కాళ్లు పట్టుకుని పొత్తు పెట్టుకున్నది ఇందుకేనా బాబూ!

చంద్రబాబునాయుడు స్నేహంలో ఉండే విషపుబుద్ధులను ఒకసారి స్వయంగా అనుభవించిన వారు.. మరోసారి ఆయనతో స్నేహం చేయాలని అనుకోరు. 2014లో పొత్తు పెట్టుకున్న తర్వాత.. ఆ పదవీకాలం ముగిసే సమయానికి, రాష్ట్ర పురోగతి విషయంలో తన…

చంద్రబాబునాయుడు స్నేహంలో ఉండే విషపుబుద్ధులను ఒకసారి స్వయంగా అనుభవించిన వారు.. మరోసారి ఆయనతో స్నేహం చేయాలని అనుకోరు. 2014లో పొత్తు పెట్టుకున్న తర్వాత.. ఆ పదవీకాలం ముగిసే సమయానికి, రాష్ట్ర పురోగతి విషయంలో తన చేతగానితనం మొత్తం మోడీ మీద నెట్టేయడానికి ఆ పొత్తుల్లోంచి బయటకు వచ్చి.. చంద్రబాబునాయుడు ఎన్నెన్ని నిందలు వేశారో అందరికీ తెలుసు. హఠాత్తుగా అప్పటికప్పుడు ప్రత్యేకహోదా మీద ప్రేమ కురిపిస్తూ ధర్మపోరాట దీక్షలు నిర్వహించి.. ప్రధాని నరేంద్రమోడీని ఎన్ని రకాలుగా నిందించారో అందరికీ తెలుసు.

అంత జరిగిన తర్వాత మళ్లీ మోడీ, చంద్రబాబును తన ఎన్డీయే జట్టులో కలుపుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. మూడు పార్టీలను మళ్లీ  కలపడానికి పవన్ కల్యాణ్ పూనుకున్నప్పుడు అది ఒక పట్టాన కుదిరేపని కాదని పై విషయాలు తెలిసిన ప్రజలంతా అనుకున్నారు. అయితే తాను బిజెపిలోని ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుని, వారితో తిట్లు తిని ఒప్పించానని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పుకున్నారు.

చంద్రబాబు కూడా కాళ్లు పట్టుకునే రేంజిలోనే బతిమాలి పొత్తులకు ఒప్పించుకుని ఉంటారు. ఎందుకంత పరితపించారు.. అని తెలుగుదేశం వారు అనుకుని ఉండవచ్చు. ఇవాళ పోలింగు సందర్భంగా జరిగిన పరిణామాలను గమనిస్తే.. చంద్రబాబు, ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుని పొత్తు పెట్టుకున్నది ఇందుకేనా అని అనిపించక మానదు.

రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఘర్షణలు  జరిగాయి. ఇరు పార్టీలు కూడా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటూ వచ్చిన నేపథ్యంలో ఇలాంటి ఘర్షణలు జరగడం అతిశయం కాదు. అయితే దాదాపుగా రాష్ట్రంలో ప్రతిచోట కూడా.. పోలీసులు ఎన్నికల సంఘం అబ్జర్వర్లు తెలుగుదేశం వారికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

పోలింగ్ ముగిసిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెస్ మీట్ నిర్వహించి ఇవాళ్టి పరిణామాలను సమీక్షించిన సజ్జల రామక్రిష్ణారెడ్డికూడా ఇదే విషయం ప్రకటించారు. ఎన్నికల సంఘం అధికారులు, అబ్జర్వర్లు, పోలీసు అబ్జర్వర్లు కూడా తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కు అయినట్టుగా ఇవాళ పోలింగ్ జరిగిందని అన్నారు. ఈసీని కూడా కుమ్మక్కు చేసుకోవడానికే చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకున్నారని కూడా ఆరోపించారు.

ఇవాళ్టి పరిణామాల్లోనే కొందరు పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం, ఇప్పటికిప్పుడు పక్కన పెట్టడం, వైసీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి గృహనిర్భంధం చేయడం.. తెలుగుదేశం వారు దాడులకు విచ్చలవిడిగా తెగబడిన చోట్ల పెద్దగా చర్యలు లేకపోవడం ఇవన్నీ గమనిస్తే.. సజ్జల ఆరోపణలు కూడా నిజమే అనిపిస్తోంది. చంద్రబాబు పొత్తులు పెట్టుకోవడానికి ఒక మెట్టు తగ్గినా.. తన కుట్ర ప్రయోజనాలను నెరవేర్చుకున్నారని అనిపిస్తోంది.