవులు ఏపీ అభివృద్ధిపై కుట్ర!

రాష్ట్రంలో సంక్షేమ పథకాలను స్థిరీకరించిన తర్వాత.. పెట్టుబడులు, పరిశ్రమలు, ఆ రూపేణా జరగగల అభివృద్ధి మీద ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పెట్టుబడుల సదస్సులకు దీటుగా, విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును నిర్వహిస్తుండడమే ఇందుకు ప్రతీక. మరికొన్ని వారాల్లో ఈ సమ్మిట్ జరగబోతుండగా.. జగన్ వ్యతిరేకుల కుట్ర రచనలు అప్పుడే మొదలవుతున్నాయి. ఇన్వెస్టర్లలో అనుమానాలను, ఒక రకమైన భయావహ వాతావరణాన్ని పాదుగొల్పడానికి విపక్షాలు కుటిల యత్నాలు ప్రారంభించాయి. 

ప్రజా సంక్షేమం విషయంలో.. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో పథకాలను అమలు చేస్తూ తతిమ్మా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న జగన్ సర్కారు.. చేతులు కట్టేయడానికి నిశ్శబ్దంగా సాగుతున్న కుట్ర ఇది. వారు ఆశిస్తున్న లక్ష్యాలు, వారికి గల కారణాలు వేరు వేరు! కానీ, అందరూ ఉమ్మడిగా టార్గెట్ చేస్తున్నది మాత్రం జగన్ సర్కారునే! అందరి కోరిక ఒక్కటే ఏపీ అభివృద్ధి జరగకూడదు.. ఎట్ లీస్ట్, జగన్ అధికారంలో ఉండగా జరగకూడదు.. అనేదే! ఈ కుట్రల వెనుక కారణాలను, వ్యూహాలను అన్వేషించే ప్రయత్నమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది వనరుల పరంగా ఒక అద్భుతం. విభజన జరగక ముందు ఎంత గొప్ప అద్భుతంగా ఉండేది.. విభజన వల్ల ఎంత నష్టపోయింది.. ఈ చర్చ మొత్తం పక్కన పెట్టండి. హైదరాబాదుతో ముడిపడిన ఒక అనుబంధం వలన, అప్పటిదాకా రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా అభివృద్ధి అనుకునే ప్రతిపనికీ హైదరాబాదు మాత్రమే కేంద్రం కావడం వలన, అనేకులు ఇదే మన రాజధాని అనుకుంటూ ఇక్కడ స్థిరపడడం వలన.. విభజన పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది గానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దారిద్ర్యంలో కూరుకుపోయే అవకాశం ఉంటుందనే కారణాల వల్ల కాదు. విడిపోయిన తర్వాత కూడా ఏపీ వనరుల పరంగా అతిగొప్ప అత్యద్భుత రాష్ట్రంగానే లెక్క తేలుతుంది. 

సస్యశ్యామలమైన భూములు, సరిగ్గా వాడుకోగలిగితే రాష్ట్రవ్యాప్తంగా ఎకరం నేల కూడా బీడుబారకుండా సాగునీరు అందించగల నదులు, ఖనిజ వనరులు, మానవ వనరుల్ని నిపుణులుగా తీర్చిదిద్దగల విద్యాసంస్థలు,  వీటన్నింటికి దీటుగా ఎగుమతుల మీద ధ్యాస ఉండే పెద్ద స్థాయి పరిశ్రమలు ఎగబడి వచ్చి పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించే 975 కిలోమీటర్ల అతిపెద్ద సముద్రతీరం.. ఇవన్నీ ఏపీ రాష్ట్రానికి సంపద చిహ్నాలే.  అత్యద్భుతమైన వనరులే. అయితే ఇంత సుసంపన్నమైన వనరులకు తగినట్టుగా ఏపీ అభివృద్ధి చెందుతోందా? ఏమాత్రం లేదు! ఎందుకిలా జరుగుతోంది. 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలు కన్నీళ్లు తెలిసిన మనిషి. ప్రభుత్వాలు రెండో ఎజెండా లేకుండా ప్రభుత్వాదాయాలకు వచ్చే ఇబ్బందులను ఖాతరు చేయకుండా ప్రజల కోసం ఆలోచిస్తాయని, వారి సంక్షేమం కోసం పెద్ద ఆలోచనలను కూడా వ్యయప్రయాసలకోర్చి అమలుచేస్తాయని ఈ దేశానికి రుచిచూపించిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న వ్యక్తి జగన్! తాను ముఖ్యమంత్రి కావడం అంటూ జరిగితే.. ఎన్ని రకాల అవాంతరాలు వచ్చినా సరే.. జనం సంక్షేమం దిశగానే తన తొలి నిర్ణయాలు ఉండాలనేది ఆయనలోని సంకల్పం. రాష్ట్రం ఏర్పడిన తొలిసారి అవకాశం రాలేదు. ఆయనేమీ నిరాశ చెంది మాటలకు పరిమితం కాలేదు. జనం మధ్యలోకి వెళ్లారు.

