ఏపీకి చెందిన కాపు, బలిజ నాయకులను తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వం వహిస్తున్న బీఆర్ఎస్ ఆకర్షిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్ష బాధ్యతల్ని కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జనసేన నేపథ్యం ఉన్న బలిజ నాయకురాలు చదలవాడ సుచరిత కూడా బీఆర్ఎస్‌లో చేరే అవకాశాలున్నాయి. ఈమె భర్త చదలవాడ కృష్ణమూర్తి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ కూడా. 2019 ఎన్నికల్లో జనసేన తరపున తిరుపతి నుంచి చదలవాడ పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జనసేన కార్యకలాపాలకు దూరంగా వుంటున్నారు.
ఈ నేపథ్యంలో చదలవాడ కృష్ణమూర్తి భార్య సుచరిత రాజకీయంగా మళ్లీ యాక్టీవ్ కావడం చర్చనీయాంశమైంది. పైగా జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయ పంథాను ఆమె విమర్శిస్తుండడం ఆసక్తికర అంశం. టీడీపీ, వైసీపీలు కాపు, బలిజలకు అన్యాయం చేశాయని ఆమె విమర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు కేసీఆర్ వల్ల నష్టం జరగలేదని బలంగా వాదిస్తున్నారు. కేవలం చంద్రబాబు, జగన్, బీజేపీ నేతల రాజకీయ స్వార్థం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగిందని ఆమె విమర్శిస్తున్నారు.
దీంతో సుచరిత రాజకీయ ఆలోచనలు బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయనే చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో బలమైన సామాజిక వర్గం కాపు, బలిజలకు రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దీంతో రాయలసీమకు గుండెకాయ లాంటి తిరుపతి వేదికగా బీఆర్ఎస్ వాయిస్‌ను దీటుగా వినిపించాలని సుచరిత కోరుకుంటున్నారని తెలిసింది.
బీఆర్ఎస్ నేతలతో ఇప్పటికే ఆమె చర్చించినట్టు సమాచారం. విద్యావేత్తగా కూడా ఆమెకు గుర్తింపు వుంది. అలాగే బలిజల సమస్యలపై పోరాడుతున్న నాయకురాలిగా ఆమెను ఆ సామాజిక వర్గం సొంత చేసుకునే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ అంటోంది.
టీడీపీకి సుగుణమ్మ రూపంలో బలిజ మహిళ నాయకత్వం వహిస్తోంది. అయితే వయసు పైబడుతుండడం, అల్లుడు సంజయ్ పెత్తనం తదితర కారణాలు ఆమెకు ప్రజాదరణ కోల్పోయేలా చేసింది. తిరుపతి బలిజ సామాజిక వర్గీయులు సుచరిత లాంటి యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సామాజిక, రాజకీయ అంశాలపై ఆమెకు అవగాహన ఉండడం కలిసొచ్చే అంశం.
బీఆర్ఎస్‌లో సుచరిత చేరితే మాత్రం… తిరుపతిలో టీడీపీకి భారీ దెబ్బ అని హెచ్చరించక తప్పదు. అందుకే బీఆర్ఎస్‌లో సుచరిత చేరికను అడ్డుకునేందుకు సుగుణమ్మతో పాటు బలిజ సామాజిక వర్గంలోని కొందరు టీడీపీ నేతలు కుట్రలకు తెరలేపారని సమాచారం. వీటిని సుచరిత ఎలా ఎదుర్కొంటారో మరి!