బార్ లైసెన్సులపై ఇక రచ్చ షురూ అయ్యేనా?

ఏపీ ప్రభుత్వం బార్ లైసెన్సులకు వేలం నిర్వహించింది. రెండో విడత బార్ల వేలంలో.. పాటదారులు కుమ్మక్కు అయినట్టుగా, సిండికేట్ అయి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూర్చినట్టుగా కథనాలు వస్తున్నాయి. ఎప్పటిలాగానే ఈ వ్యవహారాన్ని…

ఏపీ ప్రభుత్వం బార్ లైసెన్సులకు వేలం నిర్వహించింది. రెండో విడత బార్ల వేలంలో.. పాటదారులు కుమ్మక్కు అయినట్టుగా, సిండికేట్ అయి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూర్చినట్టుగా కథనాలు వస్తున్నాయి. ఎప్పటిలాగానే ఈ వ్యవహారాన్ని పచ్చమీడియా ప్రచారంలో పెడుతోంది. ఇక దీనిని పచ్చ పార్టీ తెలుగుదేశం అందిపుచ్చుకుంటుంది. ద్రోహం జరిగిపోయింది. నష్టం వచ్చేసింది. వైసీపీ నాయకులు వేల కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. అందులో ఫలానా ఫలానా వాళ్లకు వాటాలు వెళ్లబోతున్నాయి.. అంటూ నానా యాగీ చేయడానికి తెలుగుదేశం శ్రేణులు సిద్ధం అయిపోతాయి. 

తెలుగుదేశం నాయకులు అంతా ‘దున్నపోతు ఈనింది అంటే.. గాటన కట్టేయమనే’ బాపతు మేధావులు! వారు ముందు వెనుకలు చూసుకోరు. నిజానిజాలు తర్కించుకోరు. పచ్చమీడియా తమ వార్తలతో సిగ్నల్ ఇవ్వగానే.. ఇక ప్రభుత్వం మీద విమర్శలకు ఎగబడిపోతారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో అనిపిస్తోంది. 

మద్యం షాపులు, బార్లు అనేవి సాధారణంగా లిక్కర్ సిండికేట్లు, ముఠాల ఆధ్వర్యంలోనే నడుస్తాయి. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్.. ఇలా ప్రభుత్వాలు ఎవరివైనా లిక్కర్ వ్యాపారం లోకల్ సిండికేట్ చేతిలోనే ఉంటుంది. లాభాలను అందరూ పంచుకుంటారు. ప్రభుత్వం తాజాగా నిర్వహించిన బార్ల ఈ వేలంలో కూడా ఇదే జరిగిందనేది పచ్చ మీడియా కథనం. 

నిజానికి ప్రభుత్వం పారదర్శకంగా ఉండడం కోసం ఈ వేలం నిర్వహించింది. ఈ వేలం అంటేనే.. సిండికేట్ కావడానికి అవకాశాలను తగ్గించడం అవుతుంది. అయితే.. కుమ్మక్కు అయిపోయారు, కూడబలుక్కున్నారు.. ఖజానాకు గండికొట్టారు లాంటి కథనాలు రాస్తున్నారు. స్థానికంగా లిక్కర్ వ్యాపారుల మధ్య తీవ్ర విద్వేషాలు, వ్యక్తిగత కక్షలు ఉండే చోట్ల తప్ప.. ప్రతిచోటా లిక్కర్ సిండికేట్ వ్యాపారాన్ని నడిపిస్తుంటుంది. వ్యాపారం వేరు- రాజకీయం వేరు అనే సూత్రం ఆధారంగానే ఈ రంగం తొలినుంచి పనిచేస్తోంది. 

అదంతా కూడా తప్పే కదా అనుకున్నప్పటికీ.. పచ్చ మీడియా ఇప్పుడు జరిగిన వేలంలో కూడబలుక్కున్నట్టుగా ఎందుకంత యాగీ చేస్తున్నదో అర్థం కావడం లేదు. మొత్తం 494 బార్లకువేలం నిర్వహిస్తే.. 679 మంది వేలంలో పాల్గొనేందుకు అర్హత సాధించారు. కానీ ఈ వేలంలో 629 మంది మాత్రమే పాల్గొన్నారట. అంటే అర్హత సాధించిన వారిలో గైర్హాజరైంది కేవలం 50 మంది మాత్రమే. ఈ వ్యాపారులు సిండికేట్ కావడం అనేది జరిగి ఉంటే గనుక.. 494 బార్లకు కేవలం, 679 మంది అర్హత సాధించినప్పుడే అది జరిగింది. కనీసం మూడింట రెండొంతుల బార్లకు పోటీ లేకుండా ఒక్కరే అర్హత సాధించినట్టు ఆనాడే తేలిపోయింది. అంటే ఆ ఒక్కరూ ఎంత పాట పాడితే అదే ఫైనల్ అవుతుంది. పచ్చమీడియా మాత్రం.. ఏదో ఘోరం జరిగిపోయినట్లుగా రచ్చరచ్చ చేస్తోంది.

ఈ ప్రచారాన్ని పట్టుకుని.. తెలుగుదేశం పార్టీ కొత్త రచ్చ ప్రారంభించే అవకాశం ఉంది. బార్ల లైసెన్సులను రద్దు చేయండి.. ఇందులో పెద్ద కుంభకోణం జరిగింది. వీటిని తక్షణం రద్దు చేసి.. తిరిగి పాట నిర్వహించాలి అంటూ గోల చేయడానికి అవకాశం ఉంది. అది మాత్రమే కాకుండా, తెలుగుదేశానికి అలవాటు ఉన్న ప్రకారం.. ఈ వ్యవహారం మీద కోర్టును ఆశ్రయించడానికి కూడా అవకాశం ఉంది. అనేకానేక బార్లకు ఒక్కరు మాత్రమే అర్హత సాధించి పాట పాడిన వైనం చూసి కోర్టు విస్మయం వ్యక్తం చేసినా ఆశ్చర్యం లేదు. 

అయినా.. ఈ బార్ల వేలాన్ని తగినంత మంది పాటదారులు రానందువల్ల రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తాం అని చెప్పడానికి ప్రభుత్వానికి ఎన్నటికీ అధికారం ఉంటుంది. కాకపోతే.. తెలుగుదేశం దీనిమీద ఎంత గోల చేస్తుందో.. ఏ రకంగా వక్రప్రచారాలతో బురద చల్లుతుందో చూడాలి.