కన్నాతో రాజీలేదు.. కానీ పార్టీ కోసం పనిచేస్తాం!

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తన కొడుక్కి టికెట్ ఇస్తే చాల‌ని ప్ర‌క‌టించిన‌ టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు యూటర్న్ తీసుకున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను…

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తన కొడుక్కి టికెట్ ఇస్తే చాల‌ని ప్ర‌క‌టించిన‌ టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు యూటర్న్ తీసుకున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను వ‌చ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ సీటు ఇస్తే  పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. గతంలో తను డబ్బుల్లేక ఓడిపోయానని ఇప్పుడు కావాల్సినంత డబ్బుతో సిద్ధమైనట్లు ప్రకటించారు.

ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి ఈసారి పెద్ద ఎత్తున వేవ్ ఉంద‌ని.. తన కుమారుడు రంగబాబుకు మ‌రియు తన తమ్ముడి కుమార్తె శైలజాకు టికెట్లు ఇవ్వాలని విజ్ఞ‌ప్తి చేశారు. వారి ఇద్దరికీ టికెట్ ఇస్తే తనకు టికెట్ ఇవ్వకున్నా పరవాలేదన్నారు. సత్తెనపల్లి అసెంబ్లీ సీటు మాత్రం త‌మ‌ కుటుంబానికి ఇవ్వాలన్నారు.

నరసరావుపేటకు స్థానికులే అభ్యర్థిగా ఉండాలని.. కన్నాతో రాజీపడక‌పోయిన‌.. ఆయ‌న‌కు పార్టీ టికెట్ ఇస్తే ఆయ‌న గెలుపు కోసం కలిసి పనిచేస్తామన్నారు. మాచర్లలో బ్రహ్మారెడ్డి ఖచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. గురజాలలో మాత్రం కరప్షన్ లేని వ్యక్తులకు టికెట్ ఇవ్వాలన్నారు. 

కాగా 12 ఏళ్ల క్రితం త‌న‌పై రాయపాటి అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని, కన్నా.. రాయపాటిపై పరువు నష్టం దావా వేశారు. సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం ఇటీవ‌లే క‌న్నా ల‌క్ష్మీనారాయణ తాను దాఖలు చేసిన పరువు నష్టం దావాను వెనక్కి తీసుకున్న విష‌యం తెలిసిందే. కన్నా కేసు వెనక్కు తీసుకోవడం వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నార‌నేది తెలిసిందే.