మాతోనే ప‌వ‌న్‌…జ‌న‌సేన‌ను ఇరికించిన మాజీ మంత్రి!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ వైఖ‌రిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత పితాని స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి వ్యాఖ్య‌లు వైసీపీకి రాజ‌కీయంగా ఆయుధం ఇచ్చిన‌ట్టైంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులో మాజీ…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ వైఖ‌రిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత పితాని స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి వ్యాఖ్య‌లు వైసీపీకి రాజ‌కీయంగా ఆయుధం ఇచ్చిన‌ట్టైంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులో మాజీ మంత్రి పితాని మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వైఖరిపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. టీడీపీతోనే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉన్న‌ట్టు ఆయ‌న తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

టీడీపీతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌ల‌వ‌డానికి ముందుకొస్తుంటే బీజేపీ భ‌య‌ప‌డుతోందని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ త‌ప్పుడు రాజ‌కీయం చేస్తోందని విరుచుకుప‌డ్డారు. అంతేకాదు, రాష్ట్రానికి, దేశానికి బీజేపీ అవ‌స‌ర‌మా? అని ప్ర‌శ్నించే రాబోతోంద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయంగా క‌ల‌వ‌కుండా బీజేపీ ఇంకెంత కాలం అడ్డుకుంటుందో చూస్తామ‌ని ఆయ‌న ఆగ్ర‌హంతో ఊగిపోయారు.

ఏపీలో బీజేపీ ద్వంద్వ రాజ‌కీయాలు చేస్తోంద‌ని విమ‌ర్శించారు. ఒక‌వైపు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తున్న‌ట్టు న‌టిస్తూ, తెర‌వెనుక మాత్రం సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు బీజేపీ మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని మండిప‌డ్డారు. మూడు రాజ‌ధానుల‌పై ఒక్కో సంద‌ర్భంలో ఒక్కోలా బీజేపీ చెబుతోంద‌న్నారు. ఒక‌సారి అనుకూల‌మ‌ని, మ‌రొక‌సారి వ్య‌తిరేక‌మంటూ రాష్ట్ర ప్ర‌జానీకాన్ని మ‌భ్య‌పెడుతోంద‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు.  

బీజేపీపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి ఏపీ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు భ‌య‌ప‌డే సంగ‌తి తెలిసిందే. అలాంటిది బీజేపీపై టీడీపీ సీనియ‌ర్ నేత తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఒక్క‌సారిగా బీజేపీపై మాజీ మంత్రి పితాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం వెనుక కార‌ణం ఏమై వుంటుందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. 

మ‌రోవైపు టీడీపీతోనే జ‌న‌సేనాని వున్నాడ‌నే కామెంట్స్ ప‌వ‌న్‌కు ముమ్మాటికీ రాజకీయంగా న‌ష్టం తెచ్చేవే. ఎందుకంటే ఇదే విష‌యాన్ని వైసీపీ ప‌దేప‌దే విమ‌ర్శిస్తోంది. అధికార పార్టీ విమ‌ర్శ‌ల‌కు బ‌లం క‌లిగించేలా పితాని కామెంట్స్ ఉన్నాయి. పితాని వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన‌, బీజేపీ ఎలా స్పందిస్తాయో మ‌రి!