ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక సమావేశానికి రెడీ అయ్యారు. ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. దీంతో రాజకీయ పక్షాలకు నిద్రపట్టడం లేదు. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఈ దఫా ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే రెండు పార్టీలకు రాబోయే ఎన్నికలు చావుబతుకుల సమస్య. అధికారంలోకి రాని పార్టీ కాలగర్భంలో కలిసి పోతుందనే భయం పట్టుకుంది.
దీంతో ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని వైఎస్ జగన్, అధికారాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. తమవైన ఆలోచనలతో జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే తమ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వారిని గడపగడపకూ మన ప్రభుత్వం పేరుతో జనంలోకి పంపిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై నివేదికలు తెప్పించుకుంటున్నారు.
మార్పుచేర్పులపై జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. తనతో పాటు మరోసారి ప్రతి ఒక్కరూ తిరిగి ఎన్నిక కావాలని కోరుకుంటున్నట్టు జగన్ చెబుతున్నారు. లోపాలను చెబుతూ, పద్ధతి మార్చుకోవాలని, టికెట్ ఇవ్వని పరిస్థితి తెచ్చుకోవద్దని మరీమరీ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్, వెంకటగిరి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలను జగన్ మధ్యలోనే తప్పించారు.
ఇవాళ మరో కీలక సమావేశానికి జగన్ సిద్ధమయ్యారు. తాజాగా గృహ సారథుల నియామకం నేపథ్యంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాధాన్యం వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గ్రామ సచివాలయాలకు అనుబంధంగా పని చేసే వాలంటీర్లతో తమకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇది చాలదన్నట్టు జగన్ గృహ సారథుల నియామకాన్ని చేపట్టి, ప్రతిపక్ష పార్టీల నేతలకు మరింత చికాకు తెప్పించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జగనన్న సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు రాష్ట్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, సంక్షేమ పథకాల లబ్ధిదారులను వైసీపీ ఓటు బ్యాంక్‌గా ఎలా కాపాడుకోవాలి తదితర అంశాలపై జగన్ దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి.
గృహ సారథుల నియామకం తర్వాత జగన్ నిర్వహిస్తున్న మొదటి సమావేశం కావడంతో ఆయన మనసులో ఎలాంటి ఆలోచనలున్నాయో తెలిసే అవకాశం ఉంది. ఈ సమావేశంపై ప్రతిపక్షాలు కన్ను వేశాయి. జగన్ వ్యూహాలు ఒక పట్టాన ఎవరికీ అంతు చిక్కవు. జగన్ ఎప్పుడు, ఎలా దెబ్బ కొడతారో అనే భయం ప్రతిపక్షాలను వెంటాడుతోంది. అందుకే ఇవాళ్టి సమావేశం వివరాలను తెలుసుకోవాలనే ఆత్రుత ప్రతిపక్షాల్లో వుంది.