టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య ర‌చ్చ కొన‌సాగింపు!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పిఠాపురంలో అనూహ్యంగా జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య ర‌చ్చ రోజుకో రీతిలో సాగుతోంది. రెండు రోజుల క్రితం పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ వ‌ర్మ‌పై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు దాడికి తెగ‌బ‌డ్డ సంగ‌తి…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పిఠాపురంలో అనూహ్యంగా జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య ర‌చ్చ రోజుకో రీతిలో సాగుతోంది. రెండు రోజుల క్రితం పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ వ‌ర్మ‌పై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు దాడికి తెగ‌బ‌డ్డ సంగ‌తి తెలిసిందే. త‌న‌పై కాకినాడ ఎంపీ ఉద‌య్ వ‌ర్గీయులు హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డార‌ని వ‌ర్మ ఆరోపించారు. అయితే దాడి ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌న‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కానీ నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇంత వ‌ర‌కూ అలాంటి ప్ర‌య‌త్న‌మే జ‌ర‌గ‌లేదు.

అదే పిఠాపురంలో మ‌రో రూపంలో టీడీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ర‌చ్చ జ‌రిగింది. తాటిప‌ర్తి గ్రామంలో అప‌ర్ణ‌దేవి అమ్మ‌వారి పాల‌క మండలి విష‌య‌మై ఇరు పార్టీల మ‌ధ్య వివాదం చెల‌రేగ‌డం గ‌మనార్హం. ఇది చూడ‌డానికి చిన్న వివాద‌మ‌ని అనిపించినా, ఆ రెండు పార్టీల మ‌ధ్య విభేదాల్ని ప్ర‌తిబింబిస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌భుత్వం మారిన నేప‌థ్యంలో తాటిప‌ర్తి అప‌ర్ణ‌దేవి అమ్మ‌వారి ఆల‌య పాల‌క‌మండలి త‌ప్పుకుంది. ఈ బాధ్య‌త‌ల్ని జ‌న‌సేన నాయ‌కుల‌కు పాల‌క మండ‌లి అప్ప‌గించింది. అయితే పాల‌క మండ‌లిని త‌మ‌కు అప్ప‌గించాలంటూ టీడీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. దీంతో ఆల‌యంలో రెండు పార్టీల కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ప‌ర‌స్పరం కొట్టుకునే వ‌ర‌కూ వెళ్లింది. ఒక‌రినొక‌రు తోసుకున్నారు. స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల మ‌ధ్య ప‌విత్ర ఆల‌యంలో అశాంతి వాతావ‌ర‌ణం నెల‌కుంది.

త‌మ‌కు కాకుండా జ‌న‌సేన ఆల‌య పాల‌క మండలి బాధ్య‌త‌ల్ని తీసుకోడానికి వీల్లేదంటూ టీడీపీ నాయ‌కులు హెచ్చ‌రించారు. టీడీపీకి ఇచ్చే ప్ర‌శ్నే లేద‌ని జ‌న‌సేన తేల్చి చెప్పింది.  వివాదం ముదురు తుండ‌డంతో పోలీసులు ప్ర‌వేశించారు. ప‌వ‌న్ గెలుపు కోసం ప‌ని చేసిన త‌మ‌ను జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు నీచంగా చూస్తున్నార‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. పిఠాపురంలో టీడీపీ పెత్త‌నం ఏంట‌నేది జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ప్ర‌శ్న‌. ఈ వైఖ‌రే రెండు పార్టీల మ‌ధ్య గొడ‌వ‌కు దారి తీసింది.