రిపబ్లిక్ డేని పురస్కరించుకుని జాతీయ జెండా ఎగుర వేసిన అనంతరం జనసేన అధిపతి పవన్‌కల్యాణ్ చేసిన కామెంట్స్ ఆ పార్టీకి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వచ్చినంత ఆనందం. ఎప్పుడూ లేనంత జోష్ జనసేనలో కనిపిస్తోంది. టీడీపీ కబంధ హస్తాల నుంచి జనసేనకు విముక్తి కలిగినంత సంబరం ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.
పొత్తును వ్యతిరేకించే వాళ్లందరినీ వైసీపీ కోవర్టులుగా చూస్తానని, అలాంటి వాళ్లంతా జగన్ నీడకే వెళ్లాలని హెచ్చరించిన పవన్‌కల్యాణే, తాజాగా క్షమాపణలు చెప్పడం ఆ పార్టీ శ్రేణులకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. పవన్ మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో జనసేనలో ఆందోళన చెలరేగిందన్నారు. దీనిపై తనను అడిగిన పార్టీ నేతలకు క్షమాపణలు చెబుతున్నా అని ఆయన అన్నారు.
పవన్ క్షమాపణలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం వుంది. జనసేన ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలా టీడీపీ వ్యవహరించిందని, కాపాడాల్సిన బాధ్యత గల స్థానంలో వుంటూ ఏమీ చేయలేకపోయానని, కావున క్షమించాలని ఆయన అడిగినట్టు అర్థం చేసుకోవాలని జనసేనాని అభిమానులు అంటున్నారు. టీడీపీతో పొత్తులో ఉన్న కారణంగా ఆ పార్టీ నేతలపై ఎవరూ మాట్లాడొద్దని, పొత్తును వ్యతిరేకిస్తే బయటికి పంపిస్తాననే పవన్ వార్నింగ్‌ను చంద్రబాబు, లోకేశ్ తదితర పచ్చ పార్టీ నేతలంతా సాకుగా తీసుకుని, పెత్తనం చేయడం మొదలు పెట్టారు.
అందుకే పవన్‌ను కూడా ఖాతరు చేయకుండా సీఎం పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల్ని కూడా తమకు తాముగా ప్రకటిస్తూ వెళుతున్నారు. సహజంగానే ఈ ధోరణిపై జనసేన శ్రేణులు తీవ్ర క్షోభకు గురి అవుతున్నాయని పవన్ దృష్టికి వెళ్లింది. అవకాశవాద పార్టీ …టీడీపీ కోసం సొంత పార్టీ శ్రేణుల మనోభావాలను హర్ట్ చేసేలా కోవర్టులనే కామెంట్ చేసిన విషయాన్ని పవన్ గ్రహించారు. అయితే సొంత పార్టీ శ్రేణులకి క్షమాపణ చెప్పే సమయం కోసం పవన్ ఎదురు చూశారు.
ఇందుకు రిపబ్లిక్ డే సరైన రోజని ఆయన భావించారు. పనిలో పనిగా టీడీపీపై ఆగ్రహం ప్రదర్శించడంతో పాటు తన వాళ్లను మంచి చేసుకునేందుకు క్షమాపణలు చెప్పడానికి కూడా ఆయన వెనుకాడకపోవడం గమనార్హం. పవన్‌లో వచ్చిన మార్పు జనసేన శ్రేణుల్లో జోష్ నింపింది. రానున్న రోజుల్లో టీడీపీతో సంబంధం లేకుండానే బరిలో దిగడానికి సై అని ఆ జనసేన నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా చెబుతున్నారు.