ప్రభుత్వం మీద బురద చల్లే సంగతి తరవాత, ప్రభుత్వం చేసే ప్రతి పనిలో లోపాలు వెతకడం తరవాత.. ముందు ప్రజల సమస్యలను తాను తెలుసుకోవాలనే సంకల్పంతో వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా సామాన్యులు ఎలాంటి స్థితిగతుల మధ్య జీవిస్తున్నారో తెలుసుకోవడానికి స్వయంగా కాలినడకన వెళ్లారు. ఆయన సంకల్పానికి ఒక తుల్యమైన, స్పష్టమైన రూపం వచ్చింది. ప్రజలకోసం ఏమేం చేయాలో అనేకానేక సంక్షేమ పథకాలు ఆయన మదిలో రూపుదిద్దుకున్నాయి. వాటన్నింటి ఫలితంగానే.. 2019లో అధికారంలోకి రాగానే సంక్షేమ ప్రభుత్వం ప్రారంభం అయింది. స్థూలంగా చెప్పాలంటే అప్పటినుంచి సైంధవుల ప్రయత్నాలు, కుట్రలు కూడా మొదలయ్యాయి.

జగన్మోహన్ రెడ్డి మౌలికంగా సంక్షేమ భావాలున్న మనిషి. ఆయన అంతరంగం ప్రజల బాగుకోసం పరితపిస్తుంటుంది. పారిశ్రామికీకరణ వంటివి సహజంగానే ద్వితీయ ప్రాధాన్యాలు అయ్యాయి. సంక్షేమం తొలి ప్రాధాన్యం అయింది. దేశమంతా ఆశ్చర్యంగా ఇటువైపు తలతిప్పి చూసేలా, ఆదర్శంగా ఎంచి తాము కూడా అమలు చేసేలా ఈ సంక్షేమ పథకాలు అమలయ్యాయి. అది నిస్సందేహం. అయితే ఇదే క్రమంలో కుట్రదారుల ప్రయత్నాలు శృతిమించాయి. అయిదేళ్లు పాలించి ఒక్క రోడ్డు గురించి పట్టించుకోకుండా వదిలేసిన వాళ్లు.. దెబ్బతిన్న రోడ్ల గురించి చిలవలు పలవలు చేసి ప్రచారం చేయడం.. ప్రభుత్వం రోడ్లను బాగు చేయడం లేదంటూ నిందలు వేయడం, మేము శ్రమదానంతో బాగుచేస్తాం అంటూ.. కాసింత తారు-కంకర గుమ్మరించి నాటకాలు నడిపించడం వంటి అసహ్యమైన పనులకు పాల్పడుతూ వచ్చారు. 

జగన్మోహన్ రెడ్డి పాలన పథం మాత్రం.. సంక్షేమం స్థిరీకరణ జరిగిన తర్వాత.. అభివృద్ధి మీద, పారిశ్రామికీకరణ మీద దృష్టి సారించాలన్నట్టుగానే సాగింది. ఇప్పుడు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతోంది. జగన్ సర్కారు ఈ సమ్మిట్ మీద చాలా ఆశలు పెట్టుకుంది. దావోస్ సదస్సుకు కూడా వెళ్లకుండా జగన్ పూర్తిగా విశాఖ సదస్సు మీదనే దృష్టి కేంద్రీకరించారు. ఢిల్లీలో గ్లోబల్ పారిశ్రామికవేత్తలతో జరిగిన సన్నాహక సమావేశానికి తాను స్వయంగా వెళ్లి మరీ వారికి పెట్టుబడులకు భరోసా ఇచ్చి వచ్చారు. త్వరలోనే రాజధాని కూడా విశాఖకు వెళ్లబోతున్నదనే సంగతి వెల్లడించారు. ఇలా ఒక సానుకూల దృక్పథంతో, ఆశావహ వాతావరణంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరుగుతోంది. సరిగ్గా ఇక్కడే డ్రామాలన్నీ మొదలవుతున్నాయి. 

ప్రత్యేకహోదా వంచనకు ఇది సీక్వెల్!

విభజన కారణంగా ఏపీ ఎంత సర్వనాశనం అయ్యే పరిస్థితి ఏర్పడినా.. అంతో ఇంతో ఆశ పుట్టించిన అంశాలు ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు. కేవలం నిధులు ఖర్చు పెట్టడంలో కమిషన్లు కాజేయడం కోసం, తన కులం వారికి కాంట్రాక్టులు కట్టబెట్టి అడ్డదారుల్లో తాను దోచుకోవడం కోసం చంద్రబాబునాయుడు.. జాతీయప్రాజెక్టుగా ప్రతిరూపాయి కేంద్రమే ఖర్చు పెట్టి పూర్తిచేయాల్సి ఉండగా, నిర్మాణ నిర్వహణ తానుచేస్తానని తీసుకుని దాన్ని భ్రష్టు పట్టించారు. 

ప్రత్యేకహోదా డిమాండ్ ను అలాగే అణగదొక్కేశారు. వైసీపీ పోరాటాలు చేస్తే కేసులు పెట్టారు. చివరికి ప్రత్యేకహోదా వద్దు ప్యాకేజీ చాలు అని నిధులు కాజేయడం మాత్రమే లక్ష్యంగా పావులు కదిపారు. అదికూడా చెడింది. బిజెపి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ హోదాను తీసుకురాలేకపోయారు. తీరా వారితో బంధం చెడిన తర్వాత.. దీక్షల పేరిట డ్రామానడిపించారు. మొత్తంగా ప్రజల్లో ఉండే ప్రత్యేకహోదా స్ఫూర్తిని నాశనం చేశారు. 

జగన్ పాలన చేపట్టే సరికి.. ఈ పాపాలన్నీ తలకు చుట్టుకున్నాయి. బతిమాలి, కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా తప్ప, అనునయ మార్గంలో తప్ప హోదా సాధించలేని పరిస్థితి ఏర్పడింది. జగన్ సర్కారు ఆ ప్రయత్నమే చేస్తోంది. అయితే ఎంపీలు ఉన్నాసరే.. హోదా సాధించడం లేదంటూ.. బిజెపితో వైరం పెట్టుకునేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పచ్చదళాలు రెచ్చిపోతున్నా సరే.. జగన్ సంయమనం కోల్పోకుండా ప్రత్యేకహోదా కోసం ప్రయత్నిస్తున్నారు. 

అలాంటి నేపథ్యంలో విశాఖలో సదస్సుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండగా.. రాష్ట్ర భవిష్యత్తుపై నీలినీడలు ప్రచారం చేసి.. ఇన్వెస్టర్లు రాకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి.. మూడు రాజధానులకు , అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ఈ సమయంలో జరుగుతున్న ప్రచారం ఇందులో భాగమే. జగన్ ఢిల్లీలో ఇన్వెస్టర్లతో త్వరలోనే రాజధాని విశాఖకు వెళుతుంది.. నేను కూడా అక్కడకే నివాసం మారుస్తున్నాను అని చెప్పి వచ్చిన తర్వాత.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాలం ఖర్మం కలిసొస్తే తాను ఈసారి చివరిచాన్స్ ముఖ్యమంత్రి అవుతానని కలగంటున్న చంద్రబాబునాయుడు ప్రతికూల ప్రచారం చేస్తున్నారు. విశాఖకు రాజధాని వెళ్లడం అసాధ్యం అని అంటున్నారు. 

నిజం చెప్పాలంటే రాజధాని వెళ్తుందో లేదో కూడా ఆయనకు అనవసరం. కానీ.. జగన్ చెప్పిన మాటలను ఇన్వెస్టర్లు నమ్మడానికి వీల్లేదు. జగన్ మాటలు నమ్మితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ఇన్వెస్టర్లు భయపడాలి. పెట్టుబడులు పెట్టడానికి సంకోచించాలి. ఆ రూపేణా పెట్టుబడులు రాకూడదు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు.. అనేదే ఆయన వ్యూహం. 

చంద్రబాబు వ్యూహంలో కేంద్రంలోని బిజెపి కూడా పావుగా మారుతోంది. వారు కూడా విశాఖకు రాజధాని వెళ్లవచ్చునా లేదా స్పష్టత ఇవ్వడం లేదు. కానీ.. అమరావతిని గతంలో నోటిఫై చేశామని మాత్రమే చెబుతున్నారు. చట్టం ప్రకారమే అది జరిగిందని అంటున్నారు. వారు అలా ఎటూ తేల్చకుండా గోడమీద పిల్లివాటంలా చెబుతున్నారు గానీ.. మొత్తానికి భయాల్ని , అనుమానాల్ని వ్యాపింపజేస్తున్నారు. 

పవన్ కల్యాణ్ వంతు పాత్ర ఆయన పోషిస్తున్నారు. బిజెపితో భాగస్వామి అయిన పవన్ కల్యాణ్ వారు ఏపీ ప్రతికూల ప్రకటనలకు తెగబడేలా ప్రేరేపించగలుగుతున్నారనే ప్రచారం కూడా ఉంది. 

బిజెపి వంచన జాస్తి..

కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ ఎదగకూడదని కంకణం కట్టుకున్నదా అనే అనుమానాలు ప్రజల్లో పుడుతున్నాయి. అయిదేళ్లు హోదా అని ఆనాటి కాంగ్రెస్ సర్కారు ప్రకటిస్తే.. అయిదేళ్లు ఏం సరిపోతాయి.. పదేళ్లు ఇవ్వాల్సిందే అని నినదించిన ఈ బిజెపి నేతలేనా.. ఏపీని ఇంతగా వంచిస్తున్నది అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. విభజన తర్వాత అనాథలా ఏర్పడిన రాష్ట్రం సర్వ నాశనం అయిపోవాలని కోరుకునే వారు మాత్రమే హోదా ఇవ్వడానికి నిరాకరిస్తారు. 

ప్రత్యేకహోదా అనేది వస్తే గనుక.. అపరిమితమైన ఖనిజవనరులు, మానవ వనరులు, భూములు, 975 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దపెద్ద అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు ఒక వెల్లువలా, ప్రవాహంలా వచ్చి పడడం తథ్యం. ఉత్పాదక రంగంలో దేశంలో అగ్రశ్రేణిలో ఉండే గుజరాత్ వంటి రాష్ట్రాలను తలదన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త శిఖరాలను అధిరోహించడం తథ్యం. కేవలం అందుకే.. ఆ మాటకొస్తే.. గుజరాత్ లో ఉన్న పరిశ్రమలు కూడా హోదా ఉంటే గనుక ఏపీకి తరలిపోతాయనే భయంతోనే కేంద్రం ఇవ్వలేదు అనే అనుమానం ప్రజల్లో ఉంది. 

దానికి తగ్గట్టుగానే ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరగబోతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లలో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీని దెబ్బకొట్టాలనే కుట్ర వ్యూహాలలో ఎవ్వరూ తక్కువ తినడంలేదు. ఎవరి వంతు పాత్ర వారు పోషిస్తున్నారు. 

ఇలాంటి సైంధవుల కుట్రలు ముందుముందు కూడా మరిన్ని జరుగుతాయి. అయితే.. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేయగలిగింది ఒక్కటే. మరింత అప్రమత్తంగా ఉండి, ఇన్వెస్టర్లలో మరింత భరోసాను నింపే వ్యూహాలతో ముందడుగు వేయడం. పారిశ్రామికీకరణ పరంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో అసమానమైన ముద్రను వేయడం!

- ఎల్ . విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?