జనసేనాని పవన్‌కల్యాణ్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. టీడీపీతో పొత్తుపై ఇవాళ పవన్‌కల్యాణ్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు ఏకపక్షంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించడాన్ని తప్పు పడుతూ, తనపై కూడా ఒత్తిడి ఉందంటూ పవన్ కూడా తమ పార్టీ పోటీ చేసే రెండు నియోజకవర్గాలను ప్రకటించి తన వైఖరి ఏంటో తేల్చి చెప్పారు.
ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటన కాక రేపుతోంది. పొత్తులపై బీజేపీ అగ్రనేతలతో చర్చించడానికి పవన్ ఢిల్లీ వెళుతున్నారని ప్రచారం జరుగుతోంది. అధికారికంగా బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. ప్రధాని మోదీతో పాటు బీజేపీ జాతీయ నాయకత్వంపై పవన్ ప్రతి సందర్భంలోనూ గౌరవాభిమానాల్ని చాటుకుంటున్నారు. దీంతో బీజేపీతో ఎలాంటి అవగాహన కుదుర్చుకుంటారనే చర్చకు తెరలేచింది.
మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకోడానికి బీజేపీ జాతీయ నాయకత్వం సిద్ధంగా లేదనే ప్రచారం జరుగుతోంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా? వద్దా? అనే నిర్ణయాన్ని జాతీయ నాయకత్వానికే అప్పగిస్తూ, ఏకగ్రీవ తీర్మానాన్ని ఏపీ బీజేపీ చేసి పంపింది. అయినా బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశమే బీజేపీకి వుంటే, ఈ పాటికి ఎప్పుడో తన నిర్ణయాన్ని ప్రకటించేదని అంటున్నారు.
తాజాగా టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని పవన్‌కల్యాణ్ ఆగ్రహించడంతో ఆ పార్టీ షాక్‌కు గురైంది. పవన్‌కల్యాణ్ తమని విడిచి బీజేపీతోనే ఎన్నికలకు వెళ్తారేమో అనే భయం టీడీపీని వెంటాడుతోంది. తమతో పొత్తు వద్దనుకుంటున్న బీజేపీ, ఢిల్లీకి పవన్‌ను పిలిపించుకుని, జనసేన కూడా దూరం ఉండేలా బ్రెయిన్ వాష్ చేస్తారేమో అని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.
ప్రభుత్వాల్నే రాత్రికి రాత్రి మార్చే బీజేపీ, పొత్తును విచ్ఛిన్నం చేయడం పెద్ద సంగతేమీ కాదని టీడీపీ నేతలు అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తులాట వేడి పుట్టిస్తోంది.