ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన వైసీపీని నామరూపాల్లేకుండా చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ఏపీలో అసలు వైసీపీ అనే పేరే వినిపించకుండా చేయాలనేది టీడీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే వివాదాస్పదమైన ఆ పార్టీ కార్యాలయాల కూల్చివేతకు ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అత్యవసర సర్క్యులర్ జారీ చేసింది.
పట్టణ ప్రాంతాల్లో వైసీపీ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయ్? వాటి నిర్మాణాల పరిస్థితి ఏంటి? అనుమతులున్నాయా? వైసీపీ కార్యాలయాలకు సంబంధించి రిమార్క్స్ గురించి అత్యవసరంతా తెలియజేయాలంటూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్మించినవే కాదు, ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేసుకున్న వైసీపీ కార్యాలయాలపై ప్రభుత్వం దృష్టి సారించడం చర్చనీయాంశమైంది.
వైసీపీ కార్యాలయాలకు సంబంధించి ఏవైనా లోపాలుంటే కూల్చివేయడం లేదా మూసి వేయించడమే ఏకైక లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ మేరకు ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో అనే చర్చ మొదలైంది.
ప్రస్తుతం ఏపీలో అనారోగ్య రాజకీయ వాతావరణం నెలకుందనేది వాస్తవం. ఇలా అధికార మార్పిడి జరిగినప్పుడు పరస్పరం కక్షపూరిత చర్యలకు దిగితే, వీటికి అంతం అనేది ఎక్కడ? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.