తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టి వేయాలని కోరుతూ కొప్పుల హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై కొప్పులకు సానుకూల ఫలితం రాలేదు. ఆయన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. తుది వాదనలు వినాల్సి వుందని హైకోర్టు తెలిపింది.
2018లో ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ నుంచి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌కుమార్‌పై స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. దీంతో రీకౌంటింగ్‌కు లక్ష్మణ్ దరఖాస్తు చేసుకున్నారు. రీకౌంటింగ్ తర్వాత ఈశ్వర్ గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. రీకౌంటింగ్‌లో గోల్మాల్ జరిగిందని, న్యాయం చేయాలని లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు.
కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదని, తననే విజేతగా ప్రకటించాలని లక్ష్మణ్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే తన ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్‌ను కొట్టి వేయాలని కొప్పుల వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ఆయన పిటిషన్‌ను కొట్టి వేయడంతో కొప్పుల షాక్‌కు గురయ్యారు. ఇటీవల కాలంలో ఇలాంటి పిటిషన్లలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది, ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వనమా గెలుపును సవాల్ చేస్తూ న్యాయ పోరాటం చేసిన ఆయన ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు గెలుపొందినట్టు కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అలాగే మహబూబ్‌నగర్ నుంచి గెలుపొందిన శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ రాఘవేంద్రరాజు అనే ఓటరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, కొట్టేయాలని శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. మంత్రి పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. గౌడ్ ఎన్నికపై నిగ్గు తేల్చేందుకే హైకోర్టు మొగ్గు చూపింది. తాజాగా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్‌పై తుది తీర్పు ఉత్కంఠ రేపుతోంది.