లోకేశ్ పాదయాత్రపై టీడీపీ ఆసక్తల్లా.. కేవలం ముగింపు పైనే. ఈ ఏడాది జనవరి చివరి వారంలో తన తండ్రి చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర మొదలు పెట్టారు. ఇవాళ్టికి ఆయన పాదయాత్ర 172వ రోజుకు చేరింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని కెలంపల్లి శివారు క్యాంప్ సైట్ నుంచి మంగళవారం పాదయాత్ర ప్రారంభించారు.
ఈ రోజు ప్రకాశం జిల్లాలో పాదయాత్ర ముగించుకుని గుంటూరు జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ఇటీవల ఉద్రిక్తతకు దారి తీసిన వినుకొండలో లోకేశ్ అడుగు పెట్టనున్నారు. 2200 కిలోమీటర్లకు పైగా లోకేశ్ ఇప్పటి వరకు నడక సాగించారు. లోకేశ్ పాదయాత్రకు సంబంధించి ప్రధానంగా టీడీపీ దృష్టి రోజులు, కిలోమీటర్లు మాత్రమే. అంతకు మించి పాదయాత్ర ద్వారా లోకేశ్ ఏమైనా నేర్చుకుంటున్నారా? ప్రజల్లో టీడీపీ ప్రాభవం పెంచుతున్నారా? తదితర అంశాలను ఆ పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు.
కేవలం లోకేశ్ పాదయాత్ర చేస్తున్న ప్రాంతాల్లో మినహాయించి, మిగిలిన ప్రాంతాల్లో కనీసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. యువగళం పాదయాత్ర లోకేశ్ నడతలో మార్పు వస్తుందని సొంత పార్టీ భావించింది. అయితే రోజురోజుకూ ఆయన చిల్లరగా మాట్లాడ్డమే తప్ప, మరోలా ఆయన వ్యవహరించడం లేదనే చర్చ జరుగుతోంది. పాదయాత్రలో భాగంగా స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం, ప్రత్యర్థులకు తనకిష్టమొచ్చిన పేర్లు పెట్టడం మినహా, ఆయన చేస్తున్నదేమీ లేదనే టాక్ నడుస్తోంది.
లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకి పెద్దగా మైలేజీ వచ్చిన దాఖలాలు లేవు. అందుకే లోకేశ్‌ను జనంతో పాటు ప్రత్యర్థులు కూడా లైట్ తీసుకున్నారు. 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర ఎప్పుడెప్పుడు ముగుస్తుందా? అని టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నట్టు వారి మాటలు చెబుతున్నాయి.
లోకేశ్ కూడా జనంతో మాట్లాడ్డం కంటే, ఎక్కువ దూరం నడవడంపైనే ఆసక్తి చూపుతున్నారు. లోకేశ్‌లో పాదయాత్ర మార్పు తీసుకురాలేదనేందుకు ఇదే నిదర్శనం. లక్ష్యాన్ని మరిచి, 4 వేల కిలోమీటర్లపైనే ఆయన దృష్టి వుంది. ఇదే కోణంలో ఆ పార్టీ నాయకులు కూడా ఆలోచిస్తుండడం గమనార్హం.