ఓడిపోయిన వైసీపీ అభ్యర్థులు ఒక్కొక్కరుగా మీడియా ముందుకొస్తున్నారు. తమ ఓటమికి దారి తీసిన పరిస్థితుల్ని వివరిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసారి రాంభూపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ల్యాండ్ టైటిల్ యాక్ట్ తమ పార్టీ కొంప ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకూ తాము వెళ్లినప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించే ప్రజలు అడిగారని ఆయన గుర్తు చేశారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్, అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే వారెవరూ తమ గోడు పట్టించుకోలేదన్నారు. అంతేకాకుండా, ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను సమర్థించుకున్నారన్నారు. కానీ ప్రత్యర్థులు మాత్రం పనిగట్టుకుని ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేశారని ఆయన అన్నారు.
దీంతో వారం, పది రోజుల్లోనే మొత్తం సీన్ మారిపోయిందన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తమను బాగా దెబ్బ తీసిందని రాంభూపాల్‌రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ వెంట తిరిగే రైతులు కూడా ప్రత్యర్థుల మాటలు నమ్మారన్నారు. పాసు పుస్తకాలపై జగన్ ఫొటోలు పెట్టుకున్నారని, లాక్కుంటారనే ప్రచారాన్ని చాలా మంది నమ్మారని ఆయన చెప్పుకొచ్చారు. తమ భూములు గుంజుకుంటారనే భయంతో టీడీపీకి ఓటు వేసినట్టు ప్రజలు చెబుతున్నారన్నారు.
తమను ఎవరూ ఓడగొట్టలేదన్నారు. తమను తామే ఓడగొట్టుకున్నట్టు ఆయన చెప్పారు. చేజేతులా కొన్ని తప్పులు చేశామన్నారు. ఇసుక పాలసీ కూడా తమకు మైనస్ అన్నారు. మందుబాబులు కూడా తమను దెబ్బతీశారన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, లక్ష రూపాయల రుణమాఫీ చెబుతామని జగన్‌కు సూచించామన్నారు. కానీ ప్రజల్ని ఏ విధంగా మోసగిస్తామని జగన్ ప్రశ్నించారన్నారు. చేయగలిగేదే చెప్పాలనేది జగన్ ఉద్దేశమన్నారు. కానీ టీడీపీ మేనిఫెస్టోలో చాలా లబ్ధి కలిగించే అంశాలున్నాయని, అందువల్లే ఓట్లు వేశారన్నారు